ఆకాశంలో జాబిల్లి అద్భుతాలు

తాజా వార్తలు

Published : 26/05/2021 17:18 IST

ఆకాశంలో జాబిల్లి అద్భుతాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆకాశంలో అద్భుతదృశ్యం ఆవిష్కృతం కానుంది. వైశాఖ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో నిండు చంద్రుడు నేడు అరుణవర్ణంలో కనువిందు చేయనున్నాడు. దీన్నే ‘బ్లడ్‌ మూన్‌’గా పిలుస్తారు. అంతేనా.. ఈ రోజున చందమామ ‘సూపర్‌మూన్‌’గా కన్పించనున్నాడు.  ఇంతకీ  జాబిల్లిలో ఈ మార్పులేంటి.. అవి ఎలా ఏర్పడుతాయి..?

సూపర్‌ మూన్‌ అంటే..

చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ‘సూపర్‌మూన్‌’గా పిలుస్తారు. భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాడు. ఈ కక్ష్యలో భూమికి అతి దగ్గరగా ఉండే స్థానాన్ని పెరీజీ అంటారు. జాబిల్లి ఈ పాయింట్‌కు దాదాపు చేరువైనప్పుడు ‘సూపర్‌ మూన్‌’గా చెబుతారు.  సాధారణంగా ఏడాదికి 12 లేదా 13 పౌర్ణమి రోజులు వస్తాయి. అందులో కనీసం మూడు, నాలుగు సూపర్‌మూన్‌లు ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న జాబిల్లి భూమికి చేరువగా వచ్చి సూపర్‌మూన్‌గా కనువిందు చేసింది. మామూలు పౌర్ణమి రోజులతో పోలిస్తే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కన్పిస్తాడు. 

నేటి నిండు పున్నమిని ‘ఫ్లవర్‌ మూన్’గా కూడా పిలుస్తారు. ఈ పదం అమెరికా తెగల నుంచి వచ్చింది. వసంత కాలంలో వచ్చే పౌర్ణమిని అక్కడ ఫ్లవర్‌ మూన్‌ అని అంటారు. ఈ రోజున చంద్రుడు మరింత వెలుగులీనుతూ కన్పిస్తాడు. 2021లో కన్పించే నిండు జాబిల్లి అన్నింటిలో ఈ ఫ్లవర్‌ మూన్‌ అతిపెద్దది అని నాసా చెబుతోంది.

ఏంటీ బ్లడ్‌ మూన్‌..

చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చి ఇవన్నీ ఒకే వరుసలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే భూమి నీడ పూర్తిగా చంద్రుడిపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణంగా పిలుస్తారు. ఒక్కోసారి ఈ గ్రహణం సమయంలో సూర్యుడి కాంతి నేరుగా భూమిపై పడి.. అక్కడి గాలి ద్వారా పరావర్తనం చెంది చంద్రుడిపై పడుతుంది. ఆ సమయంలో జాబిల్లి ఎరుపు, నారింజ కలగలిన రంగులో కన్పిస్తాడు. దాన్నే ‘బ్లడ్‌ మూన్‌’గా పిలుస్తారు. 

భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 3 తర్వాత నుంచి సాయంత్రం 6.23 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. అమెరికా, కెనెడా, మెక్సికో, చిలీ, అర్జెంటినా తదితర దేశాల్లో పూర్తిగా కన్పిస్తుంది. మనదేశంలో కేవలం ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల వారికే ఈ అద్భుతం కన్పిస్తుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని