close

తాజా వార్తలు

డిగ్రీ ఓకే..డీక్యూ ఉందా?

ఐక్యూ తెలుసు.. ఈక్యూ గురించి విన్నాం.. ఇప్పటి ట్రెండ్‌ డీక్యూ. అంటే డిజిటల్‌ కోషెంట్‌.  వ్యక్తులు, కంపెనీల సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో దీని ప్రాధాన్యం పెరిగింది. దీంతో తాజా టెక్నాలజీకీ అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఉద్యోగార్థులకు తప్పనిసరైంది. సంస్థల ప్రగతి కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై అనివార్యంగా ఆధారపడుతోంది. టెక్నాలజీ అంటే ఒకప్పుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని యంత్రాలు, పరికరాల ద్వారా పరిశ్రమలకు వినియోగించడం. ఇప్పుడు అర్థం మారుతోంది. డిజిటాలిటీని టెక్నాలజీకి సమానార్థకంగా వాడుతున్నారు. సాధారణ డిగ్రీ అభ్యర్థులు కూడా డీక్యూ పెంచుకుంటే త్వరగా ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. మే 11న నేషనల్‌ టెక్నాలజీ డే సందర్భంగా డిగ్రీ సర్టిఫికెట్‌ ఉన్నా.. లేకపోయినా.. డీక్యూ ప్రాధాన్యం ఏమిటో  తెలుసుకుందాం.

ఉన్నతమైన జీవితానికి చదువు ఒక ఉత్తమ మార్గం. కరెక్టే కానీ..  టెక్నాలజీనీ కలిపితే అది అత్యుత్తమ మార్గంగా మారుతుంది అంటున్నారు నిపుణులు. నిజమే.. టెక్నాలజీ నైపుణ్యం  ఉన్నవారు సాధారణ అభ్యర్థుల కంటే ఉద్యోగాలు మెరుగ్గా పొందుతున్నారు. నేటి ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో నైపుణ్యం పెంచుకోవడం అంటే డిజిటల్‌ ప్రపంచానికి కావాల్సిన టూల్స్‌ మీద అవగాహన పెంచుకోవడం. రాబోయే రోజుల్లో టెక్నాలజీ అంటే డిజిటాలిటీ. అందువల్ల నేడు సంప్రదాయ చదువుల్లో ఉన్న విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాలతోపాటు డిజిటాలిటీ మీద పట్టు పెంచుకోవాల్సిందే. ముందు ముందు కాలేజీ డిగ్రీల కంటే అభ్యర్థులకు ఉన్న నైపుణ్యాల వల్లే ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పట్టాలతో లక్షల మంది విద్యార్థులు కాలేజీల నుంచి బయటకొస్తున్నారు. మరెన్నో లక్షల మంది చేరుతున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (లైఫ్‌ సైన్సెస్‌), బీఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ తదితర డిగ్రీల్లో చేరిన వారైనా, పూర్తి చేసిన వారైనా.. డిజిటాలిటీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. కొన్ని రకాల కోర్సులను అందరూ చేయవచ్చు. ఆ నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాటిని అందిపుచ్చుకోవాలంటే తప్పనిసరిగా డిజిటల్‌ స్కిల్స్‌ అవసరం.


పైథాన్‌ కోడింగ్‌

ఇది దాదాపు అన్ని సంస్థల్లో నేడు ఎంతో ముఖ్యమైన నైపుణ్యంగా మారింది. పైథాన్‌ కోడింగ్‌ కేవలం కంప్యూటర్‌ సంబంధించిన విద్యార్థులకే కాకుండా ఆర్ట్స్‌, కామర్స్‌, ఫార్మసీ లైఫ్‌ సైన్సెస్‌ విద్యార్థులకు కూడా కనీస పరిజ్ఞానంగా ఉపయోగపడుతుంది. ఫైథాన్‌ ఓపెన్‌ సోర్స్‌ లాంగ్వేజ్‌ కావడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడానికి కావాల్సిన ట్యుటోరియల్స్‌ విరివిగా లభిస్తాయి. తెలుగు ప్రాంతీయ మాధ్యమంలో పైథాన్‌ లెక్చర్స్‌ యూట్యూబ్‌లో ఉన్నాయి.  ముందుగా ప్రోగ్రామింగ్‌పై పట్టు పెంచుకొని తర్వాత సర్టిఫికేషన్‌ కోసం ప్రయత్నించడం మంచిది. పైథాన్‌ నేర్చుకున్నవాళ్లు డేటా అనలిస్టు, రిసెర్చ్‌ అనలిస్టు, పైథాన్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వంటి ఉద్యోగాలను పొందవచ్చు. ఇటు మన దేశంలోనూ అటు అమెరికాలోనూ వేల సంఖ్యలో పైథాన్‌ ప్రోగ్రామర్ల అవసరాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.


వెబ్‌ డిజైనింగ్‌

డిజిటల్‌ ప్రపంచంలో ప్రతి సంస్థకి గుర్తింపు ఆయా సంస్థల వెబ్‌సైట్ల వల్ల వస్తుంది. వెబ్‌ డిజైనింగ్‌ నేర్చుకోవడం వల్ల చిన్న, మధ్య   తరహా సంస్థలకు ఫ్రీ లాన్సర్‌గా వెబ్‌ డిజైనింగ్‌ చేయవచ్చు. వెబ్‌ డిజైనింగ్‌కి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ని కూడా చాలా వరకు యూట్యూబ్‌ ద్వారా నేర్చుకోవచ్చు. వెబ్‌ డిజైనింగ్‌కి సంబంధించి ఈ కింది టూల్స్‌, టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి.
* డిజాంగో - పైథాన్‌ * సీఎస్‌ఎస్‌ *ఏటీఎమ్‌ఎల్‌
వెబ్‌ డిజైనింగ్‌లో యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ (యూఎక్స్‌), యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) లాంటివి సృజనాత్మకత ఉన్న వ్యక్తులకు ఎన్నో అవకాశాలను అందిస్తున్నాయి. క్రియేటివ్‌ థింకింగ్‌ అలవర్చుకుంటే ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ లాంటి కొత్త టెక్నాలజీ అప్లికేషన్స్‌ అభివృద్ధి చేయడం సులభమవుతుంది.


యాప్‌ డెవలప్‌మెంట్‌

మొబైల్‌ ఫోన్‌ను ఇప్పుడు ఫోన్‌ కంటే కూడా ఇతర అవసరాలకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రకరకాల యాప్‌లను (అప్లికేషన్‌) ఇన్‌స్టాల్‌ చేసుకొని ఎన్నో పనులు ఎక్కడికీ వెళ్లకుండానే పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాప్‌ల అవసరం ఎక్కువైంది. ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్‌లను అభివృద్ధి చేస్తుండటంతో వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో యాప్‌ డెవలప్‌మెంట్‌ పెద్ద ఉద్యోగావకాశాల కేంద్రంగా మారింది. ప్రాంతీయ భాషల్లో మొబైల్‌ అప్లికేషన్స్‌ అభివృద్ధి చేయడం, ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ని నేర్చుకోవడం వల్ల స్టార్టప్‌, ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు. యూట్యూబ్‌లో మొబైల్‌ అప్లికేషన్స్‌కు సంబంధించి ఎన్నో లెక్చర్స్‌ ఉన్నాయి. ‌www.upwork.com, www.freelancer.com లాంటి వెబ్‌సైట్స్‌ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు ఉపాధి మార్గాలను చూపిస్తున్నాయి. మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ను అన్ని రకాల డిగ్రీ విద్యార్థులు నేర్చుకోవచ్చు. ఇందులో ప్రావీణ్యం సంపాదిస్తే తేలిగ్గా ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు.


డిజిటల్‌ మార్కెటింగ్‌

అందరి చేతుల్లో మొబైల్‌ ఫోన్‌ ఉండటంతో మార్కెటింగ్‌ డైరెక్ట్‌గా అరచేతికి వచ్చి చేరుతోంది. అదే డిజిటల్‌ మార్కెటింగ్‌. ఇది వేగంగా విస్తరిస్తుండటంతో అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇందులో రకరకాల విభాగాలు ఉన్నాయి. వాటిలో పట్టు సాధిస్తే ఉద్యోగం లభిస్తుంది. అవి.. * సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ * సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ * ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌ * అఫ్లియేట్‌ మార్కెటింగ్‌ * డిజిటల్‌ డిస్‌ప్లే అడ్వర్టైజింగ్‌ *యూట్యూబ్‌ అడ్వర్టైజింగ్‌ * మొబైల్‌ మార్కెటింగ్‌ * లీడ్‌ జనరేషన్‌ ఫర్‌ బిజినెస్‌
వీటికి కోర్సులను హైదరాబాద్‌లోని * ప్రొఫెషనల్‌ అకాడమీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎక్స్‌లెన్స్‌ ‌* ఎస్‌ఎమ్‌ఈసీ టెక్నాలజీస్* ఇంపాక్ట్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా ‌*డిజిటల్‌ ఫ్లోట్స్‌ ‌* డిజిటల్‌ బ్రోలీ * డిజీమాక్స్‌ ఐటీ సంస్థలు అందిస్తున్నాయి.

నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలిస్తున్న సంస్థలు
డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాలు డిగ్రీ కన్నా నైపుణ్యం ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ ధోరణి భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలను ప్రస్తుతం * గూగుల్‌ *పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ *కాస్ట్‌కో హోల్‌సేల్‌ *హోల్‌ ఫుడ్స* హిల్టన్‌ బీ పబ్లిక్స్‌* ఆపిల్‌ బీ స్టార్‌బక్స్‌ * నార్డ్‌స్టార్మ్‌ * హోమ్‌ డిపో *ఐబీఎం* బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా* చిపోటల్‌ * లోయస్‌ తదితర సంస్థలు ఇస్తున్నాయి.


ఒక రంగం నుంచి మరో రంగంలోకి!

ఎవరు ఏ డిగ్రీ చేసినా కొన్ని టెక్నికల్‌ నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా తమ రంగాలను మార్చుకోవచ్చు. ప్రాంతీయ భాషల్లో పట్టుతోపాటు కొద్దిపాటి డిజిటల్‌ పరిజ్ఞానం ఉన్నవాళ్లను గూగుల్‌ లాంటి కంపెనీలు తీసుకుంటున్నాయి. ఎవరైనా తమ ప్రత్యేక పరిజ్ఞానానికి కొంత డిజిటాలిటీని జోడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్కూలు స్థాయి నుంచే పిల్లలకు కొన్ని రకాల డిజిటల్‌ నైపుణ్యాలను నేర్పించాలి. టాస్క్‌లు ఇచ్చి చేయించాలి. ప్రతి రంగంలోనూ ఆటోమేషన్‌ జరుగుతోంది కాబట్టి పిల్లల్లో అలాంటి స్కిల్స్‌ పెంచడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించవచ్చు. దాంతో ఆసక్తి పెరిగి డీక్యూ ఎక్కువవుతుంది. తర్వాత కాలంలో తాము చేసిన డిగ్రీకి సంబంధం లేకుండా రంగం మారాల్సి వచ్చినప్పుడు లేదా మారాలని అనుకున్నప్పుడు ఇలాంటి స్కిల్స్‌ ఎంతో ఉపయోగపడతాయి.

- రవి కటుకం, ఇన్నోవేషన్‌ ఇవాంజిలిస్ట్‌

 

 


నైపుణ్యాలకే ప్రాధాన్యం

చదువుకున్న డిగ్రీకి, నేర్చుకున్న స్కిల్స్‌కి చాలా తేడా ఉంటోంది. ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలు అభ్యర్థులకు ఉండటం లేదు. కోడింగ్‌ విషయంలో ఈ అంతరం స్పష్టంగా తెలుస్తోంది. గత సంవత్సరం  ఆపిల్‌ కంపెనీ కోసం అమెరికాలో తీసుకున్న ఉద్యోగుల్లో సగం మందికి నాలుగు సంవత్సరాల డిగ్రీ లేదు. భవిష్యత్తులో పట్టాల కంటే నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యం మరింత పెరుగుతుంది.

- టిమ్‌ కుక్‌, ఆపిల్‌ సీఈఓ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.