close

తాజా వార్తలు

రివ్యూ: ఓ బేబీ

నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, మాస్టర్‌ తేజ, రావు రమేశ్‌, ప్రగతి, స్నిగ్ధ, జగపతిబాబు, నాగశౌర్య, ఐశ్వర్య, ఊర్వశి, ప్రియదర్శి పులికొండ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌
డైలాగులు: లక్ష్మీ భూపాల
కూర్పు: జునైద్‌ సిద్ధిఖి
నిర్మాణ సంస్థ: సురేశ్ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందినీ రెడ్డి
విడుదల తేదీ: 05-07-2019

అక్కినేని కోడలు సమంత నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే.. అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈసారి సామ్‌ ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారో..అన్న అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. అభిమానుల ఊహలకు తగ్గట్టుగానే ఆమె ‘ఓ బేబీ’ అనే సినిమాను ప్రకటించారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించడం.. సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో నటించడం.. ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘బేబీ’ ఆకట్టుకుందో లేదో చూద్దాం.

క‌థేంటంటే: సావిత్రి అలియాస్ బేబీ (ల‌క్ష్మి) 70 ఏళ్ల ‘భామ‌’. చిన్ననాటి స్నేహితుడు చంటి (రాజేంద్రప్రసాద్‌)తో క‌లిసి ఒక క్యాంటీన్‌ని నిర్వహిస్తూ ఉంటుంది. పాత‌కాల‌పు మ‌నిషి కావ‌డంతో ఆమె చాద‌స్తంతో ఇంట్లో కోడ‌లు (ప్రగతి), కుటుంబ స‌భ్యులు ఇబ్బంది ప‌డుతుంటారు.  కోడ‌లికి గుండెపోటు కూడా వ‌స్తుంది. అందుకు బేబీనే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు భావించ‌డంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయిన ఆమె 24 ఏళ్ల ప‌డుచు పిల్ల స్వాతి (స‌మంత‌)గా మారిపోతుంది. అదెలా? వ‌య‌సు తిరిగొచ్చాక ఆమె ఏం చేసింది? కుటుంబానికి మ‌ళ్లీ ఎలా ద‌గ్గరైంది? స్వాతినే బేబి అని తెలిశాక చంటి, కుమారుడు శేఖ‌ర్ (రావు ర‌మేష్‌) ఎలా స్పందించాడు? తదిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: 70 ఏళ్ల బామ్మ ప‌డుచు పిల్లగా మారిపోవ‌డ‌మ‌నేది కాన్సెప్ట్‌లో ఒక ప్రత్యేకమైన పాయింట్‌. ఒక జన్మలో రెండు జీవితాల్ని అనుభ‌వించే అవ‌కాశం అన్నమాట‌. కొరియ‌న్ చిత్రం ‘మిస్ గ్రానీ’ నుంచి తీసుకున్న కాన్సెప్ట్ ఇది. ద‌ర్శకురాలు నందినీరెడ్డి ఈ కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకుల అభిరుచుల‌కి అనుగుణంగా తీర్చిదిద్దడంలో విజ‌య‌వంత‌మ‌య్యారు. స్థానికత ఉట్టిప‌డేలా తొలి అర‌గంట స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. పెద్దవాళ్లలో క‌నిపించే చాద‌స్తపు అల‌వాట్లు, ఇంట్లో పిల్లల విషయంలోతీసుకునే శ్రద్ధ‌, కోడ‌ళ్లపై వాళ్లు చెలాయించే పెత్తనం వంటి అంశాల్ని స‌హ‌జంగా తీర్చిదిద్దారు. అస‌లు క‌థ మాత్రం బేబీ స్వాతిగా మారాకే మొద‌ల‌వుతుంది. స‌మంత ఆ స‌న్నివేశాల్లో ప్రద‌ర్శించిన అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. వృద్ధురాలిగా క‌నిపించిన ల‌క్ష్మిని పోలిన‌ట్టుగానే హావ‌భావాలు ప్రద‌ర్శించ‌డం, ఆమెలాగా న‌డ‌వ‌డం, మాట్లాడ‌టం ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేస్తుంది.

బామ్మ ప‌డుచు పిల్లగా మారాక స‌న్నివేశాల్లో అప్రయ‌త్నంగానే న‌వ్వులు పుట్టుకొస్తాయి. ఆరంభం నుంచే కాసేపు న‌వ్వులు, కాసేపు గుండె బ‌రువెక్కించే భావోద్వేగాల‌తో ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేస్తుంది. పాతికేళ్ల అమ్మాయిగా క‌నిపస్తున్నప్పుడు బామ్మకి ఎదుర‌య్యే స‌మ‌స్యలు, స్వాతినే బేబీ అని బ‌య‌ట ప‌డే నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం. ద్వితీయార్ధంలో భావోద్వేగాలు మ‌రింత‌గా పండాయి. బామ్మ పోగొట్టుకున్న జీవితాన్ని ఆస్వాదించాల‌ని చేసే ప్రయ‌త్నం, తాను క‌న్న క‌ల‌ల్ని నెర‌వేర్చుకునేందుకు ప‌డే త‌ప‌న హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. పెద్దవాళ్ల విలువ గురించి క‌థ‌లో  భాగంగానే చెప్పిన వైనం సినిమాకి మ‌రింత అందం తీసుకొచ్చింది. ద్వితీయార్ధం మ‌రీ సుదీర్ఘంగా సాగ‌డమే కాస్త ఇబ్బంది పెడుతుంది. ‘ఊపిరి’ త‌ర్వాత ఆ స్థాయిలో కుదిరిన మ‌రో రీమేక్ చిత్రం ఇది. న‌వ్వులు, భావోద్వేగాల మేళ‌వింపుతో ఒక మంచి సినిమాని చూసిన అనుభూతి క‌లిగిస్తుంది. 

ఎవ‌రెలా చేశారంటే: స‌మంత త‌న పాత్రకి ప్రాణం పోసింది. ప‌డుచు పిల్లగా క‌నిపించే బామ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు చిత్రానికే హైలెట్‌. క‌ళ్లతో, హావ‌భావాల‌తోనే ఆమె అభిన‌యం ప్రద‌ర్శిస్తూ న‌వ్విస్తారు, ఏడిపిస్తారు. లక్ష్మి కూడా అంతే. బేబీ పాత్ర ఆమె కోస‌మే పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో జీవించారు. కోడ‌లు త‌న‌వ‌ల్లే ఆస్పత్రి పాలైంద‌ని తెలిసిన‌ప్పుడు, అక్కడి నుంచి వెళ్లిపోయే స‌న్నివేశాల్లో లక్ష్మి న‌ట‌న గుండెల్ని బ‌రువెక్కిస్తుంది. రాజేంద్రప్రసాద్ కూడా చంటి పాత్రలో ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేస్తారు. స‌మంత‌తో పాటే ఆద్యంతం తెర‌పై సంద‌డి చేస్తారు. రావు ర‌మేష్‌, నాగ‌శౌర్య‌, ప్రగ‌తి, ఊర్వశి, ఐశ్వర్య‌, తేజ...ఇలా అంద‌రూ త‌మ పాత్రల ప‌రిధి మేర‌కు చాలా బాగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు, అడివి శేష్ చిన్న పాత్రల్లో మెరుస్తారు. సాంకేతికంగా ప్రతి విభాగం అత్యుత్తమ ప‌నితీరుని ప్రదర్శించింది. ల‌క్ష్మీ భూపాల మాట‌లు చాలా బాగున్నాయి. బామ్మలు మాట్లాడే మాట‌ల‌కి త‌గ్గట్టుగానే సామెత‌లు జోడించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ద్వితీయార్ధలో పెద్దవాళ్ల విలువ గురించి చెబుతూ ఆయ‌న రాసిన మాట‌లు చాలా బాగుంటాయి. ‘పెద్దవాళ్లు ఉన్నంత‌వ‌ర‌కే మ‌నం పిల్లలం. వాళ్లతో పాటే మ‌న బాల్యం కూడా వెళ్లిపోతుంది’ అంటూ  రావు ర‌మేష్‌తో చెప్పించిన సంభాష‌ణ‌లు చిత్రానికి మ‌రింత బ‌లాన్నిస్తాయి. రిచ‌ర్డ్ ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం చాలా బాగా కుదిరాయి. అయితే ద్వితీయార్ధం ఎక్కువ‌గా సంగీతం ప్రధానంగా సాగుతుంది కాబ‌ట్టి ఆ నేప‌థ్యానికి త‌గ్గట్టుగా మ‌రింతగా ఆక‌ట్టుకునే పాట‌లు స‌మ‌కూర్చుంటే సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. పాట‌ల్లో కూడా భావోద్వేగాలు పండించే ప్రయ‌త్నం చేశారు. దాంతో సంగీత నేప‌థ్యం ఎలివేట్ కాలేదు. నందినిరెడ్డి క‌థ‌ని తెలుగీక‌రించిన విధానం... వినోదం, భావోద్వేగాల విష‌యంలో ఆమె తీసుకున్న శ్రద్ధ మెప్పిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ స‌మంత న‌ట‌న
+ క‌థ‌
+ వినోదం, భావోద్వేగాలు 
+ మాట‌లు
+ పాత్రల‌కి త‌గ్గ న‌టీన‌టులు
- ద్వితీయార్ధం సుదీర్ఘంగా సాగ‌డం

చివ‌రిగా: ‘ఓ బేబీ’... ఒక అంద‌మైన అనుభ‌వం!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.