close

తాజా వార్తలు

తండ్రి.. తనయుడు ఒక జెర్సీ

ఓ ఇంట్లో నాన్న, కొడుకు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.. అక్కడ గోడకు ఉన్న అల్మారాలో పేర్చి ఉన్న ట్రోఫీలు, పతకాలు చూసిన ఆ ఐదేళ్ల బాలుడు.. ఇవి ఎవరివీ అని నాన్నను అడిగాడు. అవి క్రికెట్‌, అథ్లెటిక్స్‌లో నాకు వచ్చిన బహుమతులు అని ఆ తండ్రి సగర్వంగా చెప్పాడు.. మరీ నాకు ఇలాంటివి రావాలంటే ఏం చేయాలి?... ఆ చిన్నారి నుంచి మరో ప్రశ్న. నువ్వు కూడా ఆటలో రాణించి వాటిని సాధించాలి.. ఆ నాన్న సమాధానం. కాలం గిర్రున తిరిగింది.. పదహారేళ్లు గడిచిపోయాయి.. ఆ పిల్లాడు ఇప్పుడు క్రికెట్లో సత్తా చాటుతున్నాడు.. ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్నాడు.. ట్రోఫీల సంఖ్యలో నాన్ననే మించిపోయాడు. చదువుతుంటే ఇదంతా సినిమా కథలా ఉంది కదా! కానీ ఇది నిజం.. ఆ కొడుకు పేరు పృథ్వీరాజ్‌ యర్ర. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున బరిలో దిగిన 21 ఏళ్ల లెఫ్టార్మ్‌ పేసర్‌. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి.. ప్రతిష్ఠాత్మకమైన ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కించుకునేంత వరకు సాగిన అతని ప్రయాణం అందరికి ఆదర్శం.

కొడుకు కోరిక కోసం ప్రాణాలు పోతాయని తెలిసినా తండ్రి క్రికెట్‌ ఆడడం.. ఇది ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ సినిమా కథ. నాన్న కలను.. నిజం చేసేందుకు అహర్నిశలూ కష్టపడుతూ.. క్రికెట్లో అత్యుత్తమ స్థాయికి చేరే దిశగా అడుగులు వేయడం.. ఇది మనకు తెలీని పృథ్వీ కథ. ప్రకాశం జిల్లా పోతుకట్ల గ్రామంలో పుట్టిన పృథ్వీ చిన్నప్పటి నుంచి ఆటల్లో రాణించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నాన్న స్ఫూర్తితో క్రికెట్లో అడుగుపెట్టాడు. చిన్న వయసులో బంతిని వేగంగా వేయడం అలవాటు చేసుకున్న అతను పేసర్‌గా మారాడు. ప్రస్తుతం సగటున 142 కి.మీ వేగంతో బంతులు వేస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌లో హైదరాబాద్‌ గడ్డపై సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసి... స్టార్‌ ఆటగాడు వార్నర్‌ వికెట్‌ తీసి తన బౌలింగ్‌ పదును చూపించాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో కోల్‌కతా రూ.20 లక్షలకు ఇచ్చి అతణ్ని జట్టులోకి తీసుకుంది.

ఛాంపియన్‌గా చూడాలని
శ్రీనివాసరావు మాజీ క్రికెటర్‌, అథ్లెట్‌. అంతర్‌ జిల్లా స్థాయి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జావెలిన్‌ త్రోలో రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే అనివార్య కారణాల వల్ల క్రీడల్లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత తన కొడుకు పృథ్వీ క్రికెట్‌పై ఆసక్తి చూపించడంతో.. అతణ్ని మంచి క్రికెటర్‌గా చూడాలనుకున్నాడు. తన అన్న డా.విజయ్‌ మోహన్‌ (వ్యాయామ విద్య డైరెక్టర్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం) సూచనతో అతనికి శిక్షణ ఇప్పించడం మొదలెట్టాడు. జూనియర్‌ స్థాయిలో అతను సత్తాచాటడంతో మెరుగైన శిక్షణ కోసం వాళ్ల కుటుంబం విశాఖపట్నానికి వచ్చేసింది. అక్కడ ఆంధ్ర క్రికెట్‌ అకాడమీలో కొన్నేళ్లు పృథ్వీ సాధన చేశాడు. రాష్ట్ర జూనియర్‌ జట్ల తరపున మెరిశాడు. క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న పృథ్వీకి తోడుగా ఉండడం కోసం వాళ్ల నాన్న ఉద్యోగాన్ని మానేశాడు. ఎప్పుడు అతని వెంటే ఉంటూ ఆటలో మెరుగయ్యేలా ప్రోత్సహించాడు. ప్రస్తుతం తన కొడుకు సాధిస్తున్న విజయాలను చూసి గర్వపడుతున్నానని శ్రీనివాసరావు తెలిపాడు. ‘‘టీమ్‌ఇండియాకు ఎంపికవడమే లక్ష్యంగా పృథ్వీ ముందుకు సాగుతున్నాడు. మంచి ప్రదర్శనతో సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్‌లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. నిజానికి గతేడాది ఐపీఎల్‌లోనే పృథ్వీ ఆడాల్సింది. అయితే గాయం కారణంగా దూరమయ్యాడు. వేలానికి ముందు ఈసారి అతను కచ్చితంగా ఐపీఎల్‌ ఆడతాడనే నమ్మకం కలిగింది’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నాడు.

అంచెలంచెలుగా..
ఫాస్ట్‌ బౌలర్‌కు అతిపెద్ద సమస్య గాయం.. పృథ్వీ ఇందుకు మినహాయింపేం కాదు. గాయాలు అతడి కెరీర్‌ను దెబ్బతీయకపోతే ఇప్పటికి అతడు మంచి స్థితిలో ఉండాల్సింది. తొలుత అంతర్‌ జిల్లా టోర్నీయే అతడు ఆడిన పెద్ద టోర్నీ. అందులో తొలి మ్యాచ్‌లోనే అతడు ఐదు వికెట్లు తీసి సత్తాచాటాడు. అక్కడి నుంచి అతడికి ఎదురులేకుండా పోయింది. అండర్‌-16 జట్టు తరపున విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేశాడు. అండర్‌-19 పాఠశాలల టోర్నీలో ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అక్కడ ఆకట్టుకున్న అతడికి తొలిసారి 2016లో సర్వీసెస్‌తో స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆంధ్ర రాష్ట్ర జట్టు తరపున ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతను సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు. అదే ఏడాది కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీలో క్వార్టర్స్‌, సెమీస్‌లో జోరు కొనసాగించిన పృథ్వీ తన జట్టును ఫైనల్‌ చేర్చాడు. ఆంధ్ర జట్టు ఆ టోర్నీ ఫైనల్‌ చేరడం అదే తొలిసారి. 2017లో జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపికైన అతను గాయం కారణంగా వెళ్లలేకపోయాడు. దాని నుంచి కోలుకొని రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆరు వికెట్లతో రాణించాడు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే మళ్లీ గాయం అతణ్ని దెబ్బతీసింది. ఆరు నెలల పాటు జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉండి ఫిట్‌గా తయారయ్యాడు. నిరుడు బీసీసీఐ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఉత్తమ యువ బౌలర్ల జాబితాలో పృథ్వీ చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి అతనిపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం వైజాగ్‌లో ఇంజనీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్న అతను.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో 145 కి.మీపైన వేగంతో బంతి వేసి ఆశ్చర్యపరిచాడు. పృథ్వీ నిలకడగా ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌కు మరో మంచి లెఫ్టార్మ్‌ పేసర్‌ దొరికినట్లే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.