టీకాతో బాహుబలిగా మారండి

ప్రధానాంశాలు

Updated : 20/07/2021 05:35 IST

టీకాతో బాహుబలిగా మారండి

ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దేశంలో ఇప్పటికే 40 కోట్ల మంది బాహుబలులున్నారని వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: బాహువు(భుజం)లకు కొవిడ్‌ టీకా వేయించుకోవడం ద్వారా ప్రతిఒక్కరూ బాహుబలిగా మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అప్పుడే కరోనాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంటు వెలుపల మోదీ సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘కరోనాపై పోరాడే బాహుబలిగా మారాలంటే.. ప్రతిఒక్కరూ బాహువుపై టీకా వేయించుకోవాలి. ఇప్పటివరకు 40 కోట్ల మంది బాహుబలులుగా మారారు. టీకా పంపిణీ ప్రక్రియ మున్ముందు మరింత వేగంగా సాగుతుంది. మహమ్మారి విశ్వమంతటినీ చుట్టుముట్టింది. మానవ జాతిని తన గుప్పిట్లోకి తీసుకుంది. దీనిపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

‘‘కరోనాపై చర్చలో ఎంపీలు మెరుగైన సూచనలివ్వాలి. అప్పుడే మహమ్మారిపై పోరాటంలో కొత్త విధానాలను అవలంబించడం వీలవుతుంది. ఏవైనా లోపాలున్నా సరిదిద్దుకోవడానికి మార్గం సుగమమవుతుంది. అన్ని పక్షాల నాయకులు మంగళవారం సాయంత్రం సమయం ఇస్తే.. మహమ్మారికి సంబంధించిన మొత్తం వివరాలను నేను తెలియజేస్తా. ఫ్లోర్‌ లీడర్లతో పార్లమెంటు లోపల, బయటా చర్చ జరగాలని మేం కోరుకుంటున్నాం. వర్షాకాల సమావేశాలు సజావుగా నడిచేలా సభాపక్ష నేతలు సహకరిస్తే బాగుంటుంది’’ అని మోదీ అన్నారు.

మాకూ సమయమివ్వండి

నిర్మాణాత్మక చర్చలకు పార్లమెంటు వేదిక కావాలని ప్రధాని అభిలషించారు. కరోనాకు సంబంధించి ప్రజలు కోరుకుంటున్న ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొవిడ్‌పై కఠినమైన ప్రశ్నలను సంధించాలని విపక్ష సభ్యులను ఆయన కోరారు. అదే సమయంలో సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వం ఆ ప్రశ్నలపై స్పందించేందుకు సమయమివ్వాలని విన్నవించారు. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలిసి ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన