close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లక్ష్యాన్ని మించి తెరాస సభ్యత్వం

అత్యధిక నియోజకవర్గాల్లో 50 వేల కంటే ఎక్కువ
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన సభ్యత్వ నమోదుకు రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన లభించిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సభ్యత్వాలను అధిగమించడం శుభపరిణామమన్నారు. ప్రతి నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలను లక్ష్యంగా నిర్దేశించగా దాదాపు అన్ని చోట్లా అధిగమించారని, కొన్ని నియోజకవర్గాల్లో లక్ష సభ్యత్వం కూడా నమోదయిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో చేయించారంటూ కేటీఆర్‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను అభినందించారు. సభ్యత్వ నమోదుపై సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ బలమేమిటో మళ్లీ నిరూపితమయిందన్నారు. సభ్యత్వాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు ఆరు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సభ్యత్వ నమోదును మరికొన్ని రోజులు పొడగించాలని ఎమ్మెల్యేల నుంచి వినతులు వస్తున్నాయని, దీనిని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. సభ్యత్వ నమోదు పూర్తవుతున్నందున పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు అభినందనలు

సభ్యత్వ నమోదులో లక్ష్యాన్ని అధిగమించిన పలువురు శాసనసభ్యులకు కేటీఆర్‌ ఫోన్‌ చేసి ప్రత్యేకంగా అభినందించారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ సభ్యత్వాలను పూర్తి చేయించిన భూపాలపల్లి, నారాయణపేట, జనగామ ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదు రుసుం ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరుతోందని తెలిపారు. సభ్యత్వాల కంప్యూటరీకరణను నమోదుతో పాటే సమాంతరంగా చేపట్టామని, ఇప్పటికే సుమారు 50 శాతం వివరాలను డిజిటలీకరించామన్నారు. సభ్యత్వాల నమోదు పూర్తయినందున ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బూత్‌, గ్రామ, మండల కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని కేటీఆర్‌ ఆదేశించారు. మరో నెల రోజుల పాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు ఉన్నందున, క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పని చేయాలని ప్రధాన కార్యదర్శులకు సూచించారు. సిద్దిపేట, సిరిసిల్ల, హుజూరాబాద్‌, గజ్వేల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, బాల్కొండ, జూబ్లిహిల్స్‌, ఖమ్మం, నిర్మల్‌, పాలకుర్తి, మహేశ్వరం, సనత్‌నగర్‌ నియోజకవర్గాలు సభ్యత్వాల్లో ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు. సమీక్షలో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు శేరిసుభాష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, బండి రమేశ్‌, బస్వరాజ్‌ సారయ్య, బండా ప్రకాశ్‌, భరత్‌, తుల ఉమ, నరేంద్రనాథ్‌ నియోజకవర్గాల వారీగా నివేదికలను కేటీఆర్‌కు అందజేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు