ప్రతికూల వాతావరణమైనా గురితప్పని ఆకాశ్‌-ఎన్‌జీ

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:57 IST

ప్రతికూల వాతావరణమైనా గురితప్పని ఆకాశ్‌-ఎన్‌జీ

బాలేశ్వర్‌ (ఒడిశా): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘న్యూ జనరేషన్‌ ఆకాశ్‌’ (ఆకాశ్‌-ఎన్‌జీ) క్షిపణిని భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇందులో భాగంగా ఇది.. ఆకాశంలో వేగంగా దూసుకెళుతున్న మానవరహిత టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 21న కూడా ఆకాశ్‌-ఎన్‌జీని ప్రయోగించారు. తాజాగా దీన్ని అన్ని ఉప వ్యవస్థలతో కలిపి, పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థగా పరీక్షించారు. ఇది ఆకాశంలో లక్ష్యాన్ని దిగ్విజయంగా నేలకూల్చిందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ పరీక్షను నిర్వహించినప్పటికీ క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ చక్కగా పనిచేశాయని తెలిపారు. ఆకాశంలో వేగంగా దూసుకెళ్లే లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా ఇది గాల్లో అద్భుత విన్యాసాలను చేయగలదని పేర్కొన్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆకాశ్‌-ఎన్‌జీని రెండుసార్లు విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలు, వైమానిక దళ అధికారులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌ రెడ్డి అభినందించారు. ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌ (డీఆర్‌డీఎల్‌) రూపొందించింది. డీఆర్‌డీవోలోని మరికొన్ని ల్యాబ్‌లు ఇందులో పాలుపంచుకున్నాయి. బీడీఎల్‌ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన