close

తాజా వార్తలు

చిన్నారి పొన్నారి చిత్తాలు తెలిసి!

బంగారుపళ్లానికైనా గోడ ఆసరా కావల్సిందే అంటారు. పిల్లలకూ ఇదే వర్తిస్తుంది. అటు చదువుల్లో, ఇటు ఆటపాటల్లో రాణించాలంటే... అర్థమయ్యేలా  వివరించే ఆసరా కావాలి. అదే చేస్తున్నారీ ముగ్గురు. ఒకరు చిన్నారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఆన్‌లైన్‌ పత్రికను తెస్తే... మరొకరు పిల్లలు, టీచర్లలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇంకొకరు ట్యూటర్‌ని ఏర్పాటు  చేసుకునే యాప్‌నే రూపొందించారు. ఇంతకీ వాళ్లెవరంటే...

రచనల కోసం ఉద్యోగం వదిలి...

సౌమ్య గరిమెళ్ల... తనకు ఎదురైన అనుభవంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు రకాల స్టార్టప్‌లను ప్రారంభించింది. అందులో పిల్లలకు ఉపయోగపడేది ఒకటి. అదే ఆమెకు ఇప్పుడు ఐఐఎం బెంగళూరులో ఏడాదిపాటు శిక్షణ తీసుకునే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
సౌమ్యది విశాఖపట్నం. చిన్నతనం నుంచే ఆమెకు కళలు, సాహిత్యం అంటే ఇష్టం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంటెక్‌ పూర్తి చేసినా ఆమెకు మొదటి నుంచీ రాయడం అంటే ఆసక్తి. చదువుకుంటున్నప్పుడు పత్రికలకు ఉత్తరాలు రాసేది. ఇంగ్లిష్‌, తెలుగులో కవిత్వాలు, కథలు రాసిన అనుభవం ఉంది.  కానీ ఏ దిశగా ప్రయత్నిస్తే... ఆ రచనా రంగంలోకి వెళ్లొచ్చో తెలిసేది కాదట. దాంతో ఇంజినీరింగ్‌ చేసి ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా చేరింది. కానీ ఏదో అసంతృప్తి. చివరకు ఉద్యోగానికి రాజీనామా చేసి టెక్ట్స్‌కార్ట్‌ అనే స్టార్టప్‌ని ప్రారంభించింది. కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌పై పనిచేస్తుందా సంస్థ. సరిగ్గా ఏడాదికి పిల్లలకోసం ఏదయినా చేయాలనుకుంది. దానికి కారణం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అనుభవాలే. ‘రచనలపై ఆసక్తి ఉన్నా... సరైన అవగాహన, చెప్పేవారు లేక ఇంజినీరింగ్‌ చేశా. పదేళ్ల గడిచిపోయాయి. ఇప్పుడు కూడా పిల్లల ప్రతిభకు, నైపుణ్యాలకు ఆసరా ఇచ్చే అవకాశాలు అంతగా లేవు. అందుకే వాళ్లకోసం అమేజింగ్‌ స్క్రిబుల్స్‌ పేరుతో ఓ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ని అందుబాటులోకి తెచ్చా. చిత్రలేఖనం మొదలు కథలు, కవిత్వాలు రాయడం... ఇలా ఏవయినా సరే పిల్లలు ఈ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌లో పోస్టు చేయొచ్చు. పూర్తిగా ఉచితమే. ఒకవేళ అదే వాళ్ల భవిష్యత్తు కెరీర్‌ అనుకుంటే... అందుకు సంబంధించిన సందేహాలు తీర్చేందుకు, సూచనలు ఇచ్చేందుకు మెంటార్లు కూడా ఉంటారు. 7-15 వయసు చాలా కీలక దశ. ఈ సమయంలో అవసరమైన ఆసరా అందిస్తే వాళ్లకు తిరుగుండదు. మా మ్యాగజైన్‌ ద్వారా అదే చేస్తున్నా. గత రెండేళ్లలో యాభై శాతం పాఠకులు పెరిగారు...’ అని చెబుతుందామె.
అరుదైన గుర్తింపు: సౌమ్య తన మొదటి స్టార్టప్‌ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ మ్యాగజైన్‌కోసం కేటాయిస్తోంది. పత్రిక రూపంలోనూ అందుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత ది పాజిటివ్‌ ఇండియా పేరుతో మరో ఆన్‌లైన్‌ పత్రికకు సహ వ్యవస్థాపకురాలిగా మారింది. సౌమ్య ప్రయత్నాల్ని గుర్తించిన ఐఐఎం బెంగళూరు తాము ఎంపికచేసిన వంద మంది స్టార్టప్‌ ఆలోచనల్లో ఆమెకీ స్థానం కల్పించింది. అలా ఐఐఎం బెంగళూరు అందించే ఏడాది శిక్షణకు ఎంపికైంది. ప్రస్తుతం అక్కడ వ్యాపార మెలకువలు, ఇతర నైపుణ్యాల్లో శిక్షణ తీసుకుంటోంది. అయితే ఈ స్టార్టప్‌లను ప్రారంభించడానికి ముందు సౌమ్య ఎంతో పరిశోధన చేసింది. విజయాలు, వైఫల్యాలపై అవగాహనా పెంచుకుంది. ఆమె తండ్రి మెరైన్‌ ఇంజినీర్‌. తల్లి గృహిణి. ఆమె భర్త వీఎంవేర్‌లో బిజినెస్‌ ఎనలిస్ట్‌గా చేస్తున్నారు. అన్నయ్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే. కుటుంబ సహకారంతోనే ఇవన్నీ చేస్తున్నానని చెబుతుంది ఈ యువ ప్రతిభావని.

