close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. మున్సిపల్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ప్రతి మున్సిపాల్టీలో భూగర్భ డ్రైనేజీ ఉండాలని.. మురుగునీటి శుద్ధి కేంద్రాలతో పాటు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్ చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. నగరాలు, మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు: భట్టి

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ గెలుపు చారిత్రక అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతలపై తెరాస ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల దృష్టంతా హుజూర్‌నగర్ ఉపఎన్నికపైనే ఉందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక కావాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవాలని భట్టి అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇంకా ఎంతకాలం మాపై నెడతారు?:సోమిరెడ్డి

తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు శక్తికి మించి లబ్ధి చేకూర్చామని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రుణమాఫీకి సంబంధించిన జీవోను రద్దు చేయడం ఘోరమని.. రూ.7,958 కోట్ల రుణాలను ఎగ్గొట్టడం దారుణమని ఆయన విమర్శించారు. సున్నా వడ్డీ రుణాలకు బడ్జెట్‌లో రూ .100 కోట్లు కేటాయించి రూ.3,360 కోట్లు చెల్లిస్తామని చెబుతుంటే తామెలా నమ్మాలని ప్రశ్నించారు. చంద్రబాబుపై కక్షతో రైతుల గొంతు కోయొద్దని సోమిరెడ్డి హితవు పలికారు. ఇంకా ఎన్నిరోజులు గత ప్రభుత్వంపై తప్పులు నెడతారని ఆయన ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అధ్యక్షుడిని అవుతాననుకోలేదు: అజహర్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికవుతానని తానెప్పుడూ అనుకోలేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన ప్యానెల్‌ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అజహర్‌ చెప్పారు. అసోసియేషన్‌ సభ్యులు కేవలం ఓటు వేశామా.. ఇంట్లో కూర్చున్నామా అనేలా కాకుండా రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి వారి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలో ఇసుక కొరతపై ఉద్యమం: రామకృష్ణ

రాష్ట్రంలో ఇసుక సమస్యను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రభుత్వ ఇసుక నిల్వ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం కంటే ఈ సర్కారులోనే ఇసుకను అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. గతంలో రూ.2వేలకు ట్రాక్టర్ ఇసుక దొరికేదని.. ఇప్పుడు రూ.10వేలైనా లభించడం లేదన్నారు. గతంలో ఇసుకపై ఆరోపణలు చేసిన సీఎం జగన్.. ఇపుడు ఏం సమాధానం చెబుతారని రామకృష్ణ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉగ్రవాదంపై పోరుకు ఒక్కటవ్వాలి: మోదీ

శాంతి, సామరస్యాలే ప్రపంచానికి భారత్‌ ఇచ్చే సందేశమని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లలో ఉగ్రవాదం ఒకటన్నారు. జాతిపిత మహాత్మగాంధీ చెప్పిన సత్యం, అహింస నేటికీ అనుసరణీయమని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రజా సంక్షేమం, కాలుష్య నివారణ, డిజటలైజేషన్‌కు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే ఉగ్రవాదంపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు తీపికబురు!

ఆర్టీసీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల నుంచే వర్తింపజేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెలలో పదవీ విరమణ పొందే ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకుగాను సీఎం సూత్రపాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. వయోపరిమితి పెంపును ఈనెల నుంచే వర్తింపజేయాలని ఆర్టీసీ విలీన కమిటీ ప్రభుత్వానికి సూచించిన మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రూ.24లకే కిలో ఉల్లి .. అక్కడ రేపట్నుంచే!

దేశంలో నెలకొన్న ఉల్లి సంక్షోభం నుంచి దిల్లీ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఊరట కల్పించే ప్రకటన చేసింది. ఉల్లి ధరల పెరుగుదలతో వినియోగదారుల కళ్ల వెంబడి వచ్చే కన్నీళ్లను తుడిచేలా రేపటి నుంచి కిలో ఉల్లి రూ.23.90లకే పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ ఉల్లిపాయల్ని చౌకధరల దుకాణాలు, మొబైల్‌ వ్యాన్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఇమ్రాన్‌.. చైనాలో ముస్లింలపై మాట్లాడరేం?’

చైనాలో ఉయిఘర్స్‌ సహా టర్కీ భాష మాట్లాడే ముస్లిం మైనారిటీల నిర్బంధం గురించి ఎందుకు మాట్లాడడం లేదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు. ఈ విషయంలో ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని దక్షిణ, మధ్య ఆసియా విభాగ ప్రతినిధి అలైస్‌ వెల్స్‌ పాక్‌ వక్రబుద్ధిని బహిర్గతం చేశారు. కశ్మీర్‌ ముస్లింలపై ఆందోళన చెందుతున్న ఇమ్రాన్‌ చైనాలోని మైనారిటీలపై కూడా గళం విప్పాలని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఘోర రోడ్డు ప్రమాదం.. 16మంది మృతి

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని మినీవ్యాన్‌ ఢీకొట్టడంతో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాలేసార్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోధ్‌పూర్‌ వద్ద మినీ వ్యాన్‌ టైర్‌ పేలిపోవడంతో ఎదురుగా వస్తున్న బొలేరోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృత్యువాతపడగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.