close

తాజా వార్తలు

చేదు జ్ఞాపకాన్ని మరిపిస్తాడా?
ఇంగ్లాండ్‌.. ఆరంభంలో టైటిల్ ఫేవరేట్‌. కానీ, నేడు సెమీస్‌కు చేరుతుందో లేదో అనే సందేహం. శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడటం, ఆసీస్‌ ముందు తలవంచడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ ఆత్మరక్షణలో పడింది. రన్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరాలంటే న్యూజిలాండ్‌, భారత్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆసీస్‌, శ్రీలంకపై సహచరులంతా విఫలమవుతున్నా వెన్నుచూపని వీరత్వంతో బెన్‌స్టోక్స్‌ విజయం కోసం ఆఖరి వరకు పోరాడాడు. కేవలం మైదానంలో విజృంభించడమే కాకుండా జట్టు సభ్యుల్లో ఆత్మస్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతున్నాడు స్టోక్స్‌. ఈ సారి ఎలాగైనా ప్రపంచకప్‌ను సాధించాలనే కసి తనలో ఎలా పెరిగిందో తెలియాలంటే.. ఇది ఒకసారి చదవాల్సిందే!  

చేజారిన ప్రపంచ కప్‌


2016. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌. అంతకుముందు ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్‌తో వెస్టిండీస్‌ తలపడింది. ఇరు జట్లలోనూ హిట్టర్లే ఉన్నారు. అయినా విండీస్‌ బౌలర్లు చెలరేగడంతో మోర్గాన్‌ సేన 155 పరుగులతోనే సరిపెట్టుకుంది. అరివీర భయంకరులున్న కరీబియన్లకు ఇది అంత పెద్ద లక్ష్యమేమి కాదు. కానీ ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో విండీస్‌ విజయ సమీకరణం 6 బంతుల్లో 19 పరుగులుగా మారింది. మోర్గాన్‌ బంతిని స్టోక్స్‌ (2-0-17-0)కు ఇచ్చాడు. బ్రాత్‌వైట్‌ ఒక్కసారిగా శివమెత్తడంతో తొలి నాలుగు బంతులు 6,6,6,6. కరీబియన్ల ఆనందానికి అవధుల్లేవు. టీ20 విశ్వవిజేతగా వెస్టిండీస్‌. మహిళా విభాగంలోనూ వారే అవ్వడం విశేషం. 

ఇంగ్లాండ్‌ జట్టంతా ఓటమి బాధలో మునిగిపోయింది. అందరికంటే ఎక్కువ బాధ మాత్రం స్టోక్స్‌ది. కప్‌ను తన చేతుల్లో నుంచే చేజారిందని. నాలుగో బంతి కూడా సిక్సర్‌గా మారడంతో తల పట్టుకుని మోకాళ్ల మీద నిలబడిపోయాడు స్టోక్స్‌. ఆ క్షణం తన కన్నీటి ధారని ఎవరూ ఆపలేకపోయారు. ‘ఓటమికి కారణం బెన్‌స్టోక్స్‌ కాదు. జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యులే. మేము ఇంకా 25-30 పరుగులు చేయాల్సింది.’ మ్యాచ్‌ అనంతరం మోర్గాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. జట్టు మొత్తం తనకు అండగా నిలిచిన స్టోక్స్‌కు సంతృప్తి కలగలేదు. ఏదైతే తన వల్ల చేజారిందో అదే దేశానికి తిరిగి ఇవ్వాలని తనలో కసి మరింత పెరిగింది. ఆ కసే నేడు జట్టులో కీలక ఆటగాడిగా మార్చింది. కుదిరితే బ్యాటుతో లేకపోతే బంతితో అన్న రీతిలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మూడేళ్ల నుంచి జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. 

సీన్‌ కట్‌ చేస్తే..

చేదు జ్ఞాపకాన్ని ఎలానైనా చెరిపేయాలని భావిస్తున్న స్టోక్స్‌కు చక్కని అవకాశం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ సొంత మైదానంలోనే అవ్వడం అతనికి మరింత బలాన్నిచ్చింది. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 89 పరుగులతో అదరగొట్టాడు. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో స్టోక్స్‌ బౌండరీ లైన్‌ వద్ద  ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్న క్యాచ్‌ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్‌ అవకాశాలు అంతగా రాకపోయినా బంతితో మెరిశాడు. అప్పటి వరకు ఇంగ్లాండ్‌ ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇంగ్లాండ్‌కు శ్రీలంక షాక్‌ ఇవ్వడంతో జట్టు కుదేలైంది.  

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ వీరోచిత పోరాటానికి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తున్నా తోటి ఆటగాళ్ల  నుంచి సహకారం అందకపోవడంతో ఓటమితో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం కాకూడదంటే ఆస్ట్రేలియాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అని స్టోక్స్‌కు తెలుసు. గత మ్యాచ్‌ మాదిరిలా అవ్వకూడదని గెలుపు కోసం ప్రయత్నిస్తున్న స్టోక్స్‌కు స్టార్క్‌ యార్కర్‌తో చుక్కెదురైంది. జట్టుని విజయతీరాలకు చేర్పించలేకపోయాననే నిస్సహాయతతో బ్యాట్‌ను కిందపడేశాడు. అది ఔటైన అసహనంతో చేసిన చర్య కాదు జట్టుని గెలిపించలేకపోయాననే బాధతో చేసిందని అతికొద్ది మందికే తెలుసు.

 

‘ఇది మన ప్రపంచకప్‌. నాలుగేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి. దేశం తరఫున పోరాడుతున్న మనకు ఈ కాలం ఎంతో ప్రత్యేకమైనది. ఓటమిని చూసి మనం వెనకడగు వెయ్యకూడదు. ఇది మన కప్‌, మనం సాధిస్తాం. ఈ ఓటమి మనల్ని నిరాశ కలిగించేది. కానీ మనం మన శక్తి మేర రాణిస్తే విజయాలు మన దరికి చేరుతాయి.’ ఆసీస్‌ మ్యాచ్‌ అనంతరం జట్టు సభ్యులతో స్టోక్స్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు బట్టి అతను ప్రపంచకప్‌ కోసం ఎంతగా పరితపిస్తున్నాడనదే తెలిసిపోతుంది. క్రికెట్‌కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్‌ వన్డే ప్రపంచకప్‌ కోరికను తీర్చి తన చేదు జ్ఞాపకాలను మరిపిస్తోడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. 

 - ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.