ఇక రాజస్థాన్‌ తంతు..!

ప్రధానాంశాలు

ఇక రాజస్థాన్‌ తంతు..!

రాహుల్‌, ప్రియాంకలతో పైలట్‌ భేటీ

మార్పులు-చేర్పులపై ఊహాగానాలు

ఈనాడు - దిల్లీ, జైపుర్‌: కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మరో రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ శుక్రవారం కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం పంజాబ్‌లో ముఖ్యమంత్రి మార్పు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాజస్థాన్‌లోనూ మార్పులు-చేర్పులు ఉంటాయన్న ఊహాగానాలకు తెర లేచింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్ల మధ్య చాలాకాలంగా పొసగడం లేదన్నది అందరికీ తెలిసిందే. తాజాగా రాహుల్‌, ప్రియాంకలతో పైలట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్నది అధికారికంగా వెల్లడించనప్పటికీ.. మంత్రివర్గ విస్తరణ, వ్యవస్థాపక మార్పులపై చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చాలాకాలంగా మంత్రివర్గ విస్తరణ, వివిధ కార్పొరేషన్‌ పదవుల భర్తీకి పైలట్‌ పట్టుబడుతున్నారు. వాటిని తనకు సన్నిహితంగా ఉంటున్నవారికి కట్టబెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌ పీసీసీ పగ్గాలను పైలట్‌కు అందిస్తారన్న ప్రచారమూ ఉంది. సచిన్‌ పైలట్‌ గురువారం అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ సీపీ జోషితో భేటీ కావటం కూడా చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజుల్లో పైలట్‌ ఆయనను కలవడం ఇది రెండో సారి. దీంతో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేస్తోందా? లేదా ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా పేరుపొందిన జోషి.. గహ్లోత్‌, పైలట్‌ల మధ్య సయోధ్యకు కృషి చేస్తున్నారా? అన్న చర్చలు సాగుతున్నాయి. రాహుల్‌ సూచనల మేరకు ఇదంతా సాగుతుందేమోనన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోనూ రాజకీయ వేడి..

రాయ్‌పుర్‌: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోనూ రాజకీయాలు రాజుకుంటున్నాయి. సీఎం పగ్గాలను నిలుపుకోవడానికి ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌.. చేజిక్కించుకోవడానికి ఆరోగ్య మంత్రి టీ.ఎస్‌. సింగ్‌తదేవ్‌లు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ దిగువ స్థాయిలో రాజకీయ కాక పెరుగుతోంది. ఇటీవల పంజాబ్‌లో నాయకత్వ మార్పు కూడా దీనికి తోడవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని