close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ- ఎం3
భారత అంతరిక్ష రంగ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పరిశోధక పరికరాలతోపాటు 130 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ‘చంద్రయాన్‌-2’ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. బాహుబలి వాహకనౌక ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1’ తనపై ఇస్రో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వ్యోమనౌకను రోదసిలోకి మోసుకెళ్లింది. భూకక్ష్యలోకి దాన్ని చేర్చింది. దీంతో జాబిల్లిపైకి మనదేశం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రెండో యాత్రలో తొలి అంకం విజయవంతంగా పూర్తయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో 75% లోకల్‌

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు; మొత్తంమీద మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేసే నాలుగు వేర్వేరు బిల్లులను ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ ఈ బిల్లులను సభ ముందుంచారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే బిల్లు ప్రకారం... స్థానికంగా అర్హులైన అభ్యర్ధులు అందుబాటులో లేకపోతే మూడేళ్ల లోపు వారికి అవసరమైన శిక్షణ ఇప్పించి తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికలకెందుకంత హడావుడి? 

మున్సిపల్‌ ఎన్నికల నిమిత్తం ముందస్తుగా రూపొందించుకున్న ప్రణాళికను మీరే ఎందుకు కుదించుకున్నారంటూ ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు ముందు దశలవారీగా ఒక్కో దశను పూర్తి చేయడానికి ఎంతెంత గడువు కావాలో చెబుతూ సింగిల్‌ జడ్జికి ప్రణాళిక సమర్పించారంది. దీని ప్రకారం 109 రోజులు అవసరంకాగా అదే విషయాన్ని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు వెలువరించాక ఈ మొత్తం ప్రక్రియను 9 రోజుల్లోనే పూర్తి చేయడానికి ఎందుకు కుదించుకోవాల్సి వచ్చిందని అడిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ సెంచరీలు కొట్టాలి

ముఖ్యమంత్రి జగన్‌ 34 రోజులుగా ప్రతి బంతినీ బౌండరీకి తరలిస్తున్నారని, టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లా చివరి అయిదు ఓవర్లలోనూ మళ్లీ జగన్‌ హిట్టింగ్‌ చేస్తారనుకుంటున్నానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌గా జగన్‌ మ్యాచ్‌ చివరి వరకు నాటౌట్‌గా నిలవాలని, సెంచరీలపై సెంచరీలు కొడుతూ దూసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జగన్‌ పాలనను టీ20 క్రికెట్‌ మ్యాచ్‌తో గవర్నర్‌ పోల్చారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో సోమవారం రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు ప్రభుత్వం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పథకాలకు నిధుల్లేవు.. కొత్త భవనాలెందుకు?

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉండగా.. వాస్తు పేరుతో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి సిద్ధపడడం దారుణమని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తెజస అధినేత కోదండరాం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణాలకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచిగానే ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తామని మొండిపట్టు పట్టడం సరికాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘కశ్మీరు’పై మధ్యవర్తిత్వానికి సంసిద్ధంగా ఉన్నా!

కశ్మీరు సమస్య పరిష్కారం కోసం భారత్‌, పాకిస్థాన్‌లతో మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం స్పష్టం చేశారు. ఉభయదేశాలు తనను కోరితే సాయపడతానన్నారు. ‘కశ్మీరు’పై సహాయపడగల అవకాశం వస్తే మాత్రం మధ్యవర్తిగా వ్యవహరించడానికే ఇష్టపడతానన్నారు. శ్వేతసౌధంలో ట్రంప్‌ను సోమవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కలుసుకున్నారు. ‘కశ్మీరు’పై ట్రంప్‌ అభిప్రాయాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మాల్యా ఆస్తుల  యాజమాన్య వివరాలివ్వండి

గేమ్‌ రిజర్వ్‌, రెండు సూపర్‌యాచ్‌లు, విలువ కట్టలేని వింటేజ్‌ కార్లు, విలువైన చిత్రాలు, సుప్రసిద్ధ ఎల్టన్‌ జాన్‌ వినియోగించిన పియానో.. వంటి అత్యంత ఖరీదైన ఆస్తులు విజయ్‌ మాల్యా ఆధీనంలో ఉన్నాయి. అయితే అవి మాల్యాకే చెందినవని నిరూపించే ధ్రువీకరణ పత్రాలు పొందే హక్కు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల బృందానికి లభించింది. లండన్‌ హైకోర్టుకు చెందిన కమర్షియల్‌ కోర్టు విభాగ న్యాయమూర్తి జస్టిస్‌ రాబిన్‌ నాలెస్‌ ఈ మేరకు తీర్పు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టైటిళ్ల కరవు తీరేనా? 

ఈ ఏడాది ఒక్క టైటిల్‌ కూడా కొట్టలేకపోయిన భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ మరో సమరానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఆరంభం కానున్న జపాన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్లో ఓడిన సింధు.. ఈ టోర్నీలో ఎలాగైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. తొలిరౌండ్లో ఐదో సీడ్‌ సింధు.. హన్‌ యూ (చైనా)తో తలపడనుంది. మరోవైపు గాయం నుంచి కోలుకుని మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించిన సైనా.. బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో మ్యాచ్‌తో వేట మొదలెట్టనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘అవతార్‌’ను దాటేసిన ‘అవెంజర్స్‌’

‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఎట్టకేలకు ‘అవతార్‌’ను వెనక్కు నెట్టేసింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లందుకున్న చిత్రంగా నిలిచి కొత్త చరిత్ర లిఖించింది. 2009లో విడుదలైన ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు వసూళ్లందుకుంది. ఇప్పుడు ‘ఎండ్‌గేమ్‌’ 2.79 బిలియన్‌ డాలర్లు సాధించి ‘అవతార్‌’ రికార్డును బద్దలుకొట్టింది. అయితే ‘ఎండ్‌గేమ్‌’కు ఈ ఘనత అంత సునాయాసంగా దక్కలేదు. ఈ రికార్డు సాధించడం కోసం ఆ చిత్రాన్ని రెండోసారి కూడా విడుదల చేయాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తల్లి ఆస్తి స్వాహా.. కొడుకు, కోడలికి జైలు శిక్ష

భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న తల్లి ఆస్తిని స్వాహా చేసిన కొడుకు, కోడలికి మల్కాజిగిరి కోర్టు సోమవారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ కాకతీయనగర్‌కు చెందిన ప్రేమకుమారి(66)కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రేమకుమారి భర్త 2013లో మరణించారు. అప్పటినుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. పెద్ద కుమారుడు అమిత్‌కుమార్‌, కోడలు శోభితాలావణ్యలు 2015లో ఆమె ఇంట్లోకి వచ్చి మకాం వేశారు. ఆమెకు తెలియకుండా ఇంటిని కొడుకు తన పేరు మీద రిజిస్టర్‌ చేయించుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 13న ఇంటికి తాళం వేసి తల్లిని బయటకు గెంటేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.