close

తాజా వార్తలు

అంతర్జాలం... అశ్లీల గాలం

సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోల హల్‌చల్‌
ప్రభావితులై ఈవ్‌టీజర్లుగా మారుతున్న విద్యార్థులు

హైదరాబాద్‌: ‘‘అంతర్జాలం... ఫేస్‌బుక్‌... వాట్సాప్‌... యూట్యూబ్‌... తదితర సామాజిక మాధ్యమాలతో ఎన్నో ఉపయోగాలున్నా... కౌమార దశలో ఉన్న విద్యార్థులు 65 శాతం మంది వీటిలో అశ్లీల దృశ్యాలు.. సమాచారం వైపే మొగ్గుచూపుతున్నారు.. అంతర్జాల కేంద్రాలు... ల్యాప్‌ట్యాప్‌లలో వీటిని చూస్తే ఎవరైనా గమనిస్తారన్న భావనతో స్మార్ట్‌ ఫోన్లలో వీక్షిస్తున్నారు. వీటి ప్రభావంతోనే యువతులు, సహ విద్యార్థినులను ఈవ్‌టీజింగ్‌ చేస్తున్నారు... వేధిస్తున్నారు... కొందరు పార్టీల పేరుతో అసభ్య చిత్రాలను చూస్తున్నారు... మరికొందరు సహ విద్యార్థినులను ఆకర్షించి వారిని హుక్కా కేంద్రాలకు తీసుకెళ్తున్నారు...’’

 వేధింపులు, ఈవ్‌టీజర్లను, పోకిరీలను పట్టుకుంటున్న ‘షి’ బృందం సేకరించిన సమాచారమిది. చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులను మినహాయిస్తే మిగిలిన వారంతా సామాజిక మాధ్యమాలు అంతర్జాలంలో అశ్లీలాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి తొలివారం వరకూ 270 ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులతో వార్షిక పరీక్షలకు ముందు వారితో  ‘షి’ బృందాలు మాట్లాడగా... ఈ విషయాలు తెలిశాయి.
ఫేస్‌బుక్‌.. వాట్సాప్‌లకు ప్రత్యామ్నాయంగా క్రీడలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులు, యువకులను మేం కౌన్సెలింగ్‌ చేస్తున్నప్పుడు కీలకాంశాన్ని పోలీసులు తెలుసుకున్నారు. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ చేస్తే ఆనందం వస్తుందనుకుంటున్న వారిలో 90 శాతం మందికి చదువు తర్వాత ఇతర వ్యాపకాలు లేవు. ఇంటికి రావడం, కొద్దిసేపు ఇంట్లో ఉండి స్నేహితులతో కలిసి బయటకు రావడం పార్కుల వద్ద విద్యార్థినులు, యువతులు కనిపిస్తే వారినుద్దేశించి అసభ్యంగా మాట్లాడడం వంటివి చేస్తున్నారు. వీరికి చదువు తర్వాత మానసికోల్లాసం కలిగించేలా అంశాలు లేకపోవడమే ప్రధాన కారణం. టెన్నిస్‌, షటిల్‌, క్రికెట్‌ వంటి ఆటలు ఆడడం లేదు. ఇండోర్‌గేమ్స్‌లలో పాల్గొనడం లేదు. బుర్రకు పదును పెట్టడానికి ఉపకరించే చదరంగం, ప్రహేళికలు(పజిల్స్‌) వంటి వాటిని విస్మరిస్తున్నారు. ఫలితంగా ఈవ్‌టీజర్లుగా మారి కొందరు సిగరెట్లు, మద్యం తాగడం వంటి దురలవాట్లు నేర్చుకుంటున్నారని గుర్తించారు.

చిక్కులు తెస్తున్న లెక్కలివి
 15-17 ఏళ్ల వయసు విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల ద్వారా అశ్లీలం చూస్తున్నవారు: 63 శాతం
 18-20 ఏళ్ల విద్యార్థుల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారు: 54 శాతం
 సహ విద్యార్థినులు, యువతులను వేధించి ఆనందం పొందుతున్నవారు: 49 శాతం
 ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌లలో గడిపే సమయం: రోజుకు 4-5 గంటలు
 15-20 ఏళ్ల విద్యార్థులు, యువకుల్లో హుక్కా కేంద్రాలకు వెళ్తున్న వారు: 20 శాతం
 15-20 ఏళ్ల విద్యార్థులు, యువకుల్లో మద్యం, సిగరెట్లు తాగుతున్న వారు: 36 శాతం.

తల్లిదండ్రులూ గమనించండి
ఆశ్లీల వీడియోల ప్రభావంతో పక్కదారి పడుతున్న యువకులు మరీ ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులదే బాధ్యత. తల్లిదండ్రులు గమనిస్తే తప్ప ఈవ్‌టీజింగ్‌, వేధింపులు చేస్తున్న యువకులు సన్మార్గంలో నడవలేరని మానసిక నిపుణులు చెబుతున్నారు. టీనేజర్లు వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధాలు తగ్గుతున్నాయని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నారాయణగూడ, ఆబిడ్స్‌, కోఠి, అంబర్‌పేట, బర్కత్‌పుర, సికింద్రాబాద్‌లలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు డబ్బులు మాత్రమే ఇస్తున్నారని, తాము ఏం చదువుకుంటున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోరని వివరించారు. కళాశాలల నుంచి ఇళ్లకు వచ్చినప్పుడు వారు ఇంట్లో ఉండరని, రాత్రి పది, పదకొండు గంటలకు వచ్చి మొక్కుబడిగా మాట్లాడి పడుకుంటారని చెప్పారు. ఈవ్‌టీజింగ్‌ అంటే ఏంటో తమకు తెలియదని, ఎవరైనా సహ విద్యార్థులు అమ్మాయిలను ఏడిపిస్తుంటే వారు సంతోషించే విధానాన్ని చూసి తాము కూడా ఏదైనా చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వారిని ఇప్పటి నుంచైనా తల్లిదండ్రులు గమనించాలని ‘షి’ బృందాలతో కలిసి వెళ్లిన మానసిక నిపుణులు అంటున్నారు.

 స్నేహితులతో చదువుకుంటున్నాం.. అంటూ పడకగది తలుపులు వేసుకుని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడూ తల్లి లేదా తండ్రి వెళ్లి వారేం చేస్తున్నారో చూస్తే తప్పుడు పనులు చేస్తుంటే క్రమంగా మానుకుంటారు.
 తల్లి లేదా తండ్రి మాత్రమే ఉంటున్న విద్యార్థుల్లో 70 శాతం మంది ఖర్చులున్నాయంటూ ఇంట్లో చెప్పి రూ.వేలు డబ్బు తీసుకొస్తున్నారు. తమతోపాటు చదువుకుంటున్న అమ్మాయిలతో కలిసి విందుల్లో పాల్గొంటున్నారు. వీరు పుస్తకాలు, ప్రాజెక్టుల కోసమే నిజంగా ఖర్చుచేస్తున్నారా? అని పరిశీలిస్తే విందు, వినోదాలు బందవుతాయి.
 బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లలో నివసిస్తున్న విద్యార్థుల్లో 15 శాతం మంది తమ సహ విద్యార్థినులతో కలిసి కళాశాలల వేళల్లోనే హుక్కా కేంద్రాలకు వెళ్తున్నారు. వారంలో ఒకరోజు తల్లి లేదా తండ్రి కళాశాలకు వెళ్లి గమనిస్తే... ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది.

వేధింపులు... ఈవ్‌టీజింగ్‌
ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లభ్యమవుతున్న అశ్లీల దృశ్యాలు, చిత్రాలు ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. కొందరు విద్యార్థులు ఫేస్‌బుక్‌, అంతర్జాలం, యూట్యూబ్‌లలో అశ్లీలాన్ని చూసీచూసీ వాటిని చూడకపోతే పోగొట్టుకున్న వారిలా మారిపోతున్నారు. చదువుపై ధ్యాస ఉన్నా... ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఫోన్లలో వీటిని చూస్తున్నారు. ఆయా దృశ్యాలు, చిత్రాల ప్రభావంతో సహచర విద్యార్థినులను, బస్‌స్టాప్‌లు, బస్సుల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల ‘షి’ బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 360 మంది విద్యార్థులను ఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా, బృందాలుగా మాట్లాడగా... తాము అశ్లీల చిత్రాలు పదేపదే చూడడం వల్లే ఈవ్‌టీజింగ్‌ చేయాలన్న ఆలోచనలు వస్తున్నాయని వివరించారు. పాత్రధారులు మాట్లాడుకున్నట్టు నిజ జీవితంలోనూ ప్రవర్తించాలన్న భావనతో ఇలా చేస్తున్నామని చెప్పారు.

 స్మార్ట్‌ఫోన్లు ఉన్న విద్యార్థుల్లో 70 శాతం మందికి అంతర్జాలంలో అశ్లీల దృశ్యాలు చూసే అలవాటుంది. నాలుగైదు గంటలు స్మార్ట్‌ఫోన్లతోనే.
 కళాశాలల నుంచి ఇంటికివచ్చినా.. ఆ ప్రభావం వీడని వారు 35 శాతం మంది ఉన్నారు. తల్లిదండ్రులు గమనించకుండా బాత్‌రూంలో అరగంట నుంచి గంటసేపు ఉంటున్నారు.
 ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థుల్లో 60 శాతం మంది బస్‌స్టాపులు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద యువతులను లక్ష్యంగా చేసుకుని వాఖ్యలు చేస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.