
తాజా వార్తలు
ముంబయి: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ వారసుడిగా అడుగుపెట్టిన రిషభ్ పంత్ తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. నిర్లక్ష్య షాట్లతో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుతున్నాడు. దీంతో అతడిపై విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తున్నాయి. జట్టులో అతడి స్థానంపై పోటీ తప్పదని ఇప్పటికే టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పంత్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే పంత్‌కు ధోనీకి తేడా ఉందని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ధోనీ జట్టులో కుదురుకోవడానికి సమయం పట్టిందని, ఒక్క రోజులోనే జరిగిపోలేదని తెలిపాడు.
‘ఎంఎస్ ధోనీ ఒక్క రోజులోనే ప్రధాన వికెట్ కీపర్‌గా మారలేదు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొన్నేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా అంతే. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. దానికి సిద్ధమవ్వడానికి ఇంకా సమయం ఉంది. పంత్ నుంచి ఉత్తమ ప్రదర్శనను ఆశించే ముందు అతడి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఒత్తిడిని పెంచితే అతడు అద్భుతాలు సృష్టించలేడు. అవును, అతడికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ సారథి, కోచ్‌లు అతడిని భిన్నమైన కోణాల్లో పర్యవేక్షిస్తున్నారు ’ అని పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పంత్ 0, 4, 65* పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో 4, 19 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ తరఫున పంత్ ఇప్పటివరకు 11 టెస్టులు, 12 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 44.35 సగటుతో 754, వన్డేల్లో 22.9 సగటుతో 229, పొట్టి ఫార్మాట్లో 20.31 సగటుతో 325 పరుగులు చేశాడు.