మనలో మనం కొట్లాడుకుంటే దేశాన్ని గెలిపించలేం!

తాజా వార్తలు

Published : 26/06/2021 16:07 IST

మనలో మనం కొట్లాడుకుంటే దేశాన్ని గెలిపించలేం!

దిల్లీ:  కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశ రాజధాని నగరంలో మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం లెక్కలపై భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండో దశలో మెడికల్‌ ఆక్సిజన్‌ దొరక్క ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మనలో మనం పోట్లాడుకుంటే వైరస్‌దే గెలుపు అవుతుందని, కలిసికట్టుగా పనిచేసి దేశాన్నిగెలిపిద్దామని భాజపాకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఆక్సిజన్‌పై మీ పోరాటం ముగిస్తే.. మరో కార్యాచరణలోకి వెళ్దాం. థర్డ్‌ వేవ్‌లోనైనా ఎవరికీ ఆక్సిజన్‌ కొరత లేకుండా కలిసి ఓ వ్యవస్థను ఏర్పాటు చేద్దాం. రెండో దశలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. థర్డ్‌వేవ్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదు. మనలో మనం పోట్లాడుకుంటే కరోనా విజయం సాధిస్తుంది. మనమంతా ఐక్యంగా పోరాడితే దేశం గెలుస్తుంది’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

దిల్లీలో కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో తప్పుడు అంచనాలతో అవసరమైన దానికన్న నాలుగు రెట్లు అధికంగా ప్రాణవాయువును కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారని, తద్వారా ఇతర రాష్ట్రాలకు కొరత ఏర్పడి నష్టం జరిగిందంటూ భాజపా నేత సంబిత్‌ పాత్రా ఆరోపించారు. రాజధాని నగరంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగాన్ని ఆడిట్‌ చేసేందుకు సుప్రీంకోర్టు నియమించిన సబ్‌ గ్రూపు నివేదికలో ఈ వివరాలను పేర్కొందని చెప్పారు. దిల్లీ ప్రభుత్వానికి సెకండ్‌ వేవ్‌లో 209 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమైతే..  కేజ్రీవాల్‌ ప్రభుత్వం మాత్రం ఏకంగా 1140 మెట్రిక్‌ టన్నులను డిమాండ్‌ చేసిందంటూ భాజపా ఆరోపించింది. అవసరమైన దానికన్నా ఎక్కువగా డిమాండ్‌ చేయడం హేయమైన నేరమని, కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. 

అయితే, భాజపా ఆరోపణలపై నిన్ననే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘రెండు కోట్ల మంది ప్రజల ఊపిరి కోసం నేను పోరాడాను. అదే నేను చేసిన నేరమా..? మీరు (భాజపా) ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు.. నేను రాత్రుళ్లు మేల్కొని ప్రజలకు ప్రాణవాయువు అందించేందుకు కృషిచేశాను’ అంటూ ట్విటర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ విషయంలో భాజపా అబద్ధాలు చెబుతోందని  దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని