దళితులు, పేదలకు అండగా పోరాటం: భట్టి
close

ప్రధానాంశాలు

దళితులు, పేదలకు అండగా పోరాటం: భట్టి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పేద, దళిత కుటుంబాల ప్రాణాలు, వారి హక్కులు కాపాడేందుకు పార్టీ తరఫున పోరాడతామని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క అన్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌పై ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశామని, మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తామని, అన్ని వ్యవస్థలను కదిలిస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వ హయాంలో దళితులు, గిరిజనులు, పేదలపై ఏడేళ్లుగా అనేక అకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా? వారి ప్రాణాలకు విలువే లేదా? అని ప్రశ్నించారు. రూ.2 లక్షల కోసం మరియమ్మ అనే దళిత మహిళను చిత్ర హింసలకు గురిచేసి అతికిరాతకంగా చంపేశారన్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి మరియమ్మ లాకప్‌డెత్‌, ఆమె కుమారుడు ఉదయ్‌ కిరణ్‌ ఆర్తనాదాలు వినిపించడం లేదా? అని నిలదీశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా? అనే అనుమానం వ్యక్తంచేశారు. పదోన్నతుల కోసం పోలీసులు ఇలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

హైకోర్టు న్యాయమూర్తితో విచారణ: మందకృష్ణ

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ అనే దళిత మహిళ మృతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అడ్డగూడూరు ఎస్సై, కానిస్టేబుళ్లను పోలీస్‌ శాఖ నుంచి శాశ్వతంగా తప్పించాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. మరియమ్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని