close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. భారత్‌ చేతికి తొలి రఫేల్‌ యుద్ధ విమానం

భారత వైమానికదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్‌ రూపొందించిన రఫేల్‌ యుద్ధవిమానం భారత్‌ చేతికి అందింది. ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్‌లో డసోల్ట్‌ ఏవియేషన్‌  కర్మాగారంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  రఫేల్‌ యుద్ధవిమానాన్ని అధికారికంగా స్వీకరించారు. రఫేల్‌ను అందుకున్న అనంతరం విమానానికి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయుధపూజ నిర్వహించారు. భారత్‌కు మొత్తం 36 విమానాలు అందనుండగా ఇది తొలి విమానం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మనది పండుగల పుణ్యభూమి: మోదీ

వేల ఏళ్ల సంస్కృతితో ప్రజల జీవితం ముడిపడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మనదేశం పండుగలకు పుణ్యభూమి అని.. ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఈ పండుగలు వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. దిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మవిహారం

విజయదశమి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. గంగాదుర్గాసమేత మల్లేశ్వరస్వామి హంసవాహనంపై  విహరించారు. దేదీప్యకాంతుల నడుమ దుర్గమ్మ కృష్ణమ్మ ఒడిలో విహరించారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల మధ్య రమణీయ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సమరానికి సిద్ధమైన దేవరగట్టు

దసరా వచ్చిందంటే అక్కడి ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఉత్సవాలను విభిన్నంగా జరుపుకొంటారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పోటీ పడతారు. దీనిలో భాగంగానే కర్రల సమరం జరుగుతుంది. ఈ కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు పరిసర గ్రామాల ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఏటా దసరా పర్వదినం నాడు ఉత్సవ విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రణరంగమే సృష్టిస్తారు. ఈ ఏడాది కూడా సన్నద్ధమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కన్నులపండువగా భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. సమీపంలోని భద్రకాళి చెరువులో విద్యుత్‌ కాంతుల నడుమ హంసవాహనంపై అమ్మవారు విహరించారు. తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్ తదితరులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. వాయుకాలుష్యానికి ఆస్ర్పిన్‌తో చెక్‌

వాయుకాలుష్యం వల్ల కలిగే దుష్ర్పభావాలకు ఆస్ర్పిన్‌ మాత్రతో అడ్డుకట్ట వేయచ్చని ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడయింది. దీని ప్రకారం ఆస్ర్పిన్‌ వంటి స్టెరాయిడ్‌ రహిత నొప్పినిరోధక ఔషధాలు, కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల పనితీరుపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయట. బోస్టన్‌లో 73 ఏళ్ళ సరాసరి వయసు గల 2,280 మంది ఊపిరితిత్తుల పనితీరుపై 28 రోజులు పరీక్షలు జరిపి పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. 9 నెలల్లో అమ్ముడైంది ఒక్కటే!

టాటా మోటార్స్‌కు చెందిన బుల్లి కారు నానోను గత తొమ్మిది నెలల్లో ఒక్కటీ ఉత్పత్తి చేయలేదని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మొత్తంలో కేవలం ఫిబ్రవరిలో ఒక్కకారు మాత్రమే అమ్ముడయ్యిందని పేర్కొంది. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌ ఈ వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్‌లో నానోకు సంబంధించి దేశీయంగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తిగానీ, అమ్మకం గానీ జరగలేదని పేర్కొంది. గత 9 నెలల్లో ఒక్క యూనిట్‌ను ఉత్పత్తి చేయలేదని, ఫిబ్రవరి తర్వాత ఒక్క యూనిట్‌ను కూడా విక్రయించలేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. పాక్‌ది కట్టుకథే.. విన్యాసాల్లో సుఖోయ్‌

భారత వైమానిక దళం 87వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ఇండియన్‌ ఎయిర్‌ బేస్‌లో వార్షిక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వైమానికదళం సిబ్బంది హిండన్‌ వైమానిక స్థావరం వద్ద కవాతు నిర్వహించారు. బాలాకోట్‌ దాడుల తర్వాత జరిగిన వైమానిక దాడిలో తాము భారత్‌కు చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని పాక్‌ కట్టుకథ అల్లిందని అధికారులు తెలిపారు. విన్యాసాల్లో సుఖోయ్‌ యుద్దవిమానాలు పాల్గొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రూ.300 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

తిరుపతి రైల్వేస్టేషన్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన .. తిరుపతి స్టేషన్‌లో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ యూనిట్లను ప్రారంభించారు.  అనంతరం స్మార్ట్‌ రైల్వే ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వరుసగా ఎనిమిదో నెల ఉత్పత్తి తగ్గింపు..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వరుసగా ఎనిమిదో నెల కూడా ఉత్పత్తిలో కోత విధించింది. ఈ సారి సెప్టెంబర్‌లో కూడా ఉత్పత్తిని 17.48శాతం తగ్గించింది. ఈ నెలలో 1,32,199 కార్లను మారుతీ ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 1,60,219 యూనిట్లను తయారు చేసింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.