భాజపా గెలుస్తుందనే ఇదంతా..:బండి సంజయ్‌
close

తాజా వార్తలు

Published : 27/10/2020 01:08 IST

భాజపా గెలుస్తుందనే ఇదంతా..:బండి సంజయ్‌

కరీంనగర్: దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతుంటే సిద్దిపేటలో తనిఖీలు ఎందుకని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. సిద్దిపేటలో తనిఖీలు చేసే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. సిద్దిపేటలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కరీంనగర్‌ తరలించారు. అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌నరావు ఇంట్లో పసిపాపను సైతం నిద్రలేపి తనిఖీ చేశారని..మహిళ అని కూడా చూడకుండా రఘునందన్‌ భార్యను తోసేశారని ఆరోపించారు. 

‘‘రఘునందన్‌రావు డబ్బు ఆయన పక్కింట్లో దొరికిందా? భాజపా కార్యకర్తలు డబ్బు ఎత్తుపోయారని చెబుతున్నారు. అలా జరిగితే సీపీని సస్పెండ్ చేయాలి.. డబ్బు కాపాడలేని సీపీ ఎందుకు? నోటీసులు లేకుండా పోలీసులు మఫ్టీలో వచ్చి దాడి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని మేం కోరుకుంటున్నాం. కానీ ఓటమి భయంతో శాంతిభద్రతలకు తెరాస విఘాతం కలిగిస్తోంది. సీపీతో తనపై తెరాస దాడి చేయించింది. దుబ్బాకలో భాజపా గెలుస్తుందనే ఇదంతా చేశారు. నా గొంతు పట్టి వ్యానులోకి నెట్టారు. సీపీ నాపై రాక్షసంగా ప్రవర్తించారు. రాష్ట్ర అధ్యక్షుడిని.. ఎంపీనని కూడా చూడకుండా నాపై పోలీసులు దాడి చేశారు. దీనిపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తా’’ అని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీక్షకు దిగిన సంజయ్‌.. అమిత్‌షా ఫోన్‌

సిద్దిపేటలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్‌ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీక్షకు దిగారు. సిద్దిపేట సీపీని సస్పెండ్‌ చేసి అతడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. సిద్దిపేట ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని