Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 103346
      [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS,9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 20:56:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. జగన్‌కు కేసీఆర్‌ అపూర్వ స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ప్రగతిభవన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. గవర్నర్‌తో భేటీ తర్వాత తొలిసారిగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఆయన సతీమణి భారతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాదర స్వాగతం పలికారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, కేశవరావు, మంత్రులు, సభాపతి, ఉపసభాపతి తదితరులు జగన్‌కు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ నెల 30న తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాలని ఆహ్వానించిన జగన్‌కు కేసీఆర్‌ మిఠాయి తినిపించి శాలువాతో సత్కరించారు. అనంతరం జగన్‌కు జ్హాపికను అందజేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్తో కూడా అదే విధానం అవలంభిస్తామని స్పష్టంచేశారు.

2. ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా మోదీ

ఎన్డీఏ పక్షనేతగా జాతీయ ప్రజాస్వామ్య కూటమిలోని ఎంపీలంతా కలిసి మోదీని ఎన్నుకున్నారు. తొలుత మోదీ పేరును అమిత్‌షా ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,  రాంవిలాస్‌ పాసవాన్‌ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు  బలపరిచారు. అనంతరం ఎన్డీఏ పక్ష ఎంపీలంతా బల్లలు చరిచి తమ ఆమోదం తెలిపారు. దిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో శనివారం ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘ఆధునిక భారత్‌ దిశగా మనం ప్రయాణం ప్రారంభించాం. ఈ ప్రయాణంలో మీరంతా ఎంతో బాగా సహకరించారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారందరికీ అభినందనలు. ఈ ఐదేళ్లలో భారత్‌ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం’’ అని అన్నారు.

3. సీఎం పదవి నుంచి తప్పుకుంటా : మమత 

సార్వత్రిక ఎన్నికల్లో అపజయాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.. ఓటర్లలో హిందూ-ముస్లిం విభజన కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయని ఆమె ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘సమావేశం ప్రారంభంలోనే నేను ముఖ్యమంత్రిగా కొనసాగదల్చుకోలేదని చెప్పాను. ఈ విషయంపై మా పార్టీని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను’ అంటూ మమత వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కేంద్ర సాయుధ బలగాలు పూర్తిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాయని ఆమె ఆరోపించారు.

4. ఎవరో ఒకరు గెలవక తప్పదు..కానీ:జేపీ

కులాల పేరిట ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు ప్రజలకు మంచిది కాదని.. దీనివల్ల ఒక స్థాయిలో ఉన్నవారికే మేలు జరుగుతుందని, సామాన్యులు తీవ్రంగా నష్ట పోతున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జగన్, మోదీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాతీర్పులో ఎవరో ఒకరు గెలవక తప్పదని, అయితే.. ప్రజల కోసం అందరూ కలిసి పని చేయాలని జయప్రకాశ్‌ నారాయణ సూచించారు.

5. పదవుల కోసం అర్రులు చాచలేదు: జానారెడ్డి

తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌కు పోటీ చేస్తానంటే కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్‌ ఇచ్చేదని.. కానీ, తానెప్పుడూ టికెట్ల కోసం పాకులాడలేదని తేల్చిచెప్పారు. పదవుల కోసం అర్రులు చాచలేదని స్పష్టం చేశారు. 88 అసెంబ్లీ స్థానాలు గెలిచిన తెరాస ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు.

6. సమాజంలో ప్రశ్నించే వారు ఉండాలి: ఈటల

సమాజంలో ప్రశ్నించేవారుండాలని అప్పుడే ప్రజలు చైతన్యవంతులవుతారని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సమాజంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనేది మంచి పద్ధతి కాదన్నారు. అందరు ఐక్యంగా ఉండి పోరాడినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో లక్ష్యసాధన ఫౌండేషన్‌, పూలే ఫౌండేషన్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపూలే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్‌ అవార్డులు ప్రదానం చేశారు.

7. కొత్త ఎంపీల్లో 50% మంది నేరచరితులే

లోక్‌ సభ ఎన్నికల పర్వం పూర్తయింది. ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. ఈ లోక్‌సభ కు ఎన్నికైన ఎంపీల్లో సుమారు 50% మందికి నేర చరిత్ర ఉన్నట్లు వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో వారు తెలిపిన వివరాల ప్రకారం వీటిని విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన 539 మంది ఎంపీల్లో 233 మందిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులున్నాయి. 2009 లోక్‌ సభ కంటే ఇది 44% ఎక్కువ కావడం గమనార్హం.

8. రేపు దిల్లీకి జగన్‌ 

వైకాపా అధినేత జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. జగన్‌తోపాటు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా దేశ రాజధాని బయలుదేరనున్నారు. ఆదివారం ఉదయం 8.30కు వీరు దిల్లీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో జగన్‌ భేటీ కానున్నట్లు సమాచారం.ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాలని మోదీని జగన్‌ ఆహ్వానించనున్నారు. దిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలుత ఖరారు చేసుకున్న ఇడుపులపాయ పర్యటనను జగన్‌ రద్దు చేసుకున్నారు.

9. కన్నతల్లే కర్కశంగా చంపేసింది!

సిద్దిపేటలోని గణేశ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అతి కర్కశంగా కడతేర్చింది. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసే ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని గణేశ్నగర్‌లో నివాసం ఉంటున్న సరోజ అనే మహిళ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (రెండున్నరేళ్లు)లను నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో అతి కిరాతంగా దాడిచేసి చంపింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య అనంతరం తల్లి సరోజ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడం గమనార్హం.

10. ప్రపంచకప్‌ వార్మప్‌ పరీక్షలో కోహ్లీసేన విలవిల

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆడుతున్న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచింది. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై వణికింది. 39.2 ఓవర్లకు 179 పరుగులకే కుప్పకూలింది. స్వింగ్‌, సీమ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ట్రెంట్‌ బౌల్ట్‌ (4/33), జేమ్స్‌ నీషమ్‌ (3/26) కోహ్లీసేన నడ్డి విరిచారు. రవీంద్ర జడేజా (54; 50 బంతుల్లో 6×4, 2×6) సమయోచిత అర్ధశతకంతో, హార్దిక్‌ పాండ్య (30; 37 బంతుల్లో 6×4) బౌండరీలు బాది కాస్తైనా రాణించడంతో భారత్‌ ఆ మాత్రమైనా స్కోరు చేసింది. భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.