కరోనా కలవరం..కారణమేంటి..?

తాజా వార్తలు

Updated : 27/02/2021 12:46 IST

కరోనా కలవరం..కారణమేంటి..?

కొత్త రకాలా.. లేక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లా..

దిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, చత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతుండటం కలవరపెడుతోంది. కరోనా కొత్త రకాలు ఈ ఉద్ధృతికి కారణమా..?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ వైద్య నిపుణులు మాత్రం సూపర్‌ స్ప్రెడర్ ఈవెంట్లే ఈ వ్యాప్తికి కారణమని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఓ వార్త సంస్థ నివేదిక వెలువరించింది.

కొత్త రకాలా..ఆధారాల్లేవ్..!

‘కరోనా వైరస్ కొత్త రకాల వల్లే మహారాష్ట్రలో మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు ఈ సమూహ వ్యాప్తికి దారితీస్తున్నాయి. బాధితులను గుర్తించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్‌ విధానాలను తగినమేర అమలు చేయకపోవడం ఈ కేసుల పెరుగుదలకు దోహదం చేస్తోంది’ అని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్‌) రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వి.రవి వెల్లడించారు. ఆయన కరోనా వైరస్‌ జన్యు నిర్ధారణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంలో నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ తరహా వైరస్‌లో అయినా ఉత్పరివర్తన సహజమేనని తెలిసిన విషయమే. ఒక్కోసారి అవి వైరస్ పనితీరుపై అంతగా ప్రభావం చూపవు. ఆ మార్పులు వైరస్‌ను బలహీనం చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొత్త రకాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. రోగనిరోధక శక్తిని దెబ్బతీసి, తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటాయి. కరోనాకు సంబంధించి వెలుగుచూసిన బ్రిటన్, దక్షిణాఫ్రికా రకాలు ఆ కోవకు చెందనవేనని వెల్లడించారు. వైరస్ ఎంతగా దాని స్థానాలను మార్చితే(సర్య్కులేట్) అంతగా ఉత్పర్తివర్తనం చెందుతుందని వారు వెల్లడించారు. 

గతేడాదే గుర్తించాం..

కాగా, కరోనాకు సంబంధించి మనదేశంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో N440K, E484Q వైరస్ కొత్త రకాలను గుర్తించారు. అయితే తమ రాష్ట్రంలో తాజా విజృంభణకు ఈ రెండు రకాలు కారణమని చెప్పలేమని మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ రెండు రకాలు భారత్‌లో మాత్రమే కనిపించలేదని,  ఇతర దేశాల్లో కూడా వాటిని గుర్తించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అంతేకాకుండా E484Q రకాన్ని గతేడాది మార్చి, జులైలోనే మహారాష్ట్రలో గుర్తించినట్లు వెల్లడించడం గమనార్హం. అలాగే N440K రకాన్ని గతేడాది మే, సెప్టెంబర్‌లలో 13 సందర్భాల్లో కనుగొన్నట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోంలో దాని ఆనవాలు కనిపించినట్లు చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలిపింది. 

కాగా, కొత్త సంవత్సరానికి ఈ ప్రపంచం టీకాతో ఆనందంతో స్వాగతం పలకగా..బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి కొత్త రకాలు వెలుగుచూసి ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనలోకి నెట్టేశాయి. మనదేశంలో తాజా విజృంభణకు కొత్త రకాలు కారణం కాకపోవచ్చని నిపుణులు చెప్తున్నప్పటికీ..వైరస్ ఎంతగా సర్క్యులేట్ అయితే అంతగా పరివర్తన చెందుతుందని అంటున్నారు. ఆ ఉత్పవరివర్తనాన్ని కట్టడి చేయాలంటే..మాస్కులు ధరించడం, బౌతిక దూరం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాల్సిందేని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని