ఎన్నికల్లో గెలిస్తే హెలికాప్టర్‌, ఇంటికి ₹కోటి!

తాజా వార్తలు

Updated : 26/03/2021 01:39 IST

ఎన్నికల్లో గెలిస్తే హెలికాప్టర్‌, ఇంటికి ₹కోటి!

ఓటర్లలో చైతన్యం కోసం అసాధారణ హామీలు

చెన్నై: పక్షిలా ఆకాశాన్ని చుట్టేసేందుకు ఓ మినీ హెలికాప్టర్.. ఉండేందుకు మూడు అంతస్తుల మేడ.. ఖర్చులకు ఏడాదికి రూ.కోటి..  పెళ్లి చేసుకుంటే బంగారు ఆభరణాలు.. ఎప్పుడంటే అప్పుడు చంద్రుడి వద్దకు వెళ్లేందుకు ఉచిత రాకెట్‌ ప్రయాణం‌.. అబ్బా! ఇవన్నీ మనకు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కదూ? అయితే ఇవన్నీ ఎన్నికల హామీలని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఇంతకీ ఎవరా అభ్యర్థి? ఈ హామీల వెనుక అతడి అసలు ఉద్దేశమేమిటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల తులం శరవణన్‌ అసాధారణ హామీలు ప్రకటించి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రకటించిన హామీలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. గతంలో ఓ టీవీ జర్నలిస్టుగా పనిచేసిన శరవణన్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు రూ.20 వేల అప్పు కూడా చేశారు. తాను గెలిస్తే మాత్రం ఈ హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఇవే కాదు.. నియోజకవర్గ ప్రజలను నిత్యం చల్లదనం అందించేందుకు 300 అడుగుల కృత్రిమ మంచుకొండ, ప్రతి కుటుంబానికీ ఓ బోటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్‌ లాంచ్‌పాడ్‌ ఏర్పాటు చేస్తాననీ హామీల్లో పేర్కొన్నారు. అయితే, ఈ హామీలన్నీ ఊరికే చేయలేదని శరవణన్‌ చెప్పారు.

ప్రస్తుత రాజకీయాల్లో నీటిమూటల్లాంటి నేతల అసత్య మాటలను నమ్మకుండా ప్రజలను చైతన్యం చేసేందుకే తానూ ఈ హామీలు ప్రకటించినట్లు శరవణన్‌ వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడం పక్కన పెడితే ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం కలిగించడంలో విజయం సాధించానని చెప్పారు. ప్రచారానికి డబ్బులు లేకున్నా.. తన సహచరులతో పంపిన మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయన్నారు. దీనిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ ఆకర్షక హామీలను నమ్మి ఓటు వేస్తే అది చెత్తబుట్టలోకి వెళ్తుందని చెప్పేందుకే తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయనకు కేటాయించిన గుర్తు కూడా  చెత్తబుట్ట కావడం గమనార్హం. ఇప్పటికే తమిళనాట ప్రధాన పార్టీలన్నీ ‘ఉచిత’ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని