close

తాజా వార్తలు

అదృశ్య భయం

రాజధానిలో అదుపు తప్పిన కిరాయిదారుల ఆరా
ఆగంతుకుల గుర్తింపులో పోలీసుల వైఫల్యం
వివరాల అప్పగింతలో యజమానుల అలసత్వం

మహానగరాన్ని ‘అదృశ్య’ భయం వెంటాడుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ఇళ్లలో చెప్పకుండా వెళ్లిపోతున్నారు. వీరిలో యుక్త వయసున్న అమ్మాయిలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు కారణాలను విశ్లేషిస్తే అపహరణల కంటే వివిధ కారణాలతో స్వతహాగా గడప దాటుతున్న ఉదంతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉపాధి పేరుతో వచ్చి ఇక్కడ మకాం వేస్తున్న యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలేసి తీసుకుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి యువకులపై ఆరా తీసే వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ప్రారంభించిన ‘టెనెంట్స్‌ వాచ్‌’ గాడి తప్పడం ఇందుకు ఓ ప్రధాన కారణంగా  కనిపిస్తోంది.

హైదరాబాద్‌: సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధి(ప్రస్తుతం) సుమారు 8,800 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఉండటం.. నగర విస్తృతి శివార్లలోనే ఉంటుండటంతో వలస వచ్చేవారంతా ఇక్కడే నివాసానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ‘టెనెంట్స్‌ వాచ్‌(అద్దెదారుల ఆరా)’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు అంతుకుముందు అబ్దుల్లాపుర్‌మెట్‌లో 18 రోజులపాటు అద్దెకున్నా పోలీసులకు సమాచారం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. సుమారు 50కిపైగా అంశాలతో కిరాయిదారుల వివరాలను సేకరించేలా పత్రాలను రూపొందించారు. అప్పట్లో వాటిని ఠాణాల్లో అందుబాటులో ఉంచారు. సెక్టార్ల వారీగా ఇంటింటికి తిరిగి ఇళ్ల యజమానులకు అందించి వివరాలు సేకరించారు. కిరాయిదారుడి గుట్టు మొత్తం గుప్పిట్లో ఉండేలా పత్రాలుండటంతో పోలీసుల చర్యపై అభినందనలు వెల్లువెత్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ప్రక్రియ ఇప్పుడు గాడి తప్పింది. వివిధ కారణాలతో ఆ విధానాన్ని గాలికొదిలేయడంతో పరిస్థితి మొదటికొచ్చింది. తాజాగా అమ్మాయిల అదృశ్యం ఘటనలు వెల్లువెత్తుండటానికి.. ఈ విధానం గాడి తప్పడానికి మధ్య లంకె ఉండటం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌.. తదితర రాష్ట్రాలకు చెందిన యువకులు నగరానికి వచ్చి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, గగన్‌పహాడ్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, బాచుపల్లి.. తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే పలువురు అమ్మాయిలపై ఆకర్షణ వలేసి తీసుకెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంతోపాటు శివార్లలో వారు అద్దెకు దిగేటప్పుడే నిఘా ఉందనే భయం కల్పించగలిగితే అదృశ్యం ఉదంతాలకు తావివ్వకుండా చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో గుట్టు తెలిసిందిలా..
కిరాయిదారుల ఆరా ప్రక్రియ ఆరంభించిన అనంతరమే ఘరానా గొలుసుదొంగ కడవలూరి శివ ఉదంతం వెలుగు చూసింది. నార్సింగి ఠాణాకు సుమారు 200 గజాల దూరంలోనే శివ అద్దెకు దిగినా.. ఎన్‌కౌంటర్‌ జరిగే వరకు స్థానిక పోలీసులు పసిగట్టలేకపోయారు. శంషాబాద్‌ సమీపంలో బాహ్యవలయ రహదారిపై 2014 ఆగస్టు 14 రాత్రి  జరిగిన ఎన్‌కౌంటర్‌లో శివ మరణించడంతో నార్సింగిలోని అతడి స్థావరం బహిర్గతమైంది. ఠాణా ఎదురు గల్లీలో భార్యాపిల్లలతో కలిసి అతను 3 నెలలుగా మకాం వేసినా పోలీసులకు సమాచారం కొరవడింది.
బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వచ్చిన ఓ ఉగ్రవాద సానుభూతిపరుడు పహాడీషరీఫ్‌లో ఏడాదిన్నరపాటు నివాసమేర్పర్చుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చిన్నారులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఎన్‌ఐఏ పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్‌ చేసేవరకు స్థానిక పోలీసులకు సమాచారం లేదు.
మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మాజీ నక్సలైట్‌ నయీం చాలా కాలం నార్సింగిలోనే ఉన్నాడని తర్వాత బహిర్గతమైంది. నయీం సీబీఐ మోస్ట్‌వాంటెడ్‌ నేరస్థుల జాబితాలో ఉన్నా.. వందల కేసుల్లో నిందితుడిగా ఉన్నా అతడిపై పోలీస్‌ నిఘా లేకపోయింది.

‘సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ కాలనీ’ ఎక్కడ?
టెనెంట్స్‌ వాచ్‌ విధానం తెరపైకి వచ్చిన సమయంలోనే హైదరాబాద్‌, ఉమ్మడి సైబరాబాద్‌ కమిషనరేట్లలో ‘సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ కాలనీ’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇంటి యజమాని, అద్దెదారులకు సంబంధించిన ఫొటో, ఆధార్‌నంబరు, చిరునామా, వాహనం, సెల్‌ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ, వృత్తి.. తదితర వివరాల్ని నమోదు చేశారు. అద్దెదారులైతే ఎప్పుడు అద్దెకు దిగారు..? సంబంధిత ఏజెంటు ఎవరు..? అద్దెదారుడికి తెలిసిన ఒకరిద్దరి వివరాలు నిక్షిప్తం చేశారు. అలాగే విదేశీయులైతే పాస్‌పోర్టు నకలుప్రతి, వీసా వివరాలు, సందర్శన ఉద్దేశం, దేశంలోకి వచ్చిన తేదీ, వృత్తి సంబంధ వివరాలు, స్థానికంగా ఉన్న బంధువుల వివరాలను నమోదు చేశారు. అలాగే ఇంటి పనిమనిషి, పేపర్‌బాయ్‌, పాలు పోసే వ్యక్తి, వడ్రంగి, ప్లంబర్‌.. తదితరుల వివరాలు, చిత్రాలను పోలీసులకు అందజేశారు. వాటిని సేకరించి ఆయా ఠాణాల్లో భద్రపరిచేలా బృహత్‌ ప్రణాళిక రూపొందించారు. అనంతరం కమిషనరేట్లలోని అన్ని ఠాణాల వారీగా పూర్తి సమాచారం సేకరించాక డేటా అంతటినీ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంలో నిక్షిప్తం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టుల్ని ఉత్సాహంగా ప్రారంభించినా తర్వాత ఆ ఊపు కొనసాగకపోవడంతో ఉద్దేశం నీరుగారినట్లయింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.