డ్రెసెల్‌ మొదలెట్టాడు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:22 IST

డ్రెసెల్‌ మొదలెట్టాడు

ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు.. మైకెల్‌ ఫెల్ప్స్‌. ఈతకే పర్యాయ పదంగా మారిన ఈ దిగ్గజం.. విశ్వ క్రీడల్లో ఏకంగా 28 (23 స్వర్ణాలు) పతకాలు సాధించి.. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు సొంతం చేసుకున్న అథ్లెట్‌గా కొనసాగుతున్నాడు. ఈ సారి అతను లేకపోవడంతో ఫెల్ప్స్‌ స్థానాన్ని భర్తీ చేసే స్విమ్మర్‌ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా కనిపిస్తున్నాడు అమెరికాకే చెందిన డ్రెసెల్‌. ఫెల్ప్స్‌ వారసుడిగా పేరు తెచ్చుకున్న అతను.. బరిలో దిగిన తొలి పోటీలోనే పసిడి అందుకుని క్రీడలను ఘనంగా ఆరంభించాడు.

టోక్యో: 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ నుంచి గత రియో క్రీడల వరకూ ఫెల్ప్స్‌ జైత్రయాత్ర కొనసాగింది. అతని బాటలోనే సాగుతున్న 24 ఏళ్ల డ్రెసెల్‌ ఇప్పుడు పతకాల వేటకు సిద్ధమయ్యాడు. తనపై ఉన్న అంచనాలను అందుకునే దిశగా టోక్యోలో తొలి స్వర్ణం పట్టేశాడు. సోమవారం పురుషుల 4×100మీ. ఫ్రీస్టైల్‌ రిలేలో దేశానికి పసిడి అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి 100మీ. రేసును 47.26 సెకన్లలో పూర్తి చేసిన అతను.. తన జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. సహచర స్విమ్మర్లు అదే జోరు కొనసాగించి జట్టును విజేతగా నిలిపారు. మొత్తానికి 3 నిమిషాల 8.97 సెకన్లలో రేసు ముగించిన అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇటలీ (3:10.11సె), ఆస్ట్రేలియా (3:10.22సె) వరుసగా రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నాయి. మొత్తానికి డ్రెసెల్‌కిది మూడో ఒలింపిక్‌ స్వర్ణం. గత రియో క్రీడల్లో అతను రెండు బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. టోక్యోలో తన ప్రయాణాన్ని గొప్పగా ఆరంభించిన డ్రెసెల్‌ మరో మూడేసి చొప్పున వ్యక్తిగత, రిలేల్లో పోటీపడనున్నాడు. అంటే మొత్తంగా ఇంకా ఆరు విభాగాల్లో తలపడాల్సిన అతను.. ఆ పోటీల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
లెడెకీకి షాక్‌..: కొలనులో సంచలనాలకు మారుపేరైన అమెరికా బంగారు చేప కేటీ లెడెకీకి షాక్‌. గత ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలతో సత్తాచాటిన ఈ 24 ఏళ్ల స్విమ్మర్‌కు టోక్యోలో పోటీపడిన తొలి విభాగంలోనే నిరాశ ఎదురైంది. కచ్చితంగా పసిడి సాధిస్తున్న అంచనాలతో మహిళల 400మీ. ఫ్రీస్టైల్‌లో బరిలో దిగిన ఆమె చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు కలిగిన ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై ఆస్ట్రేలియా స్విమ్మర్‌ టిట్మస్‌ అనూహ్య విజయం సాధించింది. 3 నిమిషాల 56.69 సెకన్లలో రేసు ముగించిన ఆమె పసిడిని మెడలో వేసుకుంది. 3:57.36 సెకన్ల టైమింగ్‌తో లెడెకీ తనకు పెద్దగా అలవాటు లేని రెండో స్థానంలో నిలిచింది. చైనా స్విమ్మర్‌ లీ బింగ్‌జీ (4:1.8సె) కాంస్యం గెలిచింది. 2012 లండన్‌ క్రీడల్లో 800మీ. ఫ్రీస్టైల్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత లెడెకీ ఒలింపిక్స్‌లో ఓ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజేతగా నిలవలేకపోవడం ఇదే తొలిసారి. రియోలో ఆమె 200మీ, 400మీ, 800మీ. ఫ్రీస్టైల్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు టోక్యోలో 200మీ. ఫ్రీస్టైల్‌లోనూ ఆమెకు టిట్మస్‌ నుంచి ప్రమాదం పొంచి ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన