close

తాజా వార్తలు

ఎగుమతుల రంగానికి ఊరటనిచ్చేలా ఎంఈఐఎస్‌

మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించిన నిర్మాలా సీతారామన్‌

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మూడో దశ ఉద్దీపన చర్యలను  కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి చర్యలను వివరించారు. ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచించామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న కేంద్ర మంత్రి 4 శాతానికి మించలేదని అన్నారు. 2019-20 ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు ఆశించిన స్థాయిలోనే ఉందని వివరించారు. పారిశ్రామిక ఉత్పత్తిలో ఆశాజనక సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి  అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో భారత్‌ స్థానం మెరుగైందని, భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎగుమతుల రంగానికి మంత్రి పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత ఎగుమతులను మూడింతలు చేసి, 1 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

‘‘ఇప్పటికే ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ఉద్దీపన చర్యలను ఆగస్టు 23, 30 తేదీల్లో ప్రకటించాం. ఇప్పుడు ఎగుమతులు, టెక్స్‌టైల్‌ తదితర రంగాలకు ఊతమిచ్చే చర్యలు ప్రకటిస్తున్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014 నుంచి ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోంది. బ్యాంకుల నుంచి క్రెడిట్‌ ఫ్లోను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాం. దీనిపై జీఎస్టీ మండలి సమావేశం ముందు రోజు సెప్టెంబరు 19న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమవుతాను. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన నిబంధనలు ఉండవు. ఐటీ దాఖలులో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవు. 

ఎగుమతిదారుల కోసం ఎంఈఐఎస్‌..
ఎగుమతి దారులకు ఊరటనిచ్చేలా కొత్త పథకం ఎంఈఐఎస్‌ను ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల టెక్స్‌టైల్‌ రంగాలతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం ఉంటుంది. 2020 నుంచి వస్త్రాల ఎగుమతికి కొత్త పథకాన్ని తీసుకురానున్నాం. పాత పథకం ఆర్‌వోడీటీఈపీ డిసెంబరు వరకూ కొనసాగుతుంది. ఈ పథకం అమలుతో రూ.50 వేల కోట్ల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నాం.’’ అని సీతారామన్‌ అన్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి (5 శాతానికి) పడిపోయిన సంగతి తెలిసిందే. దిగజారిన వృద్ధి రేటు ఎగబాకేలా పునరుజ్జీవం కల్పించేందుకు కేంద్రం కొన్ని రంగాలకు ఉద్దీపన చర్యలను ప్రకటిస్తూ వస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, దేశీయ పెట్టుబడిదారులపై అధిక సర్‌ఛార్జీని ఉపసంహరించుకోవడం, ఆటోమొబైల్‌ రంగానికి పునరుజ్జీవ ప్యాకేజీ తదితర ప్రోత్సాహకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చేవారం గోవాలో జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో ఆటోమొబైల్‌ రంగానికి ఊతమిచ్చేలా వాహనాలపై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.