close

తాజా వార్తలు

నా తొలి సంపాదన 75 రూపాయలు!

రాత్రిళ్లు ఫోన్‌ చేసి బూతులు తిట్టేవారు!

యన స్టెప్స్‌ కంపోజ్‌ చేస్తే.. ‘పక్కా లోకల్‌’..
వాటిని వెండితెరపై చూస్తే.. ‘ఎన్టీఆర్‌.. ఏయన్నార్‌.. మెగాస్టార్‌.. విజిలేస్తార్‌’
 ‘స్వింగ్‌ జరా’ అంటూ ఊగేస్తార్‌..
 సినిమా పాటలతో వస్తుంది ఊపు..
 ఆ పాటలకు తగ్గ స్టెప్‌లు వేయించడంలో ఆయన పెద్ద తోపు..
 తన మూమెంట్స్‌తో లేపుతాడు టాప్‌..  
ఎప్పుడైనా ఎక్కడైనా నా స్టెప్‌ల రుచి చూపిస్తా దమ్ముంటే ఆపు.. అంటూ సవాల్‌ విసురుతారు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

హాయ్‌ మాస్టర్‌ మీకు పెళ్లి అయిందా?
శేఖర్‌ మాస్టర్‌: ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సర్‌! (మధ్యలో అలీ అందుకుని ‘నిజమా!’) లేకపోతే మా ఆవిడ కొట్టేస్తుంది. నాకు కూడా పెళ్లి కాలేదని చెప్పాలని ఉంది(నవ్వులు)
మీ తండ్రి ఏం చేసేవారు?
శేఖర్‌ మాస్టర్‌:ఇప్పుడు లేరు! నేను ఐదో తరగతిలో ఉండగానే చనిపోయారు. విజయవాడ బీసెంట్‌రోడ్‌లో ఫ్రూట్స్‌ బిజినెస్‌ చేసేవారు. 
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని శేఖర్‌ అనే వ్యక్తి ఎందుకు డ్యాన్సర్‌ అవ్వాలని అనుకున్నాడు?
శేఖర్‌ మాస్టర్‌: నా చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌ జరిగితే మా నాన్న నాతో డ్యాన్స్‌ చేయించేవారు. ఎక్కువగా చిరంజీవిగారి పాటలకు డ్యాన్స్‌ చేసేవాడిని. రెండు, మూడేళ్లు చేశానేమో! ఆ తర్వాత సిగ్గుతో చేసేవాడిని కాదు. మళ్లీ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో డ్యాన్స్‌ నేర్చుకుని హైదరాబాద్‌ వచ్చేశా! 
‘ఖైదీ నంబర్‌ 786’ లో చిరు పాటకు స్టెప్‌లేసిన మీరు.. ‘ఖైదీ నంబర్‌ 150’కి డ్యాన్స్‌ మాస్టర్‌ అవుతానని అనుకున్నారా?
శేఖర్‌మాస్టర్‌: ఆయనకు డ్యాన్స్‌ మాస్టర్‌గా కాదు.. కనీసం ఆయనను దగ్గరగా చూస్తానా? లేదా? అనుకున్నా. అలాంటిది ఆయన పాటకు కొరియోగ్రఫీ చేసే అదృష్టం దక్కింది. 
ఆ అవకాశం ఎలా వచ్చింది?
శేఖర్‌మాస్టర్‌: అంతకుముందు చరణ్‌, వినాయక్‌ గార్ల సినిమాలకు పనిచేశా. ఇద్దరూ అనుకొని నాకు అవకాశం ఇచ్చారు. 
హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఏ డ్యాన్స్‌ మాస్టర్‌ దగ్గర సహాయకుడిగా చేరారు?
శేఖర్‌మాస్టర్‌: ఇక్కడ చాలా మంది డ్యాన్స్‌ మాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు నెలకు ఐదారు సాంగ్స్‌ చేస్తున్నారు. నేను వచ్చిన సమయంలో మూడు నెలలకు ఒక సాంగ్‌ దొరికినా అదృష్టంగా భావించేవారు.  అప్పట్లో మన మాస్టర్స్‌ తక్కువ. చెన్నై నుంచి వస్తుంటే మనకు పర్సంటేజ్‌ చొప్పున ఇచ్చేవారు. సుచిత్ర మాస్టర్‌, లారెన్స్‌ మాస్టర్‌, రాకేష్‌ మాస్టర్‌, అమ్మా రాజశేఖర్‌ వీళ్లందరి దగ్గరా పనిచేశా.

మీ పూర్తి పేరు ఏంటి?
శేఖర్‌మాస్టర్‌: జోగా శేఖర్‌ అనంతకుమార్‌ ప్రభు.
చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవారట?
శేఖర్‌మాస్టర్‌: చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. అలాగే ఐస్‌క్రీమ్‌లన్నా కూడా చాలా ఇష్టం. పుచ్చకాయల సీజన్‌ వచ్చినప్పుడు మా నాన్న నన్ను బండి దగ్గర నిలబెట్టి భోజనానికి వెళ్లేవాళ్లు. ఆ సమయంలో పదో, ఇరవైయ్యో తీసి రాయి కింద పెట్టి దాచి, వాటితో సినిమాలకు వెళ్లే వాడిని. అలాగే స్కూల్‌ బ్యాగులను కూడా కంకరాళ్ల గుట్టకింద పెట్టి సినిమాలకు వెళ్లేవాడిని. ఒకరోజు దొరికిపోయా. మా అమ్మ నన్ను బాగా కొట్టేసింది!
‘సింధూరపువ్వా..’ పాట  స్టోరీ ఏంటి?
శేఖర్‌మాస్టర్‌: నేను అప్పుడు ఆరో తరగతి. హాస్టల్లో చేరా. బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టళ్లు వేర్వేరుగా ఉండేవి. పండగల సమయంలో ప్రోగ్రామ్‌లు పెడితే అందరం కలిసేవాళ్లం. అలా క్రిస్మస్‌కు ఒక అమ్మాయి స్టేజ్‌పై ‘సింధూరపువ్వా’ పాట పాడింది. అది పాట ప్రభావమో.. అమ్మాయి పాడిన విధానమో ఆ అమ్మాయి బాగా నచ్చింది. కానీ, నేను ఏమీ ప్రపోజ్‌ చేయలేదు. ఇంటర్‌లో కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించా.. నాది వన్‌సైడ్‌ లవ్‌.
ఒక్కో డ్యాన్స్‌ మాస్టర్‌కు ఒక్కో శైలి ఉంటుంది? అది సొంతంగా క్రియేట్‌ చేసుకుంటారా? లేక వెస్ట్రన్‌ సాంగ్స్‌ చూసి కాపీ చేస్తారా?
శేఖర్‌మాస్టర్‌: దక్షిణాదిలో ఏ కొరియో గ్రాఫర్‌ను తీసుకున్నా వారికి సొంత స్టైల్‌ ఉంటుంది. కానీ, నార్త్‌లోవాళ్లపై వెస్ట్రన్‌ సాంగ్‌ల ప్రభావం ఉంటుంది. 
కొరియోగ్రాఫర్‌గా మీ ఫస్ట్‌ సినిమా ఏది?
శేఖర్‌మాస్టర్‌: ‘పోస్ట్‌బాక్స్‌’ అనే సినిమా చేశా. అది విడుదల కాలేదు. ‘మంత్ర’లో ఒక పాట చేశా. నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట సుధీర్‌బాబు నటించిన ‘ఎస్‌ఎంఎస్‌’లోని ‘ఇది నిజమే! ఇది నిజమే’. ‘ఈ సాంగ్‌ చాలా బాగా చేశా’ అని ఇప్పటివరకూ ఏ పాట అనిపించలేదు. 

మీకు ఎప్పుడు పెళ్లయింది?
శేఖర్‌మాస్టర్‌: (నవ్వులు) నేను గ్రూప్‌ డ్యాన్సర్‌గా ఉండగానే పెళ్లయింది. మాకు ఒక పాప, బాబు. నా భార్యది కూడా విజయవాడే. మాకు ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత నేను గ్రూప్‌ డ్యాన్స్‌ చేసిన ‘కల్యాణరాముడు’ సినిమాకు తీసుకెళ్లా. అందులో ప్రభుదేవా మాస్టర్‌ పాటలో నేను కనిపిస్తా.
డ్యాన్స్‌ మాస్టర్‌ అయిన తర్వాత ప్రభుదేవాను ఎప్పుడైనా కలిశారా?
శేఖర్‌మాస్టర్‌: ‘ఇద్దరమ్మాయిలతో..’, ‘బాద్‌షా’లలో నేను చేసిన పాటలు చూసి ‘ఎవరు కంపోజ్‌ చేశారు. చాలా బాగున్నాయి’ అని ఆయన మేనేజర్‌ని అడిగారట. ‘శేఖర్‌ మాస్టర్‌’ అని చెప్పారట. ఇంటికి పిలిపించి, ‘నా పాటలకు డ్యాన్స్‌ చేస్తారా?’ అని అడిగారు. నేను డ్యాన్స్‌మాస్టర్‌ కావడానికి స్ఫూర్తే ఆయన. 
మావయ్య అంటే బాగా ఇష్టమా?
శేఖర్‌మాస్టర్‌: అవును! అప్పట్లో ఆయన హీరో వినోద్‌కుమార్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవారు.  ఒకరోజు మా మావయ్య వస్తే, ‘నేనూ హైదరాబాద్‌ వస్తా.. డ్యాన్సర్‌గా పనిచేస్తా’ అని చెప్పా. మొదట వద్దన్నారు. నా బాధ భరించలేక తీసుకొచ్చి డ్యాన్స్‌ మాస్టర్స్‌కు పరిచయం చేసి, మెంబర్‌షిప్‌ కార్డు కూడా ఇప్పించారు. అప్పటి నుంచి అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగా.
‘శేఖర్‌.. నువ్వు ఫోక్‌ డ్యాన్స్‌లకు పనికిరావు.. వేరే పాటలు చేసుకో’ అని ఒక డ్యాన్స్‌ మాస్టర్‌ చెప్పారట! ఎవరాయన?
శేఖర్‌మాస్టర్‌: మేము ఏ డ్యాన్స్‌ మాస్టర్‌ సాంగ్స్‌ చేయటానికి వెళ్లినా ప్రతి ఒక్కర్నీ పిలిపించి ఆడించేవారు. అందరూ చేసిన తర్వాత నన్ను, కిరణ్‌ను పిలిపించి డ్యాన్స్‌ చేయించేవారు. ‘డ్యాన్సర్లంటే వీళ్లలా ఉండాలి’ అనేవారు. అప్పట్లో వాళ్లకు అంతగా పేరుండేది కాదు. అయితే లక్కీగా వాళ్లు మాస్టర్లు అయ్యారు. ఒకసారి వాళ్లకి మాంటేజ్‌సాంగ్‌ చేయడానికి అవకాశం వస్తే, ‘డైరెక్టర్‌ నాకు డ్యాన్స్‌ సాంగ్‌ ఇస్తానన్నారు. మాంటేజ్‌ సాంగ్‌ నువ్వు చేయి’ అన్నారు. చాలా బాధేసింది. ‘మేము కేవలం మాంటేజ్‌ సాంగ్‌లు మాత్రమే చేస్తామా? డ్యాన్స్‌ సాంగ్‌లు చేయలేమా?’ అని అనుకున్నా. దేవుడి దయవల్ల ఆ తర్వాత అన్ని రకాల పాటలు చేశా. ‘మీ తర్వాత మేము. మీరు కాదంటే ఆ పాటలు మాకు వస్తున్నాయి.’ అని ఇప్పుడు వాళ్లు అంటున్నారు. చేతి నిండా పాటలు ఉంటున్నాయి. ఫ్యామిలీ కూడా హ్యాపీ!
శేఖర్‌ మాస్టర్‌ చిన్న సినిమాలు చేయడని అంటున్నారు నిజమేనా?
శేఖర్‌మాస్టర్‌: అలా ఏమీ లేదు. ఎవరైనా డైరెక్టర్‌ నన్ను నమ్మి నా కోసం వస్తే, డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసి తప్పకుండా చేస్తా. అలా చేసిన సాంగ్స్‌ ఉన్నాయి.
ఇటీవల చేసిన సినిమాలేంటి?
శేఖర్‌మాస్టర్‌: ‘వినయ విధేయరామ’లో ఒక పాట, ‘మిస్టర్‌ మజ్ను’లో అన్ని పాటలూ నేనే చేశా. ‘ఎఫ్‌2’లో నాలుగు పాటలు చేశా. 

దర్శకత్వం చేసే ఆలోచనా ఏమైనా ఉందా?
శేఖర్‌మాస్టర్‌: ప్రస్తుతానికైతే ఏమీ లేదు. చేయమని ఇద్దరు ముగ్గురు అడిగారు. నాకు ఆసక్తి లేదని చెప్పా. 
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏవైనా అవమానాలు ఎదురయ్యాయా?
శేఖర్‌మాస్టర్‌:: డ్యాన్సర్‌ కావాలనే ఇండస్ట్రీకి వచ్చా! అవకాశాలు లేనప్పుడు జూనియర్‌ ఆర్టిస్ట్‌గానూ వెళ్లా. అలా ఒక షూటింగ్‌ వెళ్తే, రూ.75 వచ్చాయి. వాటిని చూడగానే ఎంతో ఆనందపడ్డా. ఎందుకంటే తొలిసారి నేను కష్టపడి సంపాదించింది అదే! 
చిరంజీవి సినిమాకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేసినప్పుడు మీకెలా అనిపించింది?
శేఖర్‌మాస్టర్‌: ‘ఖైదీ నంబరు 150’లో రెండు పాటలకు నాకూ మరో మాస్టర్‌కు ఐదేసి రోజులు ఇచ్చారు. ఆయన చేసిన సాంగ్‌ ఆరు రోజులు పట్టింది. అందుకు నాకు కేటాయించిన ఐదు రోజుల్లో ఒక రోజు పోయింది. పైగా వాతావరణం కూడా సరిగా లేదు. అయితే, ఆరో రోజు చివరిలో ఒక గంట మాత్రం ఇచ్చారు. నాకు విమానం ఎక్కిన దగ్గరి నుంచే టెన్షన్‌. కానీ, సెట్‌పైకి వెళ్లిన తర్వాత ధైర్యం వచ్చేసింది. పైగా నేను చేసిన స్టెప్‌ చిరంజీవిగారు చేశారన్న సంతోషం. 
కొందరు వ్యక్తులు మీపై అభాండాలు వేశారు? రూమర్స్‌ విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?
శేఖర్‌మాస్టర్‌: ఏడేనిమిదేళ్లు వాళ్లను నమ్ముకుని పనిచేశా. అలాంటి వాళ్లు అలా చెప్పేసరికి బాధేసింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. 


ఆ మాస్టర్‌ కోసం ఒక వ్యక్తిని కొట్టి పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లారట!
శేఖర్‌మాస్టర్‌: రాజమండ్రి దగ్గర షూటింగ్‌ అయిన తర్వాత అందరం బస్సులో వస్తున్నాం. మాలో కొందరు స్వామి మాల వేసుకున్నారు. వారికి భోజనం కోసం ఆగాం. లేటు అయిపోతోందని మా మాస్టర్‌పై గొడవకు దిగి, ఆయన్ను తోశారు. దాంతో కోపం వచ్చి ఓ వ్యక్తిని కొట్టాను. అతను ఊళ్లో వాళ్లను తీసుకుని వచ్చాడు. దాంతో మేమంతా బస్సులోకి ఎక్కి కిటికీలు, తలుపు వేసుకున్నాం. బస్సు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ సెటిల్‌మెంట్‌ చేసుకున్నాం. ఆ మాస్టర్‌ కోసం నేను అంతలా గొడవ పడితే, చివరకు నాపై అభాండాలు వేశారు. రాత్రిళ్లు  ఫోన్‌ చేసి బూతులు తిట్టడం మొదలు పెట్టారు. ఉదయాన్నే మళ్లీ ఫోన్‌ చేసి ‘రాత్రి తాగేసి ఉన్నా.. ఏమీ అనుకోవద్దు’ అనేవారు. ఒకరోజు నన్నూ, సత్యను ఇంటికి పిలిపించుకుని తిట్టారు. ‘జీవితంలో మీ దగ్గరకు రాను మాస్టర్‌. సారీ! నాది తప్పు అయితే క్షమించండి’ అని బయటకు వచ్చేశా. ఆయనను ఎంతగా గౌరవించానంటే ఆయన పేరును నా చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నా!
మీరు అన్నదమ్ములు ఎంతమంది?
శేఖర్‌మాస్టర్‌: నేను అందరికంటే పెద్దవాడిని. నాకు ఇద్దరు తమ్ముళ్లు. వాళ్లు ఇప్పటికీ బీసెంట్‌రోడ్‌లోనే ఫుట్‌వేర్‌ బిజినెస్‌ చేస్తున్నారు. 
డ్యాన్స్‌ చేసేటప్పుడు హీరోల సలహాలు తీసుకుంటారా?
శేఖర్‌మాస్టర్‌: వాళ్ల బాడీ లాంగ్వేజ్‌కు కుదిరితే తీసుకుంటాం. 
హిందీలో సినిమాలు చేయడం ఎలా అనిపించింది?
శేఖర్‌మాస్టర్‌: ప్రభుదేవా మాస్టర్‌ వల్లే నాకు ఆ అవకాశం వచ్చింది. ఒక సినిమాలో అజయ్‌దేవగణ్‌కు ఒక స్టెప్‌ వేయమని చెప్పా. ఆయన సరిగా వేయలేదు. పెద్ద హీరో కదా నేను చెప్పలేని పరిస్థితి. అప్పుడు ప్రభు మాస్టర్‌ వచ్చి, నేను కంపోజ్‌ చేసిన స్టెప్‌ను వేసి చూపించి, అజయ్‌తో చేయించారు. నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి, ఒక అసిస్టెంట్‌లా మారి, అలా చేయడం నిజంగా చాలా సంతోషమేసింది. ఇక నాకు అంతకన్నా ఇంకా ఏం కావాలి చెప్పండి.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.