
తాజా వార్తలు
సిడ్నీ: మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ మంగళవారం ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇటీవల విస్తరించిన పది మంది సభ్యుల బోర్డులో భాగమయ్యాడు. ప్రస్తుత అసోసియేషన్‌లో ఏడుగురు పాతవాళ్లు ఉండగా ముగ్గురు కొత్తవాళ్లు చేరారు. పాట్ కమ్మిన్స్, క్రిస్టెన్ బీమ్స్లతో పాటు మాజీ క్రికెటర్ లీసా స్థాలేకర్ తొలిసారి భాగస్వాములయ్యారు. పాత సభ్యులుగా ఆరోన్ ఫించ్, అలిస్సా హీలీ, మొయిసెస్ హెన్రిక్స్, నీల్ మాక్స్వెల్, జానెట్ టోర్నీ, గ్రెగ్ డయ్యర్ అలాగే కొనసాగుతున్నారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వాట్సన్ మాట్లాడుతూ ‘భవిష్యత్తులో వృద్ధి చెందే దిశగా పయనిస్తున్న ఏసీఏకు అధ్యక్షుడిగా ఎన్నికవడం గౌరవంగా ఉంది. నాకు ఎంతో ఇచ్చిన ఆటకు తిరిగి ఇచ్చే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కన్నా ముందు చాలా మంది ఆటగాళ్లు వచ్చారు, వారందరితో కలిసి పనిచేస్తాను. నేను చేయాల్సింది చాలా ఉంది. ఆసీస్ క్రికెట్‌ను గొప్పగా మార్చడానికి, ఆటగాళ్లకు రక్షణ కల్పించడానికి బలమైన స్వరం వినిపిస్తా’ అని పేర్కొన్నాడు.