close

తాజా వార్తలు

నన్ను తప్పుదారి పట్టించారు

తెలుగు ప్రేక్షకులకు ‘కాంచనమాల కేబుల్‌టీవీ’తోనే కనెక్ట్‌ అయిపోయింది... లక్ష్మీరాయ్‌. ఆ చిత్రం విజయవంతం కాకపోయినా లక్ష్మీరాయ్‌ తన అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ... అవి అనువాదాలుగా తెలుగులోనూ విడుదలయ్యేవి. అలా తెలుగు ప్రేక్షకులకు టచ్‌లోనే ఉంటూ అడపాదడపా అవకాశాలు అందుకుంది లక్ష్మీ. ‘బలుపు’ నుంచి ప్రత్యేకగీతాలకి కేరాఫ్‌గా మారింది. అమ్మడూ ‘లెట్స్‌ డూ కుమ్ముడూ...’ అంటూ చిరంజీవితోనూ, ‘తోబ తోబా’... అంటూ పవన్‌కల్యాణ్‌తోనూ సందడి చేసింది. లక్ష్మీరాయ్‌గా ప్రయాణం ఆరంభించిన ఈమె, మధ్యలో లక్కు కోసం రాయ్‌లక్ష్మిగా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రధారిగా ‘వేర్‌ ఈజ్‌ ది వెంకట లక్ష్మి’గా త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాయ్‌లక్ష్మీని ‘హాయ్‌’ పలకరిస్తే తన ప్రయాణాన్ని ఇలా ఆవిష్కరించింది...

* కథానాయికలు ఎక్కువకాలం కొనసాగడం అరుదు. మీ ప్రయాణం పదిహేనేళ్లుగా సాగుతోందెలా?
కాలం మారింది. ఇదివరకు మీరన్నట్టుగా కథానాయికల కెరీర్‌ ఐదారేళ్లకి మించి ఉండేది కాదు. ఇప్పుడు దశాబ్దాలుగా కొనసాగుతున్నవాళ్లు చాలామందే కనిపిస్తారు. కొద్దిమంది మధ్యలో విరామం తీసుకొని మళ్లీ తిరిగొచ్చి, వాళ్లదైన ముద్ర వేశారు. నేను తొందరగానే పరిశ్రమకి వచ్చా. నా తొలి సినిమా చేసినప్పుడు నాకు పదిహేనేళ్లు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. నేను విజయాల్ని అందుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టింది. సినిమా ప్రయాణం పరంగా చూస్తే... నా విషయంలో అన్నీ ఆలస్యంగానే జరుగుతుంటాయి. విజయాలు అలానే వచ్చాయి.  నా ప్రయాణం గురించి గర్వంగా చెబుతాను. పరిశ్రమలో నాకు తెలిసినవాళ్లు ఎవ్వరూ లేరు. భాష కూడా తెలియదు. ఎదురైన ప్రతి కష్టాన్నీ అధిగమించాను. ప్రతి అనుభవంతో ఓ పాఠం నేర్చుకున్నా. ఈ విషయంలో తమిళ దర్శకుడు జీవాకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే నన్ను కొత్తగా పరిచయం చేశారు.

* ఇక ఈ పరిశ్రమలో కొనసాగడం కష్టం, వెనుదిరిగి వెళదామని ఎప్పుడూ అనిపించలేదా?
నటన అనేది నా ప్యాషన్‌. మనకు ఇష్టమైన రంగంలో కొనసాగాలనుకొన్నప్పుడు ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు. కాకపోతే కొన్నిసార్లు, కొద్దిమంది వ్యక్తులపై చెడు అభిప్రాయం ఏర్పడేది, కోపం వచ్చేది. అప్పట్లో నన్ను తప్పు దారి పట్టించినవాళ్లు చాలామందే. ఇప్పుడంటే సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. నేరుగా అభిమానులతో మాట్లాడొచ్చు, వారి అభిప్రాయాల్ని తెలుసుకోవచ్చు. కానీ నేను వచ్చిన కొత్తలో ఇవన్నీ ఉండేవి కావు. కెరీర్‌ పరంగా నన్ను తప్పు దారి పట్టించేసి, ఆ తర్వాత లేని పోని వివాదాలు సృష్టించేవాళ్లు. అది నాకు ఆలస్యంగా బోధపడింది. ఎవరెన్ని చేసినా... నాతోనే నేను పోటీపడుతూ ఒకొక్క మెట్టు ఎక్కా. నాకు నచ్చిందంటే అందుకోసం ఎంతైనా కష్టపడతుంటా. నచ్చలేదంటే ఇంట్లో ఖాళీగానైనా కూర్చుంటాను.

* పదిహేనేళ్లకే చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చారు?
మోడలింగ్‌ వల్లే ఈ రంగంలోకి అడుగుపెట్టా. ఎవరైనా తొలి అవకాశం కోసం కష్టపడతారు. నాకు అనుకోకుండానే అవకాశం వచ్చింది. నా ఎత్తు, మోడలింగ్‌లో నా ప్రతిభని చూసిన దర్శకుడు నన్ను కథానాయికగా ఎంపిక చేశారు. కానీ మొదట్లో పడాల్సిన కష్టాలన్నీ, కథానాయికని అయ్యాక పడాల్సొచ్చింది. చాలామంది నాకు తప్పుడు సూచనలు ఇచ్చేవారు. వాళ్లు చెప్పిందల్లా వింటూ, వాళ్లనే అనుసరించేదాన్ని. నాకు విషయం అర్థమయ్యేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది.

* సినిమాల్లోకి రావాలనే ఆలోచనే ఉండేదా?
మాది కచ్చీ గుజరాతీ కుటుంబం. పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. నాకు ఇద్దరు అక్కలు. మూడో సంతానంగా అబ్బాయి కావాలనుకున్నారట మా తల్లిదండ్రులు. కానీ నేను పుట్టాను. అవడానికి నేను అమ్మాయినే కానీ... అచ్చం అబ్బాయిలాగే పెరిగాను. స్కూల్‌డేస్‌లో చాలా నాటీగా ఉండేదాన్ని. ఎవ్వరి మాట వినేదాన్ని కాదు. చదువుపై అస్సలు ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల్లో పాల్గొనేదాన్ని తప్ప చదువుకొనేదాన్ని కాదు. ఒకవేళ నేను సినిమా రంగంలోకి రాకపోయుంటే స్పోర్ట్స్‌ పర్సన్‌ అయ్యుండేదాన్ని. స్కూల్‌లో రకరకాల ఆటల్లో గెలుచుకున్న మెడల్స్‌తో ఇంటికి వెళ్లడంలో ఓ కిక్‌ ఉండేది. కానీ నా ఎత్తు, నా ఫేస్‌ని గమనిస్తున్న టీచర్లు, స్నేహితులు మాత్రం సినిమాల్లోకి వెళితే బాగుంటావని ప్రోత్సహించేవారు. మోడలింగ్‌వైపు వెళ్లడానికి కారణం వాళ్లే.

* సినిమాల్లోకి వెళతానంటే ఇంట్లోవాళ్ల స్పందనేంటి?
మా ఇంట్లోవాళ్లు నన్ను ఇప్పుడూ అమ్మాయిలా చూడరు. వాళ్లకి నేను మొదట్నుంచీ అబ్బాయినే. అలాగే పెంచారు. నా చదువు, కెరీర్‌ గురించి నాకే స్వేచ్ఛనిచ్చారు. మా అమ్మానాన్నలు నన్నంతగా నమ్మినందుకు ఇప్పుడు  చాలా గర్వంగా ఉంటుంది. సినిమా రంగంలోకి వస్తున్నప్పుడు నన్ను ఏమీ అనలేదు కానీ... వచ్చాక మాత్రం నాపై వచ్చిన రకరకాల వివాదాలు వాళ్లని బాధపెట్టాయి.

* మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన వివాదమేమిటి?
నేను కథానాయికగా కెరీర్‌ ఆరంభించినప్పట్నుంచి ఏదో ఒక ప్రచారం నా విషయంలో సాగుతూనే ఉంది. సహ నటులతో సంబంధాలు అంటగడుతూ కొన్నిసార్లు ప్రచారం చేశారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో లింక్‌లు పెడుతూ రాశారు. ఒక సెట్‌లో రుచిగా ఉందని మామిడికాయ తింటే... లక్ష్మీరాయ్‌ గర్భవతి అని ప్రచారం చేశారు. నా జీవితంలో వివాదాలు ఓ భాగమైపోయాయి. శ్రుతిమించడంతో కొన్నిసార్లు న్యాయస్థానాలకి కూడా వెళ్లాల్సొచ్చింది.

* ప్రేమలో పడ్డారా? 

నా జీవితంలో లవ్‌, బ్రేకప్స్‌ ఉన్నాయి. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. అబ్బాయిలు భావోద్వేగాలకి గురవుతారు కానీ... వాళ్లు బయట పడరు. కానీ అమ్మాయిలు అలా కాదు. వెంటనే బయటపడిపోతాం. నటన పట్ల నేను చాలా అంకితభావంతో ఉంటాను. నన్ను ఇష్టపడే వ్యక్తులు నా వృత్తికి, నా ఆలోచనలకి గౌరవం ఇవ్వాలంటాను. నాలాంటి అమ్మాయిలు జీరో నుంచి మొదలుపెట్టి  కెరీర్‌ని నిర్మించుకుంటారు. జీవితంలోకి వచ్చే వ్యక్తి అది గమనించాలి. అలాంటి విషయాల్లో తేడాలు రావడంతోనే, ఒకరికి దూరం కావల్సి వచ్చింది.
- నర్సిమ్‌ ఎర్రకోట, ఫొటోలు: జయకృష్ణ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.