close

తాజా వార్తలు

హితులారా...

ఈనెల 25 క్రిస్మస్‌

హితులారా...

ఏ కంట్లో నీరుంటుందో ఆ కన్ను ఆరోగ్యంగా ఉంటుంది... ఏ హృదయంలో ఆర్ద్రత ఉంటుందో అది దైవ నిలయమవుతుంది. ఎవరిలో దయ, పశ్చాత్తాపం ఉంటాయో పర లోకం వారిదే అని ప్రవచించారు ప్రభువు... ఆయన తన జీవితమంతా ఈ సత్యాన్నే చాటారు. అనేక సందర్భాల్లో  క్రీస్తు చెప్పిన విషయాలు, చేసిన కార్యాలు అవలోకిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. అవి ఇప్పటికీ, ఎప్పటికీ జీవన సూత్రాలే...

కక్షతో, అతిశయంతో ఏమీ చేయకు... వినయంతో ఉండు. మీకంటే మీ సహచరులు యోగ్యులని భావించు.

పవిత్రులను, పతితులను... చెడ్డవారిని, మంచివారిని అందరినీ సమదృష్టితో ప్రేమించే ఓ దివ్యాత్మ భువికి దిగివచ్చిన శుభదినం క్రిస్మస్‌.
శాశ్వతమైన ఆత్మకోసం, అశాశ్వతమైన శరీరంపై మోహాన్ని విడనాడమని మానవాళికి సంకల్పం కలిగించిన మహనీయుడు  పుట్టిన రోజు క్రిస్మస్‌.
ప్రేమించడం అంటే క్షమ, కరుణ, ఆనందం అనే త్రిగుణ సిద్ధాంతాన్ని బోధించిన దయామయుడు ఈ లోకానికి అరుదెంచిన శుభ ఘడియ క్రిస్మస్‌.
త్యాగ నిరతి, దయార్ద్ర హృదయం దేవుడి నిలయమవుతుందని బోధించిన ఒక మహా గురువు జన్మించిన రోజు ఇదే...

తిరిగి జన్మించండి!

హితులారా...

నికోదేము... యూదా సంస్థానంలో న్యాయాధికారి. వృత్తిపరంగా అపూర్వమైన జ్ఞాన సంపన్నుడైన ఆయనకు ఒక సందేహం వచ్చింది.

వెంటనే క్రీస్తు ప్రభువును దర్శించి ఒక ప్రశ్న వేశాడు. ‘ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి?’ అని.
అందుకు ప్రభువు క్లుప్తంగా ‘తిరిగి జన్మించాలి’ అన్నారు.

అతడికి అర్థం కాలేదు. ‘ఈ వయసులో... ఇంత వృద్ధుడిని అయ్యాక తిరిగి జన్మించడం ఎలా?’ అన్నాడు.

అందుకు ప్రభువు ‘మనిషి కొత్తగా జన్మించడం అంటే దేవుడి దివ్యత్వంలోకి ప్రవేశించడం. ప్రతి మనిషి దివ్య పురుషుడిగా మారేందుకు కరుణ, ప్రేమ, త్యాగం, సేవానిరతి... ఇవే మార్గాలు. ఆ మార్గంలోకి ుళ్లడమే పునరుత్థానం. అని ఆయన బోధించాడు. దేవుడి ఆత్మను మనం భౌతికంగా చూడలేకపోయినా అతను తిరిగి జన్మించాడు అనడానికి తిరుగులేని నిదర్శనం అతడి జీవన విధానం. తన సహచరులను ప్రేమించే తీరులో తెలిసిపోతుంది. తోటి మనిషిని ప్రేమించలేనివాడు, దేవుడిని ప్రేమించలేడు.

నెగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

హితులారా...

