CDS Bipin Rawat: తాలిబన్ల ఆక్రమణ.. ముందుగా ఊహించిందే..!

తాజా వార్తలు

Published : 25/08/2021 23:09 IST

CDS Bipin Rawat: తాలిబన్ల ఆక్రమణ.. ముందుగా ఊహించిందే..!

భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

దిల్లీ: తాలిబన్‌ ఆక్రమిత అఫ్గానిస్థాన్‌ నుంచి ఏమైనా ఉగ్రవాద చర్యలు మొదలై, అవి భారత్‌ వైపు దూసుకొస్తే అటువంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని భారత త్రివిధ దళాధిపతి (చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తోన్న పోరులో క్వాడ్‌ దేశాలు సహకారం మరింత పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఇక అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకోవడంపై స్పందించిన జనరల్‌ రావత్‌, అది ముందుగా ఊహించినదేనని అన్నారు. ‘ఇండియా-యూఎస్‌ పార్ట్నర్‌షిప్‌: సెక్యూరింగ్‌ 21 సెంచరీ’ అనే అంశంపై అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ముఖాముఖిలో పేర్కొన్నారు.

తాలిబన్ల తీరులో మార్పు లేదు..

‘అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంలో భాగంగా తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. మరో రెండు నెలల తర్వాత ఇలా జరగవచ్చని ఊహించాం. కానీ, గడిచిన రెండు దశాబ్దాల్లో తాలిబన్‌ల బృందంలో ఎటువంటి మార్పూ కనిపించలేదు’ అని సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ నుంచి వస్తోన్న నివేదికలను బట్టి చూస్తే కేవలం వారి భాగస్వామ్య పక్షాల్లో మాత్రమే మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని.. తాలిబన్ల ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదన్నారు. గత 20ఏళ్ల క్రితం ఉన్న తాలిబన్లే ఇప్పుడు కనిపిస్తున్నారని జనరల్‌ బిపిన్‌ రావత్‌ అభిప్రాయపడ్డారు.

ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొంటాం..

అఫ్గాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అఫ్గాన్‌ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లోకి ఎలా ప్రవేశిస్తాయనే విషయంలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. ఇక అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపై మాట్లాడిన అమెరికా అడ్మిరల్‌ జాన్‌ సీ ఆక్విలినో.. అమెరికాతో పాటు మిత్రదేశాల పౌరులను అఫ్గాన్‌ నుంచి తరలించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. పౌరులను సురక్షితంగా తరలించడంలో భారత్‌తో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని జాన్‌ సీ ఆక్విలినో వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని