అటు నిరసనలు.. ఇటు ఉత్సవాలు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:31 IST

అటు నిరసనలు.. ఇటు ఉత్సవాలు

370 రద్దుకు రెండేళ్లు పూర్తి
జమ్మూ-కశ్మీర్‌కు ఒరిగిందేమిటని విపక్షాల ప్రశ్న

జమ్మూ, శ్రీనగర్‌, దిల్లీ: ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదించిన 370 అధికరణాన్ని రద్దు చేసి గురువారానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ-కశ్మీర్‌లో నిరసనలు, ఉత్సవాలు చోటుచేసుకున్నాయి. నాలుగు ఉగ్రవాద సంఘటనలు కూడా జరిగాయి. పీడీపీ ఆధ్వర్యంలో బందు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు ఎగురవేసి భాజపా ఉత్సవాల ఊరేగింపులు నిర్వహించింది. సోపోర్‌, నౌహట్టాల్లో లష్కరే తోయిబా అనుబంధ ద రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ (టీఆర్‌ఎఫ్‌) బాంబుదాడులకు దిగింది. శ్రీనగర్‌లోని మెహజూర్‌ నగర్‌, పుల్వామా జిల్లాలోనూ ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. భద్రతా బలగాలు దీటుగా సమాధానం ఇచ్చాయి.

370 అధికరణం రద్దు ద్వారా జమ్మూ-కశ్మీర్‌కు ఒరిగిందేమిటని విపక్షాలు ప్రశ్నించాయి. దీంతో సాధించేదేమీ లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ‘‘మూడు నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. భారీగా ప్రయివేటు ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించారు. అంతా అబద్ధం. ఉగ్రవాదానికి అరికడతామని చెప్పారు. ఇప్పుడది జమ్మూకు కూడా వ్యాపించింది. జమ్మూలోని వ్యాపారాలు, కాంట్రాక్టులు, రవాణా రంగం బయటవారి చేతుల్లోకి వెళ్లిపోయాయి’’ అని జమ్మూ-కశ్మీర్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రమణ్‌ భల్లా విమర్శించారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పరిస్థితులు మరింత దిగజారాయని పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) నాయకులు ఆరోపించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసం వద్ద మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా నాయకులంతా సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. రాజ్యాంగ హక్కుల పునరుద్ధరణకు పోరాడతామని అబ్దుల్లా తెలిపారు. లద్దాఖ్‌లోనూ పరిస్థితులు క్షీణించాయని చెప్పారు. 370 అధికరణం రద్దుతో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని హురియత్‌ కాన్ఫరెన్స్‌ అభిప్రాయపడింది. కొత్తగా చైనాతో సరిహద్దు సమస్య వచ్చి పడిందని తెలిపింది.


నిజమైన అభివృద్ధిని సాధించాం: జైశంకర్‌

370 అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా జమ్మూ-కశ్మీర్‌లో నిజమైన ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సుపరిపాలన, సాధికారతను సాధించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. దేశం మరింతగా బలపడిందంటూ ట్వీట్‌ చేశారు. ఈ నిర్ణయం ద్వారా శాంతి, అభివృద్ధి సాధ్యమైందంటూ ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి మరో ట్వీట్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన