close

తాజా వార్తలు

మీరైతే ఏంచేస్తారు

ఎదుగుతోన్న పిల్లలకు ఆటపాటలతోపాటు సామాజిక చైతన్యం పెరగాలంటే స్నేహితులూ ముఖ్యమే. చిన్నారుల్లో స్నేహభావాన్ని పెంపొందించడానికి, వారు ఎక్కువ మందితో స్నేహం చేయడానికి తల్లిగా మీరేం చేస్తారు అని మేం అడిగిన ప్రశ్నకు... ఇలా సమాధానమిచ్చారు.

* ప్రవర్తన, మంచిచెడులు వంటివన్నీ పిల్లలు స్నేహితుల నుంచే నేర్చుకుంటారని నేను నమ్ముతా. అందుకే చిన్నప్పటి నుంచే మా బాబు, పాప ఎక్కువ మందితో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించా. ఓసారి మా అబ్బాయి స్నేహితుడు కనిపించకుండా పోయినప్పుడు... మావాడు వాళ్ల తల్లిదండ్రులను ఓదార్చాడు. ఒక రోజంతా వాళ్లతోనే గడిపి ధైర్యం చెప్పాడు. స్నేహితులవల్లే వాడికి సామాజిక నైపుణ్యాలు పెరిగాయి. 
- గంగాభవాని, విశాఖపట్టణం
* ఈ కంప్యూటర్‌ యుగంలో ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం తగ్గిపోతోంది. మా పాపపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు తనను ఖాళీ సమయాల్లో బయటకు తీసుకెళ్తున్నా. తోటి పిల్లలతో ఆడుకోమని ప్రోత్సహిస్తా. వాళ్లతో సర్దుకుపోవడం నేర్పిస్తున్నా. నా వంతుగా ఇంట్లో నైతిక విలువలు నేర్పిస్తున్నా. 
- హరీశ, అమెరికా
* మా పాపకు ఐదేళ్లు. ఇచ్చిపుచ్చుకోవడం, పంచుకోవడం అలవాటు చేస్తే మంచిదని నా అభిప్రాయం. అందుకే తన దగ్గర ఉన్న తినుబండారాల్ని తోటి పిల్లలతో పంచుకుని తినడం అలవాటు చేస్తున్నా. ఆటవస్తువులు, దుస్తులు వంటివి తనతోనే వితరణ చేయిస్తా. ఆదివారాల్లో పిల్లలందరినీ ఒకచోటకు చేర్చి, వారితో నాటకాలు వేయిస్తున్నా. చిన్నప్పుడే ఇలాంటివన్నీ అలవాటు చేస్తే పెద్దయిన తరువాత మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. 
- మీనా, అనంతపురం. 
* నాకు ఇద్దరు పిల్లలు. మా బాబు స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించిన కొత్తలో ఎక్కువమందితో కలిసేవాడుకాదు. దీంతో రోజూ తరగతిలో కనీసం ముగ్గురి పేర్లు తెలుసుకుని నాకు చెప్పాలని వాడికి చెప్పా. దీనివల్ల త్వరగానే అందరితో కలిసిపోయాడు. స్నేహితులు ఎవరు కనిపించినా మొదట మావాడినే మాట్లాడమని ప్రోత్సహించేదాన్ని. అందుకే ఇప్పుడు మా వాడికి మిత్రులూ ఎక్కువే. 
- అఖిల, సరూర్‌నగర్‌
* నేనొక ఎన్జీవో తరఫున పనిచేస్తున్నా. ఖాళీ సమయాల్లో మా పిల్లలను అనాథ శరణాలయాలకు తీసుకెళ్తా. వారి స్నేహితులతో సామాజికసేవ గురించి చర్చించేలా ప్రోత్సహిస్తున్నా. 
- నాగలక్ష్మి, రామాంతపూర్‌
* మా పిల్లలను సెలవు రోజుల్లో బంధుమిత్రుల ఇళ్లకు తీసుకెళ్తుంటా. స్కూల్‌, అపార్ట్‌మెంట్‌లోని మా పిల్లల స్నేహితులను వారంలో ఒకసారైనా ఇంటికి ఆహ్వానిస్తా. కలిసి భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తా. సమస్యలను ఎదుర్కొనేలా, కలిసి పనులు చేసేలా వారిని ప్రోత్సహిస్తా. 
-గండికోట చిట్టి, హైదరాబాద్‌
* మా ఇద్దరి పిల్లలతో ఓ మంచి స్నేహితురాలిగా కలిసిపోతా. వారి స్నేహితులను వివిధ సందర్భాల్లో ఇంటికి ఆహ్వానిస్తా. ఆ సమయంలో వారితో మా చిన్నారుల ప్రవర్తన, మాట్లాడే విధానం ఎలా ఉందని ఆరా తీస్తా. ఒకరికొకరు సాయపడేలా చూస్తా. తప్పులు  సరిదిద్దుతా. 
- కిరణ్మయి, కౌలాలంపూర్‌
* సామాజిక చైతన్యం ఉంటే నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులువుగా ఎదుర్కోగలుగుతారు. అందుకే పిల్లలకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అలవాటు చేశా. స్నేహితులతో కలిసి అనాథ, వృద్ధాశ్రమాలకు తీసుకెళ్తా. పండగలు, చర్చలు, ర్యాలీలు, సదస్సుల్లో పాల్గొనమని ప్రోత్సహిస్తా. 
- శాంతా భాస్కర్‌, చిత్తూరు
* పిల్లలకు చిన్నప్పటి నుంచీ ఏది నేర్పిస్తే అదే అలవాటవుతుందని నేను నమ్ముతా. మా బాబుకి ఆరేళ్లు. వాడు కిడ్డీబ్యాంకులో దాచుకున్న డబ్బుని సామాజిక సేవకు వినియోగించేలా చూస్తా. ఆ మొత్తంతో పుస్తకాలు కొని పేద విద్యార్థులకు వాడితోనే ఇప్పిస్తుంటా. ఇలా చేయడం వల్ల బాబుకి సామాజిక విలువలతోపాటూ నలుగురిలో సర్దుకుపోయేతత్వం అలవడుతుంది. 
- తేజోమయి వంగ 

 

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా... ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరం.  మహిళలు ఈ విషయంలో ఒకింత నిర్లక్ష్యం చూపుతారనే అపవాదు ఉంది. మీరు ఆ కేటగిరీ కాకపోతే... కసరత్తులకు మీరు కేటాయించే సమయం.... అది మీ ఆరోగ్యంపై చూపిన సానుకూల ప్రభావం గురించి మాకు వాట్సాప్‌ చేయండి. 
వసుంధర డెస్క్‌ ఫోన్‌: 9154091911

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.