బెదిరింపులకు తలొగ్గను : థన్‌బర్గ్‌

ప్రధానాంశాలు

Published : 05/02/2021 04:08 IST

బెదిరింపులకు తలొగ్గను : థన్‌బర్గ్‌

గ్రెటా షేర్‌ చేసిన టూల్‌కిట్‌ రూపకర్తలపై పోలీసు కేసు
భారత్‌ను అస్థిరపర్చే కుట్ర జరుగుతోందని వెల్లడి

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలకు స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ మద్దతు పలికిన వ్యవహారం తాజాగా అనేక మలుపులు తిరిగింది. రైతులకు సహాయం చేసేందుకు వీలు కల్పించేలా ఆమె ఓ టూల్‌కిట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేయగా.. దాని వెనుక ఖలిస్థానీ అనుకూల సంస్థ హస్తముందని దిల్లీ పోలీసులు ఆరోపించారు. దేశాన్ని అస్థిరపర్చే ప్రయత్నం జరుగుతోందంటూ కేసు నమోదు చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో చోటుచేసుకున్న హింస అచ్చం ఆ టూల్‌కిట్‌లోని ప్రణాళికల ప్రకారమే సాగినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు- థన్‌బర్గ్‌ మాత్రం బెదిరింపులకు తాను తలొగ్గబోనని స్పష్టం చేశారు. భారత్‌లో రైతులకు మద్దతు కొనసాగిస్తానని ప్రకటించారు. పోలీసులు కేసు నమోదుచేసిన అనంతరం ఈ మేరకు స్పందించారు. విద్వేషం, బెదిరింపులు తన వైఖరిని ఎన్నటికీ మార్చలేవని తేల్చి చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలపై పోరుబాట పట్టిన రైతులకు సంఘీభావం ప్రకటించిన థన్‌బర్గ్‌.. వారికి సహాయం చేసే మార్గాలను తెలియజేస్తూ తాజాగా ఓ టూల్‌కిట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే ఓ డాక్యుమెంట్‌ ప్రత్యక్షమవుతుంది. రైతుల పోరాటానికి ఎలా మద్దతు తెలియజేయొచ్చో అందులో ఉంటుంది. భారతీయ రాయబార కార్యాలయాల వెలుపల నిరసన తెలపడం, గణనీయ సంఖ్యలో ట్వీట్లు చేయడంవంటి మార్గాలను అందులో సూచించారు.
* టూల్‌కిట్‌ వ్యవహారంపై దిల్లీ పోలీసులు వేగంగా స్పందించారు. జాతి, మతం, భాష, నివాసం, జన్మస్థలం ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందంటూ కేసు నమోదు చేశారు. ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ ఆ లింక్‌ను రూపొందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ప్రత్యేక పోలీసు కమిషనర్‌ (నేరాలు) ప్రవీర్‌ రంజన్‌ విలేకర్ల సమావేశంలో తెలిపారు. భారత్‌లో సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే ప్రణాళిక దాని వెనుక దాగి ఉందన్నారు. టూల్‌కిట్‌ రూపొందించిన వారిపై (పేర్లు లేకుండా) నేరపూరిత కుట్ర, దేశద్రోహం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. థన్‌బర్గ్‌ సహా ఎవరి పేర్లనూ తాజా ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. సైబర్‌ సెల్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తుందని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన