ఆ వివాహానికి అనుమతి ఇవ్వలేం

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 05:47 IST

ఆ వివాహానికి అనుమతి ఇవ్వలేం

కింది కోర్టుకు వెళ్లాలని బాధితురాలికి సుప్రీం సూచన

దిల్లీ: తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేరళకు చెందిన ఓ మహిళ చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయమై అంగీకారం తెలపకుండా కేరళ హైకోర్టు సరయిన నిర్ణయమే తీసుకుందని, దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సోమవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కొట్టియూర్‌కు చెందిన ఆ మహిళ బాలికగా ఉన్నప్పుడు రాబిన్‌ వడక్కుంచెరీ అనే క్యాథలిక్‌ క్రైస్తవ మతగురువుతో సంబంధాలు ఉండేవి. ఫలితంగా బాలునికి జన్మనిచ్చింది. అనంతరం తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. విచారణ జరిపిన కోర్టు ఆయనకు 20 ఏళ్ల శిక్ష విధించడంతో ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. శిశువు జన్మించిన విషయాన్ని దాచి పెట్టి, నేరాన్ని పోలీసుల దృష్టికి తీసుకురానందుకు ఆసుపత్రి నిర్వాహకులు, ఇద్దరు వైద్యులపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న అభియోగం కూడా మోపారు.

ఈ నేపథ్యంలో బాలునికి నాలుగేళ్ల వయసు రావడంతో ఆయన తండ్రి రాబినే అని చెప్పుకొనేందుకు వీలుగా వివాహం చేసుకుంటానంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం రెండు నెలల పాటు జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. రాబిన్‌ కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేశాడు. వీటిని హైకోర్టు తిరస్కరించింది. సంఘటన జరిగిన సమయంలో ఆ మహిళ బాలిక అని తేలిందని, ఈ తీర్పుపై చేసిన అప్పీలు కూడా పరిశీలనలో ఉందని తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఇంకా అమల్లోనే ఉన్నందున, వివాహానికి అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అలా అనుమతి ఇవ్వడం అంటే వివాహానికి కోర్టు ముద్ర పడినట్టేనని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.

రాబిన్‌ తరఫున న్యాయవాది అమిత్‌ జార్జ్‌ వాదనలు వినిపిస్తూ వివాహం ప్రాథమిక హక్కు అని, దీనిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇద్దరి వయసు ఎంత అని అడిగింది. రాబిన్‌కు 49 ఏళ్లు, ఆ మహిళకు 25 ఏళ్లు అని సమాధానం ఇచ్చారు. ‘‘దీన్ని పరిశీలించకుండానే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నారా? హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోం’’ అని ధర్మాసనం తెలిపింది. మహిళ తరఫున సీనియర్‌ న్యాయవాది కిరణ్‌ సూరి వాదిస్తూ ఆ బాలునికి చట్టబద్ధ హక్కులు కలిగించడానికే ఆమె ప్రయత్నిస్తోందని తెలిపారు. దాంతో ఈ కేసును తొలుత విచారించిన ట్రయల్‌ కోర్టునే మొదట ఆశ్రయించాల్సి ఉంటుందని ధర్మాసనం సూచించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన