close

తాజా వార్తలు

మ్యాచ్‌ కోసం కాదు..హైదరాబాదీ బిర్యానీ కోసం

భారత్×బంగ్లా పోరు అంటే ఎందుకంత ఆసక్తిగా మారింది?

భారత్×పాక్‌ మధ్య పోరు అంటే యావత్‌ క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఆసక్తి. ఆ స్థాయిలో గుర్తింపు రాకపోయినా భారత్×బంగ్లా మ్యాచ్‌ అంటే ఇరు దేశాల అభిమానుల్లో తెలియని ఉత్సాహం. భారత్‌లా బలమైన జట్టు కాకపోయినా బంగ్లా పులులు టీమ్‌ఇండియాను ఓడించాలని మైదానంలో కసితో పోరాడుతుంటాయి. మెగా ఈవెంట్‌లో ఓటమి రుచిని కూడా చూపించాయి. మ్యాచ్‌ ఆద్యంతం ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా హోరాహోరీగా తలపడుతుంటారు. ఒకరినొకరు కవ్వించుకుంటారు.. ఓడితే నిరాశ చెందుతారు.. గెలిస్తే విన్నూతంగా సంబరాలు చేసుకుంటారు. మొత్తంగా భారత్‌×బంగ్లా పోరు అంటే క్రికెట్‌ అభిమానులకు మినీ యుద్ధాన్ని తలపిస్తుంది. ఈ తరహా సమరం ఈ మధ్య మొదలైంది కాదు.. 2007 ప్రపంచకప్‌ నుంచి జరుగుతోంది. 

2000లో బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా కల్పించడంలో భారత్‌ ఎంతో కీలకపాత్ర పోషించింది. భారత్‌కు చెందిన జగ్‌మోహన్‌ దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బంగ్లా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడాలని ఎంతో కృషి చేశాడు. 2007 వరకు ఇరు జట్లు మధ్య పోరు అంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ, 2007 ప్రపంచకప్‌లో భారత్ అనూహ్యంగా బంగ్లాదేశ్‌ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత బంగ్లాతో పోరు అంటే సమీకరణాలు మారిపోయాయి. మ్యాచ్‌ అంటే ఇరు జట్లకు తెలియని వైరంగా మారింది.


2007 ప్రపంచకప్‌కు ముందు మే నెలలో జరగబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌ గురించి అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ ఫైనల్‌కు బంగ్లా సిరీస్‌ మధ్య ఎక్కువ రోజులు లేవని తెలిపాడు. దీనిపై బంగ్లా ఆటగాడు మోర్తజా స్పందించాడు. టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుతుందన్న అహంకార భావనతోనే కుంబ్లే మాట్లాడాడని మోర్తజా తప్పుపట్టాడు. ప్రపంచకప్‌లో బంగ్లా చేతిలో భారత్ ఓటమిపాలైంది. మెగాటోర్నీ నుంచి టీమ్‌ఇండియా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో మోర్తజా మరోసారి కుంబ్లే మాటల గురించి ప్రస్తావించాడు. ‘బిగ్ బాయ్స్‌ (టీమ్‌ఇండియా)ను చిత్తుచిత్తుగా ఓడించి బంగ్లాదేశ్‌ ముందుకు దూసుకెళ్లింది. అతడి అంచనా తప్పు అని నిరూపించాను’ అని పేర్కొన్నాడు.  


ప్రపంచకప్‌ అనంతరం బంగ్లాతో జరిగిన సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో, రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత మరోసారి ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వీరేంద్ర సెహ్వాగ్‌, బంగ్లా కోచ్‌ సిడాన్స్‌ వ్యాఖ్యలు టెస్టు సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చాయి. ‘బంగ్లాదేశ్‌ సాధారణ జట్టు. భారత్‌ను ఓడించలేదు. ఎందుకంటే టెస్టుల్లో వారు 20 వికెట్లు పడగొట్టలేరు’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. దీనిపై సిడాన్స్‌ స్పందిస్తూ.. ‘మైక్‌ నుంచి సెహ్వాగ్‌ దూరంగా ఉండాలి. కొన్ని ఏళ్లలోనే అతడు చేసిన కామెంట్‌ తప్పు అని తెలుసుకుంటాడు. అంతేకాదు కొన్ని వారాల్లోనే అతడు ఘోరపరాజయాన్ని చవిచూస్తాడు’ అని అన్నాడు. కానీ, భారత్ మరోసారి అద్భుత ప్రదర్శనతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సొంతగడ్డపై సిరీస్‌ గెలవాలనుకున్న బంగ్లా ఆశ తీరలేదు.


2015 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు 90 పరుగుల వద్ద  లైఫ్‌ లభించింది. అతడు ఔటైన బంతిని అంపైర్ నోబాల్‌ ప్రకటించాడు. కానీ, హిట్‌మ్యాన్‌ ఔట్‌ అని, అంపైర్‌ కావాలనే తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని బంగ్లా అభిమానలు తీవ్రంగా ఆరోపించారు. బంగ్లాదేశ్‌కు చెందిన అప్పటి ఐసీసీ అధ్యక్షుడు ముస్తాఫా కమల్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘అంపైరింగ్‌లో నాణ్యత లేదు. పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది’ అని ముస్తాఫా అన్నాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా బంగ్లాలో పర్యటించింది. మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 1-2 తేడాతో కోల్పోయింది. దేశం మొత్తం ఈ విజయాన్ని సంబరం చేసుకోవాలని బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ ట్వీట్‌ చేశాడు. ‘బంగ్లాదేశీయులు మొత్తం సంబరాలు చేసుకునే విజయమిది. చారిత్రక సిరీస్‌ను గెలిచినందుకు శుభాకాంక్షలు’ అని ట్వీటాడు. దీనిపై రైనా తనదైన రీతిలో స్పందించాడు. ఓడింది సిరీస్‌ మాత్రమే, ఇంకా నంబర్‌ 2 స్థానంలోనే ఉన్నామని రైనా అన్నాడు.  


ముష్ఫికర్‌ శృతి మించాడు

2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాను భారత్‌ ఓడించింది. బంగ్లా విజయానికి 3 బంతుల్లో 2 పరుగులు అవసరం అయితే టీమ్‌ఇండియా 3 వికెట్లు పడగొట్టి విజయాన్ని అందుకుంది. బంగ్లా ఓటమిని ఉద్దేశిస్తూ రైనా మాట్లాడాడు. ‘విజయం కోసం ఆఖరి వరకు పోరాడాలి. గెలిచిన తర్వాతే సంబరాలు చేసుకోవాలి. ఇది ఎంతో అద్భుతమైన మ్యాచ్‌’ అని అన్నాడు. బంగ్లాపై గెలిచిన టీమ్‌ఇండియా తర్వాత సెమీస్‌కు చేరింది. కానీ, ధోనీసేన వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ముష్ఫికర్‌ భారత్‌ ఓటమిని సంతోషిస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ‘అసలైన సంతోషం అంటే ఇదే.. భారత్‌ సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ఇప్పుడు నేను ఆనందంగా నిద్రిస్తాను. వెస్టిండీస్‌ జట్టు అదరగొట్టింది’ అని ట్వీటాడు. ఈ ట్వీట్‌ పెద్ద దుమారం లేపింది. భారత్, బంగ్లా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శించుకున్నారు.


నిదహాస్‌ ట్రోఫీ, 2018 ఫైనల్లో దినేశ్‌ కార్తీక్‌ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో కామెంటరీ బాక్సులో ఉన్న సునిల్‌ గావాస్కర్‌ బంగ్లా ఆటగాళ్లను ఉద్దేశిస్తూ నాగిని డ్యాన్స్‌ వేశాడు. అప్పట్లో అది హాట్‌టాపిక్‌గా మారింది. బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్‌ను చూడటం తప్పించావని కార్తీక్‌ను భారత అభిమానులు పెద్దఎత్తున ప్రశంసించారు. ఏడాది తర్వాత హైదరాబాద్‌లో భారత్×బంగ్లా మధ్య ఏకైక టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓటమిపై ముష్ఫికర్ స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘మేము మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే ఓడిపోయాం. హైదరాబాద్‌ వచ్చింది మ్యాచ్‌ కోసం కాదు.. బిర్యానీ కోసం’ అని ముష్ఫికర్ తెలిపాడు.

ఆ తర్వాత ఆటగాళ్ల మధ్య మాటల తీవ్రత కొంత మేర తగ్గింది. 2018 ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన బంగ్లాను భారత ఆటగాళ్లు అభినందించారు. తుదిపోరులో భారత్‌ చేతిలో ఓడినా.. బంగ్లా ఓటమిని క్రీడాస్ఫూర్తితో తీసుకుంది. మైదానంలో ఇరు జట్ల పోరాటం రణరంగంలా తలపిస్తున్నా కవ్వింపులు మాత్రం తగ్గాయి. ఇటీవల జరిగిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో విజయం సాధించింది. దిల్లీ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన ముష్ఫికర్‌ సాధారణ రీతిలోనే సంబరాలు జరుపుకొన్నాడు. అంతేకాదు.. ఇండోర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ద్విశతకం బాదిన మయాంక్‌ అగర్వాల్‌కు బంగ్లా ఆటగాళ్లు కరచాలనం చేస్తూ మరీ అభినందించారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.