ఏపీలో పంచాయతీ పోరు ఉద్రిక్తం

తాజా వార్తలు

Updated : 09/02/2021 11:14 IST

ఏపీలో పంచాయతీ పోరు ఉద్రిక్తం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్రిక్తతల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో  సర్పంచి స్థానాలకు 7,506 మంది పోటీ చేస్తున్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. 

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది.  నాయకులు పరస్పరం తోపులాటకు దిగారు. పక్కనే ఉన్నవారు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగ పంచాయతీలో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని సర్పంచి అభ్యర్థి ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసి పంపిస్తున్నారంటూ సర్పంచి అభ్యర్థి నిరసన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వోకు ఫిర్యాదు చేశామని అయినా.. గుర్తులు రాసిన స్లిప్పులు వస్తున్నాయని సర్పంచ్‌ అభ్యర్థి ఆరోపించారు.

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపాలెం పంచాయతీలోని శంభునిపాలెం గ్రామంలో ఓటు వేసేందుకు గ్రామస్థులు నిరాకరించారు. కుల ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకపోవడంతో అధికారులు కొందరి  నామినేషన్లు తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శంభునిపాలెంలో ఉదయం 10 గంటలకు కూడా ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రాలేదు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినా  ఓటర్లు పట్టించుకోలేదు.

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద  ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు.

ఈనెల 6 నుంచి అదృశ్యమైన ఎల్‌ఎం కండిగ్ర సర్పంచి అభ్యర్థి మునిరాజు ఇవాళ ఉదయం చిత్తూరు జిల్లా వడమాల పేట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మునిరాజు మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యర్థులే కిడ్నాప్‌ చేశారని మునిరాజు భార్య జ్యోతి ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కత్తులతో దాడులకు దిగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని