
తాజా వార్తలు
మధ్యప్రదేశ్ క్రికెట్‌ను సాయం కోరిన టీమిండియా
ఇండోర్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈనెల 22 నుంచి 26 వరకు తొలి డేనైట్ టెస్టు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే పింక్ బాల్ మ్యాచ్‌కు.. కోహ్లీసేన అలవాటు పడటానికి టీమిండియా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ)ను సాయం కోరింది. ఇండోర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల కింద ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి సహకరించాలని అడిగింది. ఈ విషయంపై స్పందించిన ఎంపీసీఏ మాజీ సెక్రటరి మిలింద్ కన్మాడికర్.. కోహ్లీసేనకు సంతోషంగా సహకరిస్తామని చెప్పారు. ఆటగాళ్లు పింక్బాల్కు అలవాటు పడేందుకు ఫ్లడ్‌లైట్ల కింద ప్రాక్టీస్ చేయడానికి సాయం చేస్తామన్నారు.
‘టీమిండియా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేయడానికి మమ్మల్ని సంప్రదించింది. అందుకు మేం సంతోషంగా ఒప్పుకున్నాం. వారికి తగిన ఏర్పాట్లు చేయబోతున్నాం’ అని పేర్కొన్నాడు. ఇదే విషయంపై టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ.. ‘ఇదొక కొత్త ఛాలెంజ్. ఈ మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇదెలా జరుగుతుందో నాకు తెలీదు. కొన్ని సెషన్లు ప్రాక్టీస్ చేస్తే, మాకో అవగాహన వస్తుంది. అప్పుడే పింక్‌బాల్ ఆటపై ఒక అంచనాకు రాగలుగుతాం. కొత్త పద్ధతిని అలవాటు చేసుకోవడం ఇబ్బంది కాకూడదు’ అని పేర్కొన్నాడు.
దులీప్ ట్రోఫీలో పింక్ బాల్ ఆడిన పుజారా.. ‘2016-17లో నేను పింక్‌బాల్ క్రికెట్ ఆడాను. అది జరిగి చాలా కాలమైంది. అదిప్పుడు కలిసివస్తుందని భావించొద్దు. అయితే, ఆ అనుభవం మాత్రం ఉపయోగపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పింక్‌బాల్‌తో ఆడి ఉంటే అవగాహన వస్తుంది. కొన్నిసార్లు ఇది ఛాలెంజింగ్‌గా అనిపించొచ్చు. కాస్త ప్రాక్టీస్ అవసరం. ఒకసారి పింక్‌బాల్‌తో ఆడటం మొదలెడితే దానికి అలవాటు పడగలరు. కాబట్టి తొలిసారి డేనైట్ ఆడేముందు.. ఇంకొన్ని ప్రాక్టీస్ సెషన్లు అవసరం ఉంది. వీలైనప్పుడల్లా నేను పింక్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తా’ అని చెప్పుకొచ్చాడు.