పది విద్యార్థులకు మూల్యాంకనంలో న్యాయం : సీబీఎస్‌ఈ

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:25 IST

పది విద్యార్థులకు మూల్యాంకనంలో న్యాయం : సీబీఎస్‌ఈ

దిల్లీ: పదో తరగతి విద్యార్థులకు ఏ విధంగానూ అన్యాయం జరగని రీతిలో మూల్యాంకన విధానాన్ని రూపొందించామని సీబీఎస్‌ఈ గురువారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ విధానంలో ఏ పాఠశాల కూడా ఏ విద్యార్థిపైనా పక్షపాతం చూపలేదని చెప్పింది. కరోనా పరిస్థితుల దృష్టా ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలు నిర్వహించిన గత సంవత్సరాల అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా.. ‘పది’ వార్షిక పరీక్షల మార్కులు కేటాయించే విధానాన్ని సీబీఎస్‌ఈ రూపొందించింది. దీనిపై అభ్యంతరం చెబుతూ ‘జస్టిస్‌ ఫర్‌ ఆల్‌’ అనే ఎన్జీవో సంస్థ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. అంతర్గత మార్కులే ప్రామాణికం అంటే.. ఇందులో పాఠశాలల ఇష్టారాజ్యం, పక్షపాతం ఉంటుందని, మార్కుల్ని తారుమారు చేసే అవకాశంతో పాటు మార్కుల పేరిట విద్యార్థులు, తల్లిదండ్రుల్ని దోపిడీ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలపై సీబీఎస్‌ఈ తాజాగా కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. అంతర్గత మార్కుల్ని ప్రామాణికంగా తీసుకోవడంలో అన్యాయం ఏమీ లేదని, ఇప్పటికే 12వ తరగతి మూల్యాంకనంలో ఇదే విధానం పాటించగా సుప్రీంకోర్టు సైతం ఆమోదించిందని తెలిపింది. వార్షిక పరీక్షల మార్కులు నిర్ణయించేందుకు పాఠశాలల వారీగా ఫలితాల కమిటీ ఏర్పాటవుతుందని, ఇందులో సదరు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పొరుగు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఉంటారని తెలిపింది. ఫలితాలు ప్రకటించాక ఏ విద్యార్థి కూడా దీనిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉండదన్న విశ్వాసం వ్యక్తం చేసింది. సీబీఎస్‌ఈ సమాధానంపై పిటిషన్‌దారు వాదనలను ఆగస్టు 6న వింటామని కోర్టు పేర్కొంది.

ఆ తీర్పే అంతిమం : సుప్రీం

సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల మూల్యాంకన విధానాన్ని సమర్థిస్తూ గత నెలలో వెలువరించిన తీర్పే అంతిమమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం తిరస్కరించింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షలన్నీ రద్దయిన విషయం తెలిసిందే. రెగ్యులర్‌ విద్యార్థులకు అంతర్గత మార్కుల ప్రాతిపదికన వార్షిక పరీక్షల మార్కులు వేస్తున్నట్టు చెప్పిన సీబీఎస్‌ఈ.. ప్రైవేటు, కరస్పాండెన్స్‌, కంపార్ట్‌మెంట్‌ విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15 వరకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన