close

తాజా వార్తలు

Published : 17/10/2019 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డబ్బు దాస్తున్నారా?

ఇంటి బాధ్యత మహిళలపైనే ఎక్కువ. కుటుంబసభ్యులు డబ్బు దాచాలన్నా, దుబారా చేయాలన్నా... ఆమెపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీరు క్రమశిక్షణతో ఉన్నప్పుడే కుటుంబం మిమ్మల్ని అనుసరిస్తుంది. అందుకే మీ ఆర్థిక జీవితాన్ని ప్రారంభించినప్పటినుంచే మీకంటూ కొన్ని నియమాలు పెట్టుకోండి.

బడ్జెట్‌కీ ఓ ఫార్ములా... ఇంటి నుంచి పెద్దవాళ్లు డబ్బులు పంపిస్తున్నన్ని రోజులు డబ్బు విలువ మనకు సరిగ్గా తెలియదు కానీ ఆర్థిక ప్రణాళిక ఉండాలిగా... ఉద్యోగాలు వచ్చాక కొందరు దుబారాకు అలవాటు పడతారు. ఇది ఆర్థిక క్రమశిక్షణ కట్టుతప్పేలా చేస్తుంది. అందుకే ఒక నియమం పాటించండి. 70-20-10 నిష్పత్తిలో ఆర్థిక నిర్వహణ ఉండేలా చూసుకోండి. జీవితంలో ఇంకెక్కువగా పొదుపు చేయాలనుకునే వారు 50-30-20లో పద్ధతిని ఎంచుకోవాలి. ఇందులో యాభై శాతం మీ అవసరాలు, నివాసం, ఆహారం వంటివాటి కోసం కేటాయించండి. ముప్పై శాతాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని వివిధ పథకాల్లో మదుపు చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన ఇరవై శాతాన్ని విహారయాత్రలు, ఏవైనా కొత్త గ్యాడ్జెట్లు... ఇలా మీకు నచ్చిన లక్ష్యాలను చేరుకోవడానికి ఆదా చేయండి.

అత్యవసర కాలానికి... జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. ఒకేసారి కుదుపు రావొచ్ఛు మీరో, మీ కుటుంబ సభ్యులకో అనారోగ్యం రూపంలో, మరేదైనా కారణంతో అత్యవసరంగా డబ్బులు అవసరం రావొచ్ఛు అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర నిధి రూపంలో మదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. అత్యవసర కాలంలో ఎవరి సహాయమూ అర్థించకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగం వచ్చిన తొలిరోజుల్లోనే మూడు నుంచి ఆరు నెలల వేతనాన్ని దీని కోసం కేటాయించండి. ఇప్పటి వరకూ మీరలా చేయకపోతే... వెంటనే ఇలాంటి పొదుపును మొదలుపెట్టండి. రికరింగ్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం ఉంటుంది. కొంత మొత్తం రాబడి వస్తుంది.

గడువులోగా చెల్లించండి... అత్యవసరాల కోసం క్రెడిట్‌ కార్డులు తీసుకుంటారు. ఇవి ఉంటే డబ్బులను అదుపు చేయడం చాలా కష్టమైన పని. జాగ్రత్తగా ఉండకపోతే జేబులకు చిల్లులు పడేలా ఖర్చు పెరుగుతుంది. అందుకే క్రెడిట్‌ కార్డు బిల్లును గడువు ముందే లేదా గడుపు లోపు చెల్లించండి. గడువులోగా డబ్బులు చెల్లించకుంటే భారీ మొత్తంలో జరిమానా పడుతుంది. ఇది ఎంతో ధననష్టానికి దారి తీస్తుంది. ఈ సమయంలో ఎన్నో రకాల గ్యాడ్జెట్లు, పరికరాలు ఆకర్షిస్తుంటాయి. చేతిలో డబ్బులు లేనప్పుడు చాలా మంది ఈఎంఐలను ఆశ్రయిస్తుంటారు. అదే వద్ధు శక్తికిమించి ఎప్పుడూ వస్తువులు కొనకూడదు. ఆలస్యం జరిగితే... జరిమానా చెల్లించక తప్పదు. ఏ వస్తువు కొనాలనుకున్నా ముందు నుంచే పొదుపు ప్రారంభించండి.

అన్ని వివరాలు తెలుసుకున్నాకే... ఎందులోనైనా పెట్టుబడి పెట్టేముందు ఆ పథకం గురించి సవివరంగా తెలుసుకోండి. ఆ తరువాతే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వెళ్లండి. భవిష్యత్తులో మీ అవసరాలూ ఎలా ఉంటాయో, పథకం వివరాలు ఎలా ఉన్నాయో ముందే ఆలోచించండి. నియమ నిబంధనలు ఏంటో జాగ్రత్తగా చదవండి. రిటైర్మెంట్‌ ప్లాన్‌ సైతం ఇప్పుడే నిర్ణయించుకోవడం ఉత్తమం. అందుకోసం నెలనెలా కొంత మొత్తం కేటాయించుకోండి. ఇప్పటి నుంచే ప్రారంభిస్తే భవిష్యత్తులో ఎలాంటి బాదరబందీ లేకుండా జీవించొచ్ఛు.

రాసుకోండి... చేతినిండా డబ్బు ఉండటంతో స్నేహితులూ పెరుగుతారు. దాంతో దుబారా ఖర్చులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పబ్‌లు, ఫ్యాన్సీ రెస్టారంట్లు, సినిమాలు, మాల్స్‌కు ఎక్కువగా వెళ్తుంటారు. స్నేహితుల్లో తక్కువ కాకూడదని ఇలా చేయొచ్ఛు కానీ ఇది మీ ప్రణాళికపై దెబ్బ కొడుతుంది. అలా అని ఇవి మానేయకూడదు... కానీ నియంత్రణలో ఉండాలి. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో ఎప్పుడూ ఒక డైరీలో తప్పకుండా రాసుకోండి. ఇది మనం ఎక్కువగా ఖర్చు ఎక్కడ చేస్తున్నాం... వేటిల్లో తగ్గిస్తున్నామనేది తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పొదుపు పోగా మిగిలిన మొత్తాన్ని ప్రాధాన్యాల క్రమంలో ఖర్చు చేయండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన