
తాజా వార్తలు
ఎన్నికల వేళ ప్రతిపక్షాల విన్యాసాలు: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలు ఏ కులం వారైనా న్యాయం చేయాలనేదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కులాలు, మతాలు, వర్గాలకతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి చేపడుతున్నామన్నారు. తెలంగాణ భవన్లో బీసీ సంఘాల నాయకులతో తెరాస నేతలు, మంత్రి ఈటల, కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్షాలు విన్యాసాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మాటల కంటే ఎక్కువగా చేతల ద్వారా తెరాస అభివృద్ధి చేసి చూపించిందన్నారు. సమస్యల పరిష్కారం కూడా తెరాస మాత్రమే చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. సంఘాలు, కులాలు, వర్గాల పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని, కులవృత్తులపట్ల నిబద్ధతతో పని చేసింది తెరాస ప్రభుత్వమే కేటీఆర్ వివరించారు.
ప్రతిపక్షాలది విష ప్రచారం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఈటల ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు తెరాస గుర్తింపు ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించేలా చేసిందని గుర్తు చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని వివరించారు. వెనకబడిన తరగతులకు చెందిన ఒక్కో విద్యార్థిపై రూ. 1,15,000 ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో అతి తక్కువ కాలంలోనే అణగారిన వర్గాలు, జాతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను తెరాస అమల్లోకి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. పేదలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం, విద్య అందించేందుకు తెరాస నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.