మన గొప్పవాళ్లం కావాలంటే తగ్గించుకుని ఉండాలంటారు క్రీస్తు. నెగ్గేవారెప్పుడూ తగ్గే ఉండాలనేది ఆయన ప్రబోధం. ఎవరైనా శిష్యులు కావాలనుకుంటే బలహీనులను, దీనులను అసహ్యించుకోకూడదు. వారిపై ప్రేమ పూర్వక శ్రద్ధ ఉండాలి. తన శిష్యులంతా అందరినీ ప్రేమించే వారై ఉండాలని ఆయన బలంగా చెప్పేవారు.

ఒక మత బోధకుడు ఆయనను ప్రశ్నించాడు.. ‘నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి?’ అని..

అప్పుడు ప్రభువు ఇలా చెప్పారు. ‘మొదటి స్థానం దేవుడికి, అంతకన్నా ముందు స్థానం సాటి మనిషికి ఇవ్వు’ అని.
సాటి మనిషిని ఆత్మీయుడిగా గుర్తించడమే నిత్య జీవానికి దగ్గరి దారి అని ప్రభువు తేటతెల్లం చేశారు.

పగ, ప్రతీకారాలతో దేవుడికి దగ్గర కాలేరని, అలాంటి వారు తనకు అనుచరులు కారని, తోటి సహచరుడి మనసు గెలుచుకున్నవాడే తనకు మంచి శిష్యుడని ఆయన చెప్పారు.

దేవుడు ప్రేమిస్తాడు... ఎప్పుడంటే!

హితులారా...

క్రీస్తు సాంఘికంగా తక్కువ స్థాయి వారితో కలిసిపోతున్నాడని, వారితో స్నేహం చేస్తున్నాడని ఆనాటి మత పెద్దలు విమర్శించేవారు. వారికి జవాబుగా ఆయన మూడు కథలు చెప్పారు. అవి 1. తప్పిపోయిన గొర్రెపిల్ల 2. పోయిన నాణెం దొరికిన వైనం 3. తప్పిపోయిన కుమారుడు దొరకడం

దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయిన గొర్రె పిల్లను వెదికి రక్షించే గొర్రెల కాపరి అది దొరికితే దాన్ని ప్రేమతో చేతుల్లోకి తీసుకుంటాడు. ఎంతో అపురూపంగా మందలో కలుపుతాడు. అలాగే నాణెం పోగొట్టుకున్న ఓ స్త్రీ అది తిరిగి కనిపిస్తే దాన్ని ఎంతో సంతోషంగా తీసుకుంటుంది.  తన కుమారుడు తప్పిపోయినప్పుడు అతని తండ్రి ఎంతో ఆందోళనతో, బాథతో అతని కోసం వెదుకుతాడు. అతడు కనిపించినప్పుడు గాఢంగా గుండెలకు హత్తుకుంటాడు... దేవుడు కూడా సరిగ్గా ఇలాగే చేస్తాడు. సరైన దారిలో నడవని మనుషులను కూడా దేవుడు ప్రేమిస్తాడు. వారిని తన రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు... అందుకు వారు చేయాల్సింది పశ్చాత్తాపపడడమే. చేసిన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకోవడమే. దేవుడు పాపులను వెదుకుతూ వెళతాడు. వారి పశ్చాత్తాపంతో ఆనందపడతాడు. వారిని వెదికే క్రమంలో ఆయన ఎంతో యాతన పడతాడు. అందుకే వారిని రక్షించి, సరిదిద్దే సమయంలో ఆయన ప్రేమ పరాకాష్టకు చేరుకుంటుంది.

విరోధం వదిలేయాల్సిందే!

హితులారా...

