
తాజా వార్తలు
ఆ 136 మంది చనిపోయినట్లే..!
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు, రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. గల్లంతైన వారిని ‘‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం’’ అని ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిబ్రవరి 7న ధౌలిగంగాలో మంచుచరియలు విరిగిపడటంతో నది ఉప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ జల విలయానికి ఓ విద్యుత్ కేంద్రంతో పాటు ఐదు వంతెనలు కొట్టుకుపోగా.. మరో విద్యుత్కేంద్రం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ వరదల్లో 204 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటివరకు 68 మృతదేహాలను గుర్తించారు. ఒక్క తపోవన్ సొరంగంలోనే 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 136 మంది ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదం జరిగి రెండు వారాలు దాటినా వీరి ఆచూకీ తెలియకపోవడంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రమాదం సమయంలో తపోవన్ విద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకున్న కొంతమందిని సహాయకసిబ్బంది రక్షించారు.