close
ఏ దేశమేగినా.. మనమేనోయ్‌!

ప్రవాసం వెళ్తున్న వారిలో భారతీయులే అత్యధికం
ప్రస్తుతం ప్రవాస భారతీయుల సంఖ్య 1.75 కోట్లు
తర్వాతి స్థానాల్లో మెక్సికో, చైనా
మన దేశానికి వచ్చిన వారు 51 లక్షల మంది
ఐరాస ప్రపంచ నివేదిక

మేధాశక్తిలో మేటిగా నిలిచే భారతీయులు విశ్వవ్యాప్తంగా ఉనికి చాటుతున్నారు. మాతృభూమితో పాటు వలస వెళ్లిన దేశాల అభివృద్ధిలోనూ భాగస్వాములు అవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద విదేశాలకు వలస వెళ్తున్నవారిలో మన భారతీయులే అత్యధికమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చింది.
2019 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా  మాతృ దేశాల నుంచి ఇతర దేశాలకు ప్రవాసం వెళ్లి ఉంటున్నవారు 27.2 కోట్ల మంది. ఇందులో 1.75 కోట్ల మంది భారతీయులే.
మొత్తం వలసదారుల్లో మూడో వంతు మంది పది దేశాలకు చెందిన వారే. ప్రవాసుల విషయంలో అన్ని దేశాలకు సంబంధించి వయసులు.. స్త్రీ-పురుషులకు సంబంధించిన తాజా వివరాలతో ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ నివేదికను వెలువరించింది.


వలస‘దారుల్లో’ భారతీయులే ప్రథమం

విదేశాలకు వలసపోతున్న వారిలో భారతీయులే అత్యధికం కాగా మన దేశానికి వలస వస్తున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది. ఈ విషయంలో అగ్ర భాగాన అమెరికా ఉండగా మనం తొలి పది స్థానాల్లో కూడా లేము.

భారత్‌ ఆతిథ్యం

* 2019లో భారత్‌కు 51లక్షల మంది వలస వచ్చారు. ఇందులో 48.8 శాతం మంది మహిళలు.
* వలసదారుల్లో సగటు వయసు 47.1 ఏళ్లు.
* 2015 (52 లక్షల మంది) కంటే వలసదారులు తగ్గారు.
* బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ నుంచి వచ్చినవారే అధికం.
* భారత్‌లో శరణార్థులు 2,07,000.

అంతర్జాతీయ ఆతిథ్యం

* అత్యధికంగా ఐరోపాకు 8.2 కోట్ల మంది వలస వచ్చారు.
* ఉత్తర అమెరికాకు 5.9 కోట్ల మంది.
* ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాకు 4.9 కోట్ల మంది.

అభివృద్ధికి వలసలు కీలకం

వలసదారుల పాత్ర ఎంత కీలకమో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో, ఆ రెండు దేశాల అభివృద్ధిలో వీరి పాత్ర ఏమిటో ఈ గణాంకాలు చెబుతున్నాయి. సక్రమ వలసవిధానాన్ని ప్రోత్సహిస్తే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చు.
- లియూ జెన్‌మిన్‌, ఐరాస అండర్‌ -సెక్రటరీ-జనరల్‌, ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం.

నివేదికలో కీలకాంశాలు

* అంతర్జాతీయ సరిహద్దుల్లో వలసదారులను బలవంతంగా పంపించివేయడం పెరుగుతోంది.
* 2010-2017 మధ్య శరణార్థుల సంఖ్య 1.3 కోట్లు పెరిగింది.
* ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాలు అత్యధికంగా 46 శాతం శరణార్థులకు ఆశ్రయమిస్తున్నాయి.
* వలసదారుల్లో మహిళలు, బాలికలు 48 శాతం.
* 2000 కంటే ఇది 1 శాతం తక్కువ.
* ప్రతి ఏడుగురు వలసదారుల్లో ఒకరు 20 ఏళ్ల లోపు వారు.

వార్తలు / కథనాలు

మరిన్ని