అసమ్మతి స్వరాన్ని అణచివేయలేరు: సుప్రీంకోర్టు

తాజా వార్తలు

Updated : 23/07/2020 13:40 IST

అసమ్మతి స్వరాన్ని అణచివేయలేరు: సుప్రీంకోర్టు

రాజస్థాన్ హైకోర్టులో విచారణపై స్టేకు నిరాకరణ
సచిన్‌ పైలట్‌ కు సుప్రీంలోనూ ఊరట

దిల్లీ: రాజస్థాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సచిన్‌ పైలట్‌ వర్గంపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్‌ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ స్పీకర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై  విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రాజస్థాన్ హైకోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సచిన్‌ పైలట్‌ వర్గానికి మరోసారి ఊరట లభించింది. రేపు సచిన్ పైలెట్ వర్గం పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాల అమలు మాత్రం సుప్రీంకోర్టులో వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా వెల్లడించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. 

ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపించలేరా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ మిశ్రా ప్రశ్నించారు. అంతేకాకుండా అసమ్మతి స్వరాన్ని అణచివేయలేరన్నారు.

అంతకుముందు స్పీకర్‌ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ రాజస్థాన్ హైకోర్టులోని కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోర్టును కోరారు. దీనిపై ఇప్పటికిప్పుడు అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్‌ విచక్షణాధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పీకర్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. స్పీకర్‌ అనర్హత వేటుపై నిర్ణయం తీసుకున్నాకే న్యాయసమీక్షకు అవకాశం ఉందని కపిల్‌ సిబాల్‌ కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందనే ప్రశ్న లేవనెత్తారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపడతామని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని