వివాహం అంటే వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 05:35 IST

వివాహం అంటే వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు

దిల్లీ హైకోర్టులో కేంద్రం వాదనలు

దిల్లీ: దేశంలో వివాహం అంటే ఒక వ్యవస్థ అని, కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కం క్రిమినల్‌ నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, స్వలింగ వివాహాలను గుర్తించడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలు సోమవారం దిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌ల ధర్మాసనం ముందు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. స్త్రీ-పురుషుల మధ్య జరిగే వివాహాన్నే చట్టంతో పాటు సమాజం గుర్తిస్తుందని తెలిపారు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకుంటే గందరగోళం నెలకుంటుందని, ఇతర చట్టాల్లో సమస్యలు వస్తాయని చెప్పారు. అంతకుముందు పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ స్వలింగ వివాహాలను కాదనడం సమాన హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. నవంబరు 30న తుది వాదనలు వింటామని, ఈలోగా ఇతర వివరాలు ఉంటే సమర్పించాలని ధర్మాసనం తెలిపింది.


స్వలింగ వివాహాలపై తుది విచారణ తేదీ ఖరారు

నవంబరు 30న చేపట్టనున్న దిల్లీ హైకోర్టు

దిల్లీ: స్వలింగ వివాహాల విషయమై దాఖలైన పలు వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టనున్నట్టు సోమవారం దిల్లీ హైకోర్టు తెలిపింది. నవంబరు 30న తుది వాదనలు వింటామని, ఈ లోగా వివరణలు, సమాధానాలు, ఖండనలు ఉంటే సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా దాఖలైన పలు వ్యాజ్యాలపై సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

* స్వలింగ సంపర్కం క్రిమినల్‌ నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహం చట్టాల కింద స్వలింగ వివాహాలను గుర్తించడం లేదంటూ సమాన హక్కుల ఉద్యమ కార్యకర్తలు అభిజిత్‌ అయ్యర్‌ మిత్ర, గోపీ శంకర్‌ ఎం,  గీతి తాండవి, జి.ఊర్వశిలు వ్యాజ్యాలు వేశారు. హిందూ వివాహ చట్టం కింద ఈ పెళ్లిళ్లను గుర్తించకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ వారి తరఫు న్యాయవాదులు రాఘవ్‌ అవస్థి, ముకేశ్‌ శర్మలు తెలిపారు.

* ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇద్దరు మహిళలు వినతిని సమర్పించారు. ఈ చట్టంలోని నిబంధనలు స్వలింగ వివాహాలకు అనుకూలంగా లేవని ఫిర్యాదు చేశారు. తాము వివాహం చేసుకోవడానికి అవకాశం కల్పించడం లేదని వారు (47 ఏళ్లు, 36 ఏళ్లు) ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని, కష్టసుఖాలను పంచుకుంటున్నామని చెప్పారు. వివాహాన్ని గుర్తించకపోవడంతో ఇల్లు కొనుగోలు, బ్యాంకు అకౌంట్‌ తెరవడం, కుటుంబ జీవిత బీమా పొందడంలో ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది మనేకా గురుస్వామి, న్యాయవాదులు గోవింద్‌ మనోహరన్‌, అరుంధతి కట్జు, సురభి ధార్‌లు వాదనలు వినిపించారు.

* అమెరికాలో వివాహం చేసుకున్న ఇద్దరు పురుషుల తరఫున కూడా ఇదే న్యాయవాదులు వాదనలు వినిపించారు. అమెరికాలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం విదేశీ వివాహ చట్టం కింద ఆ పెళ్లిని రిజిస్టర్‌ చేయడం లేదని తెలిపారు. 2012 నుంచి కలిసి ఉంటున్న వారు 2017లో వివాహం చేసుకున్నారు. గుర్తింపు లేకపోవడం వల్ల కరోనా సమయంలో వివాహిత జంట కేటగిరీలో భారత్‌కు రాలేకపోయారని చెప్పారు.

* ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డు ఉన్న వ్యక్తి విదేశీయులను పెళ్లి చేసుకుంటే లైంగిక హోదాతో సంబంధం లేకుండా ఆ భాగస్వామికి కూడా ఓసీఐ కార్డు ఇవ్వాలని మరో వ్యాజ్యం దాఖలయింది. అంటే పురుషుడు..పురుషుడిని వివాహం చేసుకున్నా ఈ గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఓసీఐ కార్డు ఉన్న జయదీప్‌ సేన్‌గుప్తా, అమెరికా పౌరుడైన రసెల్‌ బ్లయినే స్టీఫెన్స్‌లు వివాహం చేసుకున్నారు.  అమెరికాలోని రట్‌గేర్స్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న భారత పౌరురాలు మారియో డిపెన్హా కూడా ఇదే విషయమై వాజ్యం చేశారు.

* ఆ పురుష జంట తరఫున న్యాయవాది కరుణ నంది వాదనలు వినిపిస్తూ వారు న్యూయార్క్‌లో వివాహం చేసుకున్నారని తెలిపారు. వారికి పౌరసత్వ చట్టం, విదేశీ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం వర్తిస్తాయని చెప్పారు. ఓసీఐ కార్డు ఉన్న వ్యక్తి విదేశీయులను వివాహమాడితే ఆ భాగస్వామికి రెండేళ్ల అనంతరం పౌరసత్వం ఇవ్వాలన్న నిబంధన ఉందని, దీన్ని వీరికి వర్తింపజేయడం లేదని తెలిపారు. తమ వ్యాజ్యానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని చెప్పారు.

కేంద్రం వాదనలు

* కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం ఇస్తూ వివాహం అంటే స్త్రీ-పురుషుల మధ్య జరిగేదని, అలాంటి వారినే జీవిత భాగస్వాములుగా గుర్తిస్తారని తెలిపారు. అందువల్ల పౌరసత్వ సవరణ చట్టం కింద సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. జీవశాస్త్రం ప్రకారం పురుషుడు, స్త్రీలుగా భావించే వ్యక్తుల మధ్య జరిగే దాన్నే వివాహంగా పర్సనల్‌ లా కింద పరిగణిస్తారని తెలిపారు.

* స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తప్పుడు అన్వయం చేస్తున్నారని మెహతా అన్నారు. అది క్రిమినల్‌ నేరం కాదని మాత్రమే చెప్పిందని తెలిపారు. స్వలింగ వివాహాలు చేసుకోవడం గురించి ఏమీ చెప్పలేదని స్పష్టం చేశారు. స్వలింగ వివాహాలపై ధర్మాసనం పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. భారత దేశంలో వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదని, స్త్రీ-పురుషుల మధ్య నెలకొనే వ్యవస్థ అని తెలిపారు. భర్త అంటే జీవశాస్త్ర పురుషుడు, భార్య అంటే జీవశాస్త్ర స్త్రీ మాత్రమే కాదన్న అర్థం చెబితే చట్టాల్లో గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు. చట్టాల ప్రకారం గుర్తింపు మాట ఎలా ఉన్నా వివాహాలను సమాజం గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.

వాదనకు ఖండన

ఈ వాదనను సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్‌ ఖండించారు. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు ఇతమిత్థంగా చెప్పనప్పటికీ, పర్యవసానం మాత్రం అదేనని చెప్పారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటే స్వలింగ వివాహాలకు అనుకూలంగా ఉన్నట్టేనని, తీర్పును ఈ విధంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన