close

తాజా వార్తలు

ఆ మారణకాండను బయటపెట్టిన దుస్సాహసి

ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పౌరహక్కుల విషయంలో చాలా మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ తెరవెనుక చీకటి కోణాలను అధికారిక  రహస్యాల పేరుతో తొక్కిపెడతాయి. పారదర్శకత ఉన్న చోట రహస్యానికి చోటు ఉండదు. ప్రజస్వామ్య వ్యవస్థలకు పెద్దన్నలాంటి అమెరికాలో కూడా ఇటువంటి పద్దతే ఉంది. అధికారిక రహస్యాల పేరుతో ప్రభుత్వాల చీకటి పనులు మరుగున పడిపోతాయి. వీటిని బయట పెట్టడం అంటే ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడమే. తమ రహస్యాలు బయటపెట్టిన వ్యక్తిని ఏ దేశం అంత తేలిగ్గా వదిలిపెట్టదు. అలాంటిది ప్రపంచంలోని పదుల సంఖ్యలో దేశాల చీకటి కోణాలను బయటపెట్టడం అంటే ఎంత దుస్సాహసమో అర్థం చేసుకోండి. అలాంటి దుస్సాహసే జులియన్‌ అసాంజ్‌. ఆయన స్థాపించిన సంస్థే వికీలీక్స్‌.
వికీలీక్స్‌ ప్రారంభం..
ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్‌ హ్యాకర్‌ అయిన జూలియన్‌ అసాంజ్‌ 2006 అక్టోబరులో వికీలీక్స్‌ అనే డొమైన్‌ను రిజిస్టర్‌ చేయించారు. కానీ వెంటనే ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించలేదు. డిసెంబర్‌ నెలలో మాత్రం వికీలీక్స్‌ కొన్ని రహస్య పత్రాలను వెలువరించింది. ఎటువంటి కథనాలు లేకుండా కేవలం ముడి సమాచారాన్ని అందజేయడం వికీలీక్స్‌ శైలి. దీనికి ప్రపంచంలోని నలుమూలల నుంచి మేధావులు, పాత్రికేయులు, హ్యాకర్లు సహకరిస్తూ వచ్చారు. అమెరికాలోని 2007 గ్వాటనామా బే జైల్లో ఖైదీలతో అమెరికా సైనికులు వ్యవహరిస్తున్న విధానాన్ని తొలిసారి లీక్‌ చేసింది. ఆ తర్వాత చిన్నా చితకా సమాచారాలను బయటపెట్టింది. 2001లో ట్విన్‌టవర్స్‌పై దాడి జరిగిన తర్వాత వెళ్లిన దాదాపు 50వేల పేజర్‌ సందేశాలను 2009లో బయటపెట్టింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని లీక్‌ చేస్తోందని వికీలీక్స్‌పై విమర్శలు వచ్చాయి. దీనిలో అమెరికా అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన ఒక సందేశం కూడా ఉంది. ‘‘అధ్యక్షుడిని దారి మళ్లించాము. ఆయన వాషింగ్టన్‌కు రాకపోవచ్చు. ఎక్కడ ఉన్నారో తెలియదు’’ అనే సందేశం కూడా ఉంది. 

అమెరికాపై పెనుబాంబు..
వికీలీక్స్‌ తొలి పెను సంచలనం ప్రజాస్వామ్యం పెద్దన్న అమెరికాతోనే మొదలైంది. 2007లో బాగ్దాద్‌లో అమెరికా సైనికులు ఓ అపాచీ హెలికాప్టర్‌పై నుంచి సామాన్య ప్రజలను పిట్టల్లా కాల్చేసిన దృశ్యాలను వికీలీక్స్‌ బయటపెట్టింది.  ఈ ఘటనలో ఇద్దరు రాయ్‌టార్స్‌ వార్తాసంస్థ ప్రతినిధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులను తీసుకెళుతున్న వారిని కూడా అమెరికా సైనికులు వదిలిపెట్టలేదని దీనిలోని దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. వియత్నాం యుద్ధంలో అమెరికా సైనికుల మారుణకాండ బయటకు వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి స్పందనలు వచ్చాయో బాగ్దాద్‌ ఘటనపై కూడా అదే స్థాయిలో స్పందనలు వచ్చాయి. అదే సంవత్సరం అమెరికా సైనిక ఇంటెలిజెన్స్‌ విశ్లేషకుడు చెల్సియా మన్నంగ్‌ సాయంతో అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనికులు చేస్తున్న అనైతిక పనుల సమాచారాన్ని విడుదల చేసింది. ఆ తర్వాత ఇరాక్‌ యుద్ధంలో 66,000 మంది పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిన విషయాన్ని బహిర్గతం చేసింది. ఇరాకీ దళాలు ఖైదీలను వేధిస్తున్న విషయాలను కూడా వెల్లడించింది. ఈ క్రమంలో అమెరికా రహస్యంగా చేసే మరో అంశం 2011లో బయటకు వచ్చింది. ఐరాస అధికారుల వివరాలు, బయోమెట్రిక్‌ సమాచారం, ఐరిస్‌, డీఎన్‌ఏలను సేకరించాలన్న అమెరికా ప్రణాళిక బట్టబయలైంది. ఈ విషయాలు అమెరికా దౌత్యవేత్తలకు పంపిన 2.5లక్షల మెసెజ్‌ల్లో ఉన్నాయి. వాటిని వికీలీక్స్‌ బయటకు తెచ్చింది. దీంతో ఈ సంస్థ ఒక్కసారిగా అమెరికా రాడార్‌ పరిధిలోకి వచ్చింది. 
వికీలీక్స్‌కు కష్టాలు మొదలు..
2010లో వికీలీక్స్‌ వెబ్‌సైట్‌ పెద్ద సైబర్‌ దాడికి గురైంది. దీంతో ఇది వినియోగదారులకు కనిపించకుండా పోయింది. జస్టర్‌ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత నెలలోనే అమెజాన్‌ తన సర్వర్ల నుంచి వికీలీక్స్‌ను తొలగించింది. 
* 2010లోనే అసాంజ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆయనపై స్విడన్‌ ప్రభుత్వం రెండు వేర్వురు కేసులను నమోదు చేసింది. 
* బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, వీసా, మాస్టర్‌ కార్డు, పేపాల్‌, వెస్ట్రన్‌ యూనియన్‌లు వీకీలీక్స్‌తో సంబంధాలను తెంపుకొన్నాయి. దీంతో వికీలీక్స్‌కు వచ్చే నిధులు 95శాతం ఆగిపోయాయి. అదే సంవత్సరం కొన్నాళ్లు తాను కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 
*  సైనిక విషయాలు బయటకు రావడానికి  కారణమైన మన్నింగ్‌పై కోర్ట్‌ ఆఫ్‌ మార్షల్‌ విచారణ చేపట్టి 2013లో 35 ఏళ్ల ఖైదు విధించింది. అదే ఏడాది మన్నింగ్‌ లింగమార్పిడి ద్వారా చెల్సియా మన్నింగ్‌గా మారినట్లు ప్రకటించారు.
* బ్రిటిష్‌ నేషనల్‌ పార్టీ అజెండాలను, సోనీ పిక్చర్స్‌లో వేతన వ్యత్యాసాలను వికీలీక్స్‌ వెల్లడించింది. 

అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేలా..
2016 అక్టోబర్లో వికీలీక్స్‌ అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌కు సంబంధించిన 2,000 ఈమెయిల్స్‌ను లీక్‌ చేసింది. తనను ఇబ్బంది పెట్టిన  డెమొక్రాటిక్‌ పార్టీపై ఈ  రకంగా వికీలీక్స్‌ కక్షతీర్చుకొంది. వికీ దెబ్బకు అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమి చవిచూశారు. తనకు హిల్లరీ ఈమెయిల్స్‌ రష్యా నుంచి అందలేదని వికీలీక్స్‌ వెల్లడించింది.
అసాంజ్‌ అరెస్టు ఇలా..
2010లో అసాంజ్‌పై నమోదైన లైంగిక వేధిపుల కేసుకు సంబంధించి ఆయన లండన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనకు నగదు పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. కానీ అసాంజ్‌ను స్విడన్‌కు అప్పజెప్పకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2011లో అసాంజ్‌ కేసు ఓడిపోయాడు. 
దీంతో ఆయన 2012లో ఈక్వెడార్‌ దౌత్యకార్యాలయంలో రాజకీయ ఆశ్రయాన్ని కోరారు. దాదాపు రెండు నెలల తర్వాత రాజకీయ ఆశ్రయం మంజూరైంది. దీంతో ఆయన్ని అరెస్టు చేయడం లండన్‌ పోలీసుల వల్ల కాలేదు. అప్పటి నుంచి అక్కడ ఉంటూనే వికీలీక్స్‌ కార్యకలాపాలను నిర్వహించారు. బాగ్దాద్‌ మారణహోమం లీక్‌కు సాయం చేసిన చెల్సియాను విడుదల చేస్తే తాను లొంగిపోతానని 2017లో ప్రకటించారు. దీంతో ఒబామా ప్రభుత్వం చెల్సియాను అదే ఏడాది మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. 
మరుసటి నెలలోనే వికీలీక్స్ అమెరికా నిఘా సంస్థ సీఐఏ పై భారీ బాంబును వేసింది. వేల కొద్దీ సీఐఏ పత్రాలను బహిర్గతం చేసింది. వీటిల్లో స్మార్ట్‌ టీవీ, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు వంటి వాటిని లక్ష్యంగా చేసుకొనే నిఘా సాఫ్ట్‌వేర్‌ తయారీపై సీఐఏ చర్చించిన విషయాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదో పెను సంచలనమైంది. కానీ అమెరికా చెల్సియా మన్నింగ్‌ను విడుదల చేసింది. అయితే మరికొన్ని కేసుల్లో మన్నింగ్‌ విచారణను ఎదుర్కొంటోంది. 
2019లో  గూఢచర్య కార్యకలాపాలకు దౌత్యకార్యాలయాన్ని వాడుకొంటున్నాడనే ఆరోపణలతో ఈక్వెడార్‌ అసాంజ్‌ రాజకీయ ఆశ్రయాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత వెంటనే లండన్‌ పోలీసులు అక్కడకు చేరుకొని అసాంజ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను స్వీడన్‌కు అప్పగించే అవకాశం ఉంది. అక్కడి నుంచి అమెరికాకు అసాంజ్‌ను అప్పజెప్పవచ్చు. 
అసాంజ్‌పై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలను పక్కనపెడితే ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పారదర్శకంగా వ్యవహరించాలన్న విషయాన్ని వికీలీక్స్‌ ప్రపంచానికి వెల్లడించింది. సమాచారాన్ని వికీలీక్స్‌ ఆయుధం వలే వాడుకొందనే అరోపణలు కూడా ఉన్నాయి. కానీ అంతిమంగా ప్రభుత్వాలు చేసే చీకటి కోణాలపై కూడా  ప్రజలకు అవగాహన కల్పించింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.