ఈ యాప్‌ టీచర్లకోసమే...

బోధనలో ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయితే... పిల్లల బాగా చదువుతారని అంటారు డాక్టర్‌ మోనా మాథుర్‌. ఆ లక్ష్యంతోనే భర్తతో కలిసి మిలియన్‌ స్పార్క్స్‌ ఫౌండేషన్‌ని అందుబాటులోకి తెచ్చారీమె.
ఉపాధ్యాయులు పాఠాలు మాత్రమే చెప్పడం, పాత పద్ధతులను అనుసరించడం గమనించారు మోనా. చిన్నారులు చదువుతారు కానీ... ఇతర అంశాలు, నైపుణ్యాల విషయంలో వెనుకబడి ఉంటారు. ఇదే కొనసాగితే... పిల్లలు యాంత్రికంగా మారతారని ఆలోచించిన ఆమె టీచర్ల బోధనా విధానంలో మార్పు తేవాలనుకున్నారు. తద్వారా పరోక్షంగా పిల్లల్ని తీర్చిదిద్దాలనుకున్నారు. అలా భర్త డాక్టర్‌ అభినవ్‌ మాథుర్‌తో కలిసి 2016లో మిలియన్‌ స్పార్క్స్‌ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. ఇది ఉచిత మొబైల్‌ యాప్‌, వెబ్‌ లెర్నింగ్‌ వేదిక. వివిధ రకాల విద్యా సంస్థల ద్వారా తరగతుల వారీగా పాఠాలు సేకరించి ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందిస్తుంది ఈ యాప్‌. విద్యావిధానాల్లో వస్తోన్న మార్పులు, బోధనాపరంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ప్రయోగాలు.. వంటివీ తెలుసుకోవచ్చు. అలా రెండేళ్లలో 26 వేల పాఠశాలల నుంచి 98 వేల మంది ఉపాధ్యాయులను చేరుకుంది ఈ యాప్‌. ఇందుకోసం చాక్‌లిట్‌ అనే కార్యక్రమం పనిచేస్తుంది. ఉపాధ్యాయుల్లో మార్పు వస్తే... పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందినట్లే అని చెబుతారామె. ‘భారత్‌లోని చాలామంది టీచర్లు పాత పద్ధతుల్నే అనుసరిస్తున్నారని గుర్తించాకే దీన్ని ఏర్పాటు చేశాం. పైగా అంతా ఉచితమే. పిల్లల్లో ఆలోచనా విధానం... సృజనాత్మకత వెలికి తీయడమే మా లక్ష్యం...’ అని అంటారు మోనా. ఆమె సంస్థ మలేసియాలో జరిగిన బెట్‌ ఆసియా కార్యక్రమంలో మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ ఇన్‌ ఏసియా పసిఫిక్‌ గుర్తింపు అందుకుంది. బెస్ట్‌ ఇండియన్‌ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ అవార్డు కూడా వచ్చింది.

స్వానుభవంతోనే పరిష్కారం...

ఒకప్పుడు ఎదురైన సమస్య నుంచే పరిష్కారాన్ని ఆలోచించింది విధు. ఆ పరిష్కారమే వోంక్‌ యాప్‌. ఇంతకీ అదెలా పనిచేస్తుందంటే...
విధు గోయల్‌ది ఫరీదాబాద్‌లోని చిన్న నగరం. మూడేళ్లక్రితం వరకూ ఆమె కూడా అందరిలాంటి ఉద్యోగినే. తన కూతురి కోసం ట్యూటర్‌ని వెతికిందామె ఒకప్పుడు. ఇంటికొచ్చి చెప్పేవారు దొరకలేదు. కొంతమంది వచ్చినా అపరిచితుల దగ్గర పాపను ఎలా వదలాలో అర్థంకాలేదు. తనలాంటి పరిస్థితి చాలామంది తల్లులదని గుర్తించాకే వోంక్‌పేరుతో యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటికొచ్చి చదువుచెప్పే ట్యూటర్లు ఇందులో ఉంటారు. దేశవ్యాప్తంగా పనిచేస్తుందీ యాప్‌. ఇందులో మొత్తంగా 20 వేలకు పైగా నిపుణులైన ట్యూటర్లు ఉంటారు. ప్రస్తుతం 27 వేలకు పైగా సభ్యులు ఇందులో రిజిస్టర్‌ అయ్యారు. హోంట్యూషన్‌ మాత్రమే కాదు... ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు చెప్పే విధానం కూడా అందుబాటులోకి తెచ్చింది. పాఠాలు రికార్డు కూడా చేసుకోవచ్చు. ‘ఎప్పటికప్పుడు విద్యార్థులు, ట్యూటర్ల సంఖ్య పెరుగుతోంది. మా సంస్థ కిందటేడాది డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అవార్డును హరియాణ ప్రభుత్వం నుంచి అందుకుంది. ఇందులో ఈఎంఐ ద్వారా కూడా ట్యూషను ఫీజు చెల్లించే సౌలభ్యం ఉంటుంది. ఉత్తమ టీచర్‌ ఎక్కడున్నా సరే.. విద్యార్థులకు చేరువ చేయడమే నా ప్రయత్నం...’ అని చెబుతుందామె.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.