చెన్నైలో జగన్‌ కొత్త ప్యాలెస్‌: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 31/10/2020 01:16 IST

చెన్నైలో జగన్‌ కొత్త ప్యాలెస్‌: లోకేశ్‌

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇప్పటికే హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరులో ప్యాలెస్‌లు ఉన్నాయని.. చెన్నైలో కొత్త ప్యాలెస్‌ కడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. దీనిపై తమకు సమాచారముందని చెప్పారు. ఆ ప్యాలెస్‌లు అన్నింటినీ తాకట్టు పెట్టి రుణాలు తేవచ్చు కదా? రైతులను ఎందుకు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వరద బాధితుల పట్ల ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. అకాల వర్షాలు, వరదలతో రైతులకు భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు కనీసం నిత్యావసరాలు కూడా అందలేదని ఆరోపించారు. 

‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తనను ఏ హోదాతో తిరుగుతున్నావని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మరి గాల్లో తిరిగే సీఎంను ఏమనాలి? బాధితులను ప్రభుత్వం ఎక్కడా ఆదుకునే పరిస్థితిలో లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో మూడు సార్లు పంట మునిగింది. రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా జగన్‌ తయారు చేశారు. రాష్ట్రంలో వరద ముంపునకు గురైన ఐదు జిల్లాల్లో ఎక్కడా పెట్టుబడి రాయితీ అందలేదు. రైతు రాజ్యం ఎలా అవుతుందో జగన్‌ సమాధానం చెప్పాలి. రైతులకు కూడా కులం అంటగట్టిన చరిత్ర జగన్‌ది. రైతు భరోసాను 14లక్షల మందికి కుదించారు. రైతులు వ్యవసాయం వదిలేసే పరిస్థితి తీసుకొచ్చారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారు. రూ.4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్లు బిగింపు తగదు. మీటర్లు బిగిస్తే పీకేసి సైకిళ్లకు కట్టి ఊరేగిస్తాం. ఏడాదిన్నరలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమేనా రైతు రాజ్యం. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించాలి. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలి. నాపై అవినీతి ఆరోపణలు చేసి తర్వాత ఎక్కడా ఏమీ లేదని తెలిసి ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతి అన్నారు. అక్కడా ఏమీలేదని తెలిసి చివరకు ట్రాక్టర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు పెట్టారు. ట్రాక్టర్‌తో కూడా ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయవచ్చని ఆ కేసు చూశాకే తెలిసింది’’ అని లోకేశ్‌ విమర్శించారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని