close

తాజా వార్తలు

ఇక్కడే ఉన్నారు!

ఆమె పుట్టింట్లో గడిపిన సమయం తక్కువే!
ప్రపంచం గురించి కాస్తోకూస్తో తెలిసేనాటికి మెట్టినింట్లో అడుగుపెట్టింది. భర్త దేశం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే తనూ వెంటవెళ్లింది.
ఆ పోరాటం జరుగుతుండగానే తనువు చాలించింది. జైల్లో ఉన్న ఆమె భర్త ఆ భార్యకు ఓ విలువైన కానుక ఇవ్వాలనుకున్నారు.
ఆ కానుక స్త్రీజాతి మొత్తానికి ఉపయోగపడాలని కోరుకున్నారు.
ఆ కానుకే.... స్త్రీలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలు, సాధికారత.
భర్త పేరు మహాత్మాగాంధీ... ఆ ఇల్లాలు కస్తుర్బా.
ఆమె జ్ఞాపకార్థం ప్రారంభమైందే కస్తుర్బా గాంధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌.
భాగ్యనగరిలోని హైదర్‌షాకోట్‌లో ఉన్న కస్బుర్బాగాంధీ ట్రస్ట్‌ గాంధీ ఆశయాలని తు.చ. తప్పకుండా పాటిస్తూ 75 సంవత్సరాలుగా ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది..

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ పట్టాపుచ్చుకుని సంతోషంగా తన సొంతూరు వారణాసి వెళ్లిపోవాలన్న సంబరంలో నాంపల్లి రైల్వేస్వేష్టన్‌కి చేరుకుంది డాక్టర్‌ సునంద. అలాగే జరిగితే ఈపాటికి సునంద ప్రాక్టీస్‌ చేసుకుంటూ కెరీర్‌లో కుదురుకునేదే! కానీ.. రెండేళ్ల క్రితం ఆ రైల్వేస్టేషన్‌లో జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. ఏం జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి.. మతిస్థిమితం కోల్పోయింది.  నేను డాక్టర్‌ని అని చెప్పినా పిచ్చిలో ఏదో మాట్లాడుతుందిలే అనుకున్నారంతా! ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని  ఆమెకు నీడనిచ్చింది లంగర్‌హౌస్‌ దగ్గర ఉన్న కస్తుర్బా ఆశ్రయం. ఈ రెండేళ్లలో ఆమె... ఉద్రేక పడుతూ, తనమీద తాను నియంత్రణ కోల్పోయిన రోజులూ ఉన్నాయి. అవేమీ గుర్తులేనట్టు ఆశ్రమమంలోని పిల్లలకు చక్కగా ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. అక్కడి వైద్యులు చేసిన చికిత్సలు ఫలించి ప్రస్తుతం ఆమె మునుపటి సునందలా మారింది. డాక్టర్‌గా సునందగా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామెకు చేదు గాయాలు, జ్ఞాపకాలు గుర్తులేవు.

ఇలాంటి సునందల కథలు, వ్యధలు కస్తూర్బా ఆశ్రమంలో వందల్లో ఉంటాయి.
అందులో చాలామంది సునందలానే తమ పూర్వ జీవితాన్ని వెతుక్కుంటూ సంతోషంగా వెళ్లారు. లేనివాళ్లు అక్కడ ఆశ్రయంలో ధైర్యంగా కస్తుర్భా ఆశ్రయం ఇచ్చిన భరోసా జీవిస్తారు. వీరికే కాదు వివిధ కారణాలతో ఆశ్రయం కోల్పోయిన స్త్రీలకు, పిల్లలకు, పెద్దవాళ్లకి, ఉపాధి కావాలనుకునేవారికి ఇదో కల్పతరువుగా మారింది.

ఆమె జ్ఞాపకార్థం...

స్తుర్బా 13 ఏళ్లకే గాంధీ జీవితంలోకి వచ్చారు. 62 సంవత్సరాల పాటు గాంధీ ఆశయాలను తన ఆశయాలుగా మార్చుకున్నారామె.
ఆమె చనిపోయేనాటికి గాందీజీ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే భార్య జ్ఞాపకార్థం దేశంలోని గ్రామీణ స్త్రీలను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో విద్య, వైద్యం, ఆరోగ్యం, సాధికారత, ఉపాధి నైపుణ్యాలు వంటివి అందాలనే గొప్ప ఆశయంతో ఇండోర్‌లోని కస్తుర్బాగ్రామ్‌ కేంద్రంగా దేశవ్యాప్తంగా 22 కస్తుర్బా మెమోరియల్‌ ట్రస్టులను ప్రారంభించారు. స్వయంగా మహాత్ముడే ఈ సంస్థకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత వల్లబాయిపటేల్‌, లక్ష్మీమేనన్‌, తారాగాంధీవంటి వారు ఈ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌ శాఖకు ప్రస్తుతం డాక్టర్‌ పద్మావతి చైర్‌పర్సన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గాందీజీ 150వ జయంతి వేడుకలు మాత్రమే కాదు ఈ ట్రస్ట్‌ సేవలకు 75 సంవత్సరాలు నిండుతున్నాయి.

పని నేర్పించి.. ఉపాధి కల్పిస్తారు

మొదట్లో దేశంలో ఉన్న శాఖలన్నీ బాలవాడీలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణకే పరిమితమయ్యాయి. తర్వాతర్వాత వీటిల్లో కొన్ని శాఖలు ఆధునిక పరిస్థితులకు తగినట్టుగా మారుతూ స్త్రీలకు విద్యా, వైద్య సదుపాయాలని అందించడంతో పాటు చక్కని ఉపాధి కేంద్రాలుగా మారి మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తూ వారికి మరింత చేరువయ్యాయి. అలాంటి శాఖల్లో హైదరాబాద్‌లో ఉన్న కస్తుర్బా ట్రస్ట్‌ ముందుంటుంది. ప్రస్తుతం ఇక్కడ తల్లిదండ్రులు లేని, ఎటువంటి ఆసరా లేని 42 మంది ఆడపిల్లలు ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో, కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఉద్యోగాలు సంపాదించిన వాళ్లూ ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్ల ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడకు చేరిన పిల్లలే వీరంతా! పిల్లల ఆదరణ కోల్పోయిన 25 మంది వృద్ధులు ఇక్కడ ఏ చీకూచింతా లేకుండా హాయిగా సేదతీరుతున్నారు. గృహహింస పాలయినవాళ్లు, మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్లు, ఇతర కారణాలతో నీడ కోల్పోయిన స్త్రీలు 146 మంది ఉన్నారు. వీళ్లంతా పుట్టుకతో బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లో, మతిస్థిమితం లేనివాళ్లో కాదు... తీవ్రమైన హింస కారణంగా నీడ కోల్పోయిన వాళ్లు. తమ ఆచూకి తమకే తెలియని వాళ్లు. ఒక్కసారిగా షాక్‌కి గురై గతం తాలూకూ జ్ఞాపకాలు కోల్పోయిన వాళ్లు. నిపుణుల ఆధ్వర్యంలో వీరికి కావాల్సిన వైద్య సదుపాయం అందుతుంది. 1400 మంది ఇప్పటి వరకూ ఇక్కడ చేరితే అందులో 1200 తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆయా విభాగాలకు కావాల్సిన నిధులు ఉజ్వల, స్వధార వంటి పథకాల ద్వారా అందుతాయి. ఇక ఉపాధి విషయానికి వస్తే... చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే మహిళలకు ట్రస్టు ఆధ్వర్యంలో జ్యూట్‌ బ్యాగులు, కాగితం బ్యాగులు, కుట్టుపని వంటివి నేర్పిస్తారు. ఆసక్తి ఉన్నవారికి కార్పొరేట్‌ కంపెనీల నుంచి ఆర్డర్లని ఇచ్చి ఆదాయం పొందేట్టు చేస్తారు. అలీప్‌ వంటి సంస్థలు వీరికి కుట్టుపనిలో శిక్షణ ఇస్తున్నాయి. ఆశ్రయంలోని పిల్లలు, మహిళలు కూడా ఈ ఉపాధిని అందిపుచ్చుకుంటున్నారు. త్వరలో ఓ కమర్షియల్‌ లాండ్రీ నిర్వహణ కూడా ఇక్కడి మహిళలు నిర్వహించనున్నారు. తమ ఉత్పత్తులని ఈకామర్స్‌ సైట్‌లో ఉంచడానికి కూడా సిద్ధం అవుతున్నారు.

అందరికీ అమ్మ ఆమె

ట్రస్టు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న పద్మావతి అంటే అక్కడి వాళ్లకు అమ్మే. ఆమె అడుగుపెడితే చాలు ఆ ఆశ్రమంలో సందడి మొదలవుతుంది. విద్యావేత్తగా తన పయనాన్ని ప్రారంభించారు పద్మావతి. తక్కువ ఖర్చుతో మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడంతో ప్రారంభమైన ఆమె అనుబంధం.. కస్తుర్బా ట్రస్టుతో ఎన్నో ఏళ్లుగా ముడిపడింది. సీఎస్‌ఆర్‌ నిధులు తీసుకురావడంలో, పిల్లలని చదివించడంలో ఆమె ఎంతో చొరవగా ఉంటారు.
ఆశ్రమంలో మాంసం, మద్యం వంటివి పూర్తిగా నిఫేధం. బాపు ప్రార్థనలతోనే ఇక్కడ పిల్లలకు పెద్దలకు తెల్లారుతుంది. ఇక్కడ అడుగు పెట్టిన కాసేపటికే మనకు ఓ విషయం అర్థం అవుతుంది. బాపు ఆశయాలు ఇంకా ఇక్కడ సజీవంగానే బతికి ఉన్నాయని. ‘నేనిక్కడికి . సైక్రియాట్రీ ఆసుపత్రి నుంచి వచ్చాను. సౌదీ అరేబియా నుంచి భర్త పెట్టే బాధలు భరించలేక ఇక్కడ పారిపోయి వచ్చాను. కొన్నాళ్లు ముంబయిలో స్నేహితుల ఇంట్లో ఉండేదాన్ని. తర్వాత . ఎక్కడెక్కడో నీడకోసం ప్రయత్నించాను. ఇంకా నయం ఇక్కడ గాంధీ ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉంటున్నా’ అంది అక్కడే ఆశ్రయం పొందుతున్న నౌహీదా.
-గొర్లె శ్రీసత్యవాణి, హైదరాబాద్‌,
ఫొటోలు: వసంత్‌

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.