close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1.  చలో.. హైటెక్‌సిటీ

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు హైటెక్‌ సిటీ మార్గం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు 10 కి.మీ. మార్గాన్ని మరికాసేపట్లో  అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ మార్గంలో మొదటి రోజుల్లో నిత్యం 50 వేల నుంచి లక్షమంది వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2.  భాజపాలో చేరిన అరుణ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తొలుత ఆమెతో హైదరాబాద్‌లో భేటీ అయినట్లు సమాచారం. చర్చల నేపథ్యంలోనే భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా అరుణ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడానికి నిర్ణయించుకున్నారు.  మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నట్లు తెలిసింది. 

3. అనుమతి లేని కొలువు

అనధికారికంగా నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 మందిని గుర్తించారు. ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ యువకుడు వీరితో పని చేయిస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు ఎప్పటిలాగే వైద్యులు, సిబ్బంది పనితీరు పరిశీలించేందుకు వార్డులు తిరుగుతుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

4. కిరాయి హంతకులతో చంపించారు!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే.. వివేకాను కిరాయి హంతకులతో హత్య చేయించినట్లుగా పోలీసులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్లు  సమాచారం. దీంతో కిరాయి హంతకులను పట్టుకోవడం పోలీసులు, సిట్ బృందాలకు పెను సవాల్‌గా మారింది. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో ఈనెల 15న వివేకా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 

5. లోక్‌పాల్‌ వచ్చేశారు

భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం మంగళవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పారా మిలటరీ దళమైన ‘సశస్త్ర సీమా బల్‌’ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌తోపాటు మహేంద్ర సింగ్‌, ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లు లోక్‌పాల్‌లో నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా నియమితులయ్యారు. జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిలు జ్యుడిషియల్‌ సభ్యులుగా ఎంపికయ్యారు.

6. ఏప్రిల్‌ 1 నుంచి హెచ్‌ 1బీ వీసాలు

అమెరికాలో ఉద్యోగం చేయాలని లక్షల మంది కలలు కంటూ ఉంటారు. ఈ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తుంటారు. అలాంటి ఆశావహులకు అమెరికా తాజాగా స్వాగతద్వారాలు తెరవబోతోంది. 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ 1 నుంచి హెచ్‌ 1బీ దరఖాస్తులు స్వీకరించబోతోంది. అక్టోబరు 1 నుంచి వర్తించేలా 65వేల మందికి అమెరికా పౌరసత్వం, వలసవాదుల సేవవిభాగం(యూఎస్‌సీఐఎస్‌) ఈ వీసాలు మంజూరు చేయనుందని ‘‘ద అమెరికన్‌ బజార్‌ డెయిలీ’’ కథనం రాసింది. వీటికి అదనంగా మరో 20వేల వీసాలు కేవలం అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ లేదా ఉన్నత డిగ్రీ అభ్యసించినవారికి మంజూరు చేయనున్నారు. 

7. రూ.12,000,00,00,000

ఎన్నికల ప్రచారానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడం 2014 నుంచే ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఎన్నికల నుంచి సామాజిక మాధ్యమాలలో రాజకీయ పక్షాలకు అనుకూలంగా ఇచ్చే ప్రకటనల ఖర్చు కూడా అభ్యర్థులు, పక్షాల ఖాతాలోకే వెళ్లనుంది. ఈసారి ఎన్నికలకు వివిధ పక్షాలు, వాటి మద్దతుదారులు ఇస్తున్న ప్రకటనల వ్యయం రూ. 12వేల కోట్ల వరకు ఉంటుందని ప్రకటనల రంగ నిపుణుల అంచనా. ఇందులో సింహభాగం ఫేస్‌బుక్‌దే. ఆ సంస్థే దాదాపు రూ.10 వేల కోట్లు దక్కించుకుంటుందని, మిగిలిన 2వేల కోట్లను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లాంటివి పంచుకుంటాయని చెబుతున్నారు. 

8. నా వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడు: దలైలామా

తాను మరణించిన తరువాత తన వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడని టిబెట్‌వాసుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (83) అన్నారు. దలైలామా అస్తమించిన తరువాత కూడా తిరిగి అవతారమెత్తుతారన్నది టిబెట్‌ బౌద్ధుల నమ్మకం. ప్రస్తుత దలైలామా రెండేళ్ల బాలునిగా ఉన్నప్పుడు అంతకుముందున్న 13వ దలైలామా ఆత్మ ఆయనలో ప్రవేశించిందని విశ్వసిస్తారు. ప్రస్తుతం ఉన్నది 14వ దలైలామా కాగా, తన వారసునిగా వచ్చే 15వ దలైలామా ఎవరన్నదానిపై ఆయన ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

9. అపోలో క్లినిక్‌ సరికొత్త సేవలు

ఇంట్లో ఎవరికైనా జబ్బు  చేసినా, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి పరుగుపరుగున వెళ్లాల్సి వస్తుంది. దీనికి బదులుగా మన ఇళ్ల దగ్గరే అధునాతన వైద్య సదుపాయాలు ఉంటే... అంతకంటే కావలసిందేమి ఉంటుంది- అనుకుంటాం. దీన్ని పరిగణలోకి తీసుకొని అపోలో క్లినిక్‌ ఒక వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. దీనికోసం అప్నా కాంప్లెక్స్‌తో చేతులు కలిపింది. తద్వారా నగరాల్లో 500 ఫ్లాట్‌ల కంటే ఎక్కువున్న అపార్ట్‌మెంట్ల ప్రాంతాల్లో ‘అపోలో క్లినిక్‌’లను ఏర్పాటు చేయటానికి సిద్ధపడుతోంది. ‘సొసైటీ క్లినిక్స్‌’ అనే పేరుతో వీటిని నెలకొల్పుతారు.

10. చెన్నైలో మే 12న ఐపీఎల్‌ ఫైనల్‌!

ఐపీఎల్‌-12 ఫైనల్‌ను మే 12న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఐపీఎల్‌ ద్వితీయార్ధం షెడ్యూలు ప్రకటించిన బీసీసీఐ.. ప్లేఆఫ్‌ దశ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఐతే మే 7న క్వాలిఫయర్‌-1, మే 8న ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌-2, మే 12న ఫైనల్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఏ కారణం వల్లనైనా ఏ మ్యాచ్‌నైనా తరలించాల్సి వస్తే.. దాన్ని విశాఖపట్నంలో నిర్వహంచాలని నిర్ణయించారని తెలుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.