
తాజా వార్తలు
అది 2015.. బెంగళూరు వేదికగా భారత్×దక్షిణాఫ్రికా మధ్య టెస్టు జరుగుతోంది. క్రీజులోకి ఓ బ్యాట్స్‌మన్ వచ్చాడు. స్టేడియంలోని అభిమానులంతా అతడికి నీరాజనాలు పలుకుతున్నారు. అతడు భారతీయుడు కాదు. అయినా అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. అతడు ఫోర్ బాదినా.. బ్యాటు పైకెత్తినా.. ఏబీ ఏబీ.. అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది అతడు ఎవరో కాదు ఏబీ డివిలియర్స్ అని. సొంత జట్టుని కాదని భారత అభిమానులంతా అతడిని ఆదరించిన తీరుని చూస్తే.. అది కేప్టౌనా, డర్బనా అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయంటే అతియోశక్తి కాదు! అంతలా ఏబీ భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
అబ్రహం బెంజమిన్ డివిలియర్స్.. క్రికెట్ ప్రపంచం అతడిని ముద్దుగా ‘మిస్టర్ 360’, ‘ఏబీ’ అని పిలుచుకుంటుంది. అతడు క్రీజులో ఉంటే ‘అతడి చేతిలో ఉంది బ్యాటా? మంత్ర దండమా? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతాయి. ఆ రీతిలో ఉంటుంది అతడి విధ్వంసం. అదే ఫీల్డింగ్ చేస్తే.. ‘అతడు సాధారణ మానవుడేనా లేదా స్పైడర్ మ్యానా?’అనే సందేహం కలుగుతుంది. అలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు ఈ సఫారీ బ్యాట్స్‌మన్. తన కళాత్మక విధ్వంసంతో ఆధునిక క్రికెట్‌కు వన్నె తెచ్చిన మహాయోధుడు. వంటిని విల్లులా వంచుతా మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ మిస్టర్ 360 అయ్యాడు.
2004లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అతడు 114 టెస్టులు, 228 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 8,765, వన్డేల్లో 9,577, టీ20ల్లో 1,672 పరుగులు బాదాడు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా 2018 మే23న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన డివిలియర్స్.. నాలుగో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లాడు. నేటికీ అతడు ఆర్సీబీ జట్టులోనే ఉన్నాడు. దీంతో బెంగళూరు అతడికి రెండో ఇల్లు అయ్యింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ తెందుల్కర్, డివిలియర్స్ లాంటి కొద్ది మంది మాత్రమే దేశ సరిహద్దులు చెరిపి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఏబీ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హాకీ, ఫుట్‌బాల్, రగ్బీ, టెన్నిస్, స్విమ్మింగ్.. ఇలా అనేక క్రీడల్లో అతడు అదరగొట్టాడు.
2015లో బెంగుళూరు వేదికగా టీమ్ఇండియాతో తలపడిన టెస్టు డివిలియర్స్ కెరీర్లో 100వది. దీంతో ఈ మ్యాచ్‌ను చూడటానికి అతడి తల్లిదండ్రులు, భార్య భారత్‌కు విచ్చేసారు. ఏబీపై అభిమానులు ఇక్కడ చూపిస్తున్న ఆదరణ చూసి అతడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ‘మేము ఉన్నది భారత్‌లోనా, దక్షిణాఫ్రికాలోనా అని ఆశ్చర్యం కలుగుతోంది. మా వాడు మీ వాడయ్యాడు. ఏబీ ఔటైనప్పుడు అభిమానులు నిరాశచెందారు. సుదీర్ఘంగా ఆర్సీబీకీ ఆడుతుండటంతో బెంగళూరు మా వాడికి రెండో ఇల్లు అయ్యింది. ఇక భారత భాషలు కూడా నేర్చుకుంటాడని అనుకుంటున్నాను’ అని డివిలియర్స్ తండ్రి అన్నారు.
* వన్డేల్లో వేగంగా అర్ధశతకం (16 బంతుల్లో), శతకం (31 బంతుల్లో) బాదిన ఆటగాడిగా డివిలియర్స్ చరిత్ర సృష్టించాడు.
* సుదీర్ఘ ఫార్మాట్లో ఆమ్లా (311*) తర్వాత దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (278*) నమోదు చేసిన బ్యాట్స్‌మన్ ఏబీనే.
* టీ20ల్లో వేగంగా అర్ధశతకం (21 బంతులు) బాదిన సఫారీ బ్యాట్స్‌మన్‌గానూ మిస్టర్ 360 రికార్డు సృష్టించాడు.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
