close

తాజా వార్తలు

వెండితెరపై సంక్రాంతి సందడి

వెండితెరపై సంక్రాంతి సందడి

ఇంటర్నెట్‌డెస్క్‌: కాల గమనంలో మరో ఏడాది కరిగిపోగా, సరికొత్త ఆశలతో, ఆశయాలతో మరో సంవత్సరం ముందుకొచ్చింది. జనవరి ఫస్టు వచ్చిందంటే, వెను వెంటనే గుర్తొచ్చేది తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. రంగవల్లికలు.. కోడి పందేలు.. హరిదాసు సంకీర్తనలు.. కొత్త అల్లుళ్ల కేరింతలు.. ఇలా ఎన్నో సరదాలనూ, సంతోషాలనూ పంచుతుంది సంక్రాంతి. ప్రజలకే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఇదే పెద్ద పండగ. తెలుగువారికి సంక్రాంతి సరదాలలో కొత్త సినిమా ఎప్పుడో చేరిపోయింది. మరి అలాంటి సంక్రాంతికి ఈసారి వెండితెరపై సందడి చేయబోతున్న చిత్రాలేంటో ఓసారి చూద్దామా!

‘యన్‌టిఆర్‌’తో తొలి అడుగు!
తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారకరామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన చేయని పాత్రలేదంటే అతిశయోక్తికాదు. ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ రూపంలో ఎన్టీఆర్‌ మన ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ టైటిల్‌రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌.’ క్రిష్‌ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ సినీ రంగ ప్రవేశం నుంచి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే వరకూ జరిగిన సంఘటనలకు క్రిష్‌ దృశ్యరూపం ఇవ్వనున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ కావడం ఒక ఎత్తయితే, ఇందులో చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది నటులు పలు పాత్రల్లో తళుక్కున మెరవనుండటం మరొక ఎత్తు. చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌, రేలంగి పాత్రలో బ్రహ్మానందం, సావిత్రిగా నిత్యామేనన్‌, శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, కె.వి.రెడ్డిగా క్రిష్‌, దాసరి నారాయణరావుగా చంద్ర సిద్ధార్థ నటిస్తుండగా, ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లకు విశేష స్పందన వస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకులు.

వెండితెరపై సంక్రాంతి సందడి

సాఫ్ట్‌ టైటిల్‌తో మాస్‌ హీరో!
హీరోకు మాస్‌ ఇమేజ్‌ తీసుకొచ్చే దర్శకుల్లో బోయపాటి శ్రీనివాస్‌ ఒకరు. తన రెండో చిత్రం ‘మగధీర’తోనే మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్‌చరణ్‌. వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. కియారా అడ్వాణీ కథానాయిక. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడు. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్‌ చూసి సాఫ్ట్‌గా ఉందనుకున్న వారు ట్రైలర్‌ చూసి షాకయ్యారు. రామ్‌చరణ్‌ను మెగా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలో సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. టీజర్‌, ట్రైలర్లలో రామ్‌చరణ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, డైలాగ్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ‌సంగీతం ప్రధాన ఆకర్షణ.

వెండితెరపై సంక్రాంతి సందడి

వరుణ్‌ వెంకీల ఫన్‌.. ఫ్రస్ట్రేషన్‌
కథా నచ్చితే మరో కథానాయకుడితో తెర పంచుకునేందుకు ఎప్పుడూ ముందుండే హీరో వెంకటేష్‌. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’ చిత్రాలతో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌తో కలిసి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమే ‘ఎఫ్‌2’: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. ‘సంక్రాంతి అల్లుళ్లు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ను చూస్తే, సినిమాను ఆద్యంతం నవ్వులు పంచేలా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

వెండితెరపై సంక్రాంతి సందడి

రజనీ అభిమానులకు డబుల్‌ ధమాకా!
2018లో ‘2.ఓ’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌. తలైవా చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసే అభిమానులకు ‘పేట’తో అటు సంక్రాంతి, ఇటు రజనీ చిత్రంతో డబుల్‌ కా మీటా అందినట్లయింది. ‘పిజ్జా’, ‘జిగర్తాండ’ వంటి చిత్రాలతో తనదైన ముద్రవేసిన యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ నటిస్తుండటం విశేషం. విజయ సేతుపతి, సిమ్రన్‌, త్రిష కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

వెండితెరపై సంక్రాంతి సందడి

అజిత్‌ ‘విశ్వాసం’
తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగువారికి సుపరిచితుడైన నటుడు అజిత్‌. ఇటీవల ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. శివ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘విశ్వాసం’. నయనతార కథానాయిక. జగపతిబాబు ప్రతినాయకుడు. కాగా, ఇటీవల విడుదల చేసిన తమిళ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రం తమిళనాట జనవరి 10న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ సంక్రాంతి బరిలో ఉందనే సినీ వర్గాలు చెబుతున్నాయి.

వెండితెరపై సంక్రాంతి సందడి

బాలీవుడ్‌ నుంచి...
ఉరి ఘటనకు ప్రతీకారంగా, శత్రు దేశమైన పాకిస్థాన్‌లోకి చొచ్చుకు వెళ్లి, ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసి భారత్‌ తలెత్తుకునేలా చేశారు మన సైనికులు. ఆ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమే ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌. విక్కీ కౌశల్‌, పరేశ్‌ రావల్‌, యామిగౌతమ్‌, క్రితి కుల్హారి, మోహిత్‌ రైనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఆరు పెద్ద సినిమాలే కాదు... సచిన్‌ జోషి, వివన్‌ భతీనా, నర్గీస్‌ ఫక్రీ కీలక పాత్రలు పోషించిన ‘అమావాస్‌’ కూడా జనవరి 11న తెరపై కనువిందు చేయనుంది. సన్నీ దేఓల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాంక్‌’ కూడా అదే రోజు వెండి తెరపై ప్రదర్శితం కానుంది.

వెండితెరపై సంక్రాంతి సందడి


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.