
తాజా వార్తలు
దువ్వాడ వద్ద రైలు కింద పడి దంపతుల మృతి
స్వగ్రామం గరివిడి మండలం వెదుళ్లవలసలో విషాదం
ఆ ఇల్లే కాదు.. ఆ పల్లె కూడా మూగబోయింది. ఈ విషాద వార్త విన్నవారందరికీ కళ్లు చెమ్మగిల్లాయి. దేశ రక్షణ రంగంలో పనిచేస్తున్న ఆ జవాను స్వగ్రామంలో అయిన వాళ్లతో కార్తిక పౌర్ణమి పూజలు చేయాలని ఎంతో ఆనందంగా భార్యతో కలిసి బయలు దేరారు. అదే ఆ దంపతుల చివరి మజిలీ అయ్యింది. మార్గమధ్యలోనే కడతేరి పోయారు. తాము ప్రయాణం చేసిన రైలే మృత్యువుగా మారి ప్రాణాలు తీసింది. బిడ్డలు రెక్కలు తెగిన పక్షులయ్యారు. కన్నీటి సంద్రంలో కూరుకుపోయారు.
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాద ఘటన విషాదం నింపింది. రైలు దిగుతుండగా జారి పడి కాపరోతు వెంకట రమణారావు, నాగమణి దంపతులు మృతి చెందడంతో వారి స్వగ్రామం గరివిడి మండలం వెదుళ్లవలస తీవ్ర విషాదం మునిగింది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందంటూ గుండెలవిసేలా బంధువులు రోదిస్తున్నారు. ఆత్మీయుల కళ్లు చెమ్మగిల్లాయి.
-వెెదుళ్లవలస (గరివిడి), న్యూస్‌టుడే
కార్తిక పౌర్ణమికి వస్తూ.. కడతేరిపోయారు
ప్రయాణించిన రైలే మృత్యు శకటమైంది...
దువ్వాడ స్టేషన్లో జారిపడి దంపతుల మృతి
వెదుళ్లవలసలో విషాద ఛాయలు
న్యూస్‌టుడే, వెదుళ్లవలస (గరివిడి)
ప్రయాణించిన రైలే మృత్యు శకటమై వారి ప్రాణాలు తీసింది. ఊహించని ప్రమాదంలో మార్గమధ్యలోనే ఆ దంపతులు కడతేరి పోయారు. దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆదివారం తెల్లవారు జామున రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తూ అదే బండి కింద పడి కాపరోతు వెంకట రమణారావు, నాగమణి దంపతులు మృత్యువాత పడ్డారు. వీరిది గరివిడి మండలం వెదుళ్లవలస కావడంతో కుటుంబసభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగి పోయారు.
రెక్కలు తెంచి.. ఆశలు తుంచి..
గరివిడి మండలం వెదుళ్లవలసకు చెందిన వెంకటరమణారావు (48) ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్పీఎఫ్ హవాల్దారుగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య నాగమణి (40), ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు పవన్ సాయి కృష్ణ (20) చెన్నైలో ఇంజినీరింగు చదువుతున్నాడు. చిన్న కుమారుడు నేతాజీ వెంకట సాయి (19) హైదరాబాదులోని జేఎన్టీయూలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. వృత్తిరీత్యా ఛత్తీస్‌ఘడ్‌లో ఉంటున్న వెంకటరమణారావు ఏటా కార్తిక మాసంలో పౌర్ణమి రోజున స్వగ్రామం చేరుకుంటారు. విశ్రాంత ఉపాధ్యాయుడైన తన తండ్రి సీతారామస్వామి వద్దకు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కొద్ది రోజులు గ్రామంలో ఉండి, బంధువులతో ఆనందంగా గడిపి తిరుగు పయనం అవుతారు. ఈ ఏడాది కార్తిక పౌర్ణమి వేడుకకు భార్యతో కలిసి స్వగ్రామం బయలు దేరారు. రైలు లో వస్తూ మార్గమధ్యలో ఉన్న దువ్వాడలో అత్తవారింటికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఒక రోజు ఉండి ఇంటికి వస్తామని తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున దువ్వాడ చేరుకున్నా మేల్కొనలేదు. ఆ తర్వాత రైలు కదులుతున్న సమయంలో స్టేషన్‌ను గుర్తించి నిద్రమత్తులో హడావుడిగా దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దంపతులిద్దరు జారిపడి అదే రైలు కింద పడి మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెదుళ్లవలస గ్రామం నిర్ఘాంత పోయింది. కొడుకు, కోడలు వస్తున్నారు.. కార్తిక పౌర్ణమి పూజలతో ఇళ్లంతా సందడిగా ఉంటుందని ఆనందపడితే.. ఎంత పని చేశావు దేవుడా అంటూ వెంకట రమణారావు తండ్రి రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులు ఇక లేరన్న చేదు నిజాన్ని భరించలేక కుమారులిద్దరూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఇద్దరు బిడ్డలు పెద్దదిక్కును కోల్పోయి రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలారంటూ బంధువులు విలపిస్తున్నారు. పిల్లల్ని ఉన్నతవిద్య చదివించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేయాలని నిత్యం పరితపించే తల్లిదండ్రులను దేవుడు తీసుకుపోవడంతో బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారందని స్థానికులు బాధపడుతున్నారు.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
వెంకట రమణ రావు, నాగమణి దంపతుల మృతదేహాలు ఆదివారం సాయంత్రం వెదుళ్లవలసకు చేరుకున్నాయి. ఇక్కడ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వెంకట రమణారావు సీఆర్పీఎఫ్ హవల్దారు కావడం, ఆయన సర్వీసులో ఉండగా మృతి చెందడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు గౌరవ వందనం చేసి నివాళులర్పించారు. భార్యాభర్తల మృతదేహాలను కడసారిగా చూసేందుకు గ్రామస్థులంతా తరలివచ్చారు. కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన దంపతులిద్దరూ బంధం వీడకుండా మరణంలోనూ కలిసే వెళ్లిపోయారంటూ అందరూ కంటతడి పెట్టారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