ఏసు కొండపై చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైంది. మనిషిలోని ఆందోళనకు, అహంకారానికి కారణమైన అంతఃశత్రువు కోపాన్ని దూరం చేసుకోమని క్రీస్తు అక్కడ వెల్లడించారు. ‘తన సోదరునిపై ఆగ్రహం చూపే ప్రతివాడూ విమర్శకు పాత్రుడు. తన తోబుట్టువును వ్యర్థుడా అని దూషించే వ్యక్తి తీర్పునకు లోనవుతాడ’ని చెప్పారు.  ‘నిన్ను నువ్వు దేవుడికి అర్పణ చేసుకునే సమయంలో నీవు నీ సహోదరుడిపై విరోధం ఉందనే విషయం జ్ఞప్తికి వస్తే అక్కడ దేవుడి ఎదుటే నీ అర్పణ విడిచి నీ సహోదరుడితో సమాధానపడు’ అన్నారు ప్రభువు.
మీ శత్రువులను ప్రేమించండి. హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ద్వేషించేవారికి మేలు చేయండి. శపించేవారికి దీవెనలివ్వండి. దేవుడు సమదృష్టితో అందరిపై తన కరుణ, వాత్సల్యం వర్షిస్తున్నాడు.

ఈ ఉపదేశాలన్నీ మనిషిని సంపూర్ణ మానవుడిగా, దివ్యమైన వ్యక్తిగా మార్చేందుకు దోహదం చేసే సోపానాలు.

గోధుమవా? పొట్టువా?

ఒక రైతు గోధుమ పనలను పొలం నుంచి తీసుకొచ్చాడు. పనివారిని నియమించి పనలను దులిపి పొట్టు నుంచి గింజలను వేరు చేయించాడు. కూలీలు వాటిని రాశులుగా పోశారు. ఆ గోధుమలను, ఆ రైతు తన ధాన్యాగారంలో పదిలపరిచాడు. మిగిలిన ఆ నిరుపయోగమైన పొట్టును రైతు ఊడ్చి కాల్చివేశాడు... ఇది క్రీస్తు తన శిష్యులకు చెప్పిన ఉపమానం. మనం ఎవరు? గోధుమలమా... లేక గాలికి ఎగిరిపోయే లేదా కాలిపోయే పొట్టు వంటి వాళ్లమా? ఇది క్రీస్తు ప్రభువు వేసిన ప్రశ్న.

గోధుమలకు పొట్టుకు చాలా తేడా ఉంటుంది. గోధుమల్లో జీవం ఉంటుంది. అది మనిషి ఆకలి తీరుస్తుంది. విపణి వీధిలో మంచి ధర పలుకుతుంది. మరి పొట్టు? దానికి ఏ విలువా లేదు. అది వ్యర్థం. ఈ క్రమంలో ఒక మానవ జీవితం మేలైన గోధుమల్లా ఉండాలంటున్నారు ప్రభువు. భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని వృథాగా కాలిపోయే, ఎగిరిపోయే పొట్టులా మార్చుకోవడమే గొప్ప విషాదం అంటారాయన.
ఇదే క్రీస్తు మహోన్నత వాణి.

ఏ సంపద శాశ్వతం?

ఒకసారి ఒక ధనికుడు ఏసు వద్దకు వచ్చి దేవుడి రాజ్యం కావాలంటే నేనేం చేయాలి? అని ప్రశ్నించాడు. అందుకు ప్రభువు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించాలన్నారు.
అప్పుడా వ్యక్తి బాల్యం నుంచి వీటిని అనుసరిస్తున్నాను అని సమాధానం చెప్పాడు.

అప్పుడు ప్రభువు నీకు ఒకటి కొదవగా ఉంది. నీవు పరిపూర్ణుడుగా కావాలంటే నీ ఆస్తిని పేదలకు పంచు అని ఉపదేశించారు. ఆ ధనికుడు తన ఆస్తిని వదులుకోవడం ఇష్టంలేక వెనుదిరిగాడు. అప్పుడు క్రీస్తు తన శిష్యులతో ‘భూమి మీద మీ కోసం సమకూర్చుకునే ధనం శాశ్వతం కాదు.  మీకూ శాశ్వతత్వాన్ని ప్రసాదించదు. అయితే పరలోకంలో మీ ఆత్మీయ సంపదను దాచుకోండి. అది శాశ్వతమైంది. దాన్ని అక్షయ సంపద అంటారు. అని బోధించారు.

- ఎం.సుగుణరావు